calender_icon.png 18 October, 2024 | 6:02 PM

ప్రాణశక్తికి మూలం

18-10-2024 12:00:00 AM

పంచభూతాలు, సూర్యనాడి, చంద్రనాడి కలిపి శరీరం ఏడు భూమికలు. వీటన్నిటికీ అధిపతి ఆత్మ. అయితే, మనిషి శరీరాన్ని ధరించి జీవించవలసి ఉన్నందున, అతడికి 9 శక్తులు అవసరమవుతాయి. నింగి, గాలి, నిప్పు, నీరు, భూమి ప్రధాన మైన అయిదు శక్తులు కాగా, మనసు, వాక్కు వంటి మిగిలిన శక్తులు కలిసి మనిషిని నడిపిస్తాయి. ఇదంతా ఒక సమైక్య, సమాఖ్య చైతన్య భూమిక.

ఈ తొమ్మిది శక్తులను కంటికి కనబడకుండా నడిపించేదే ప్రాణశక్తి.

ప్రాణమన్నా, వాయువన్నా ఒకటే. సర్వేంద్రియాలను నడిపించే శక్తి అంతా వాయు శక్తే. అదే మనిషి ఆయువు. వాయువు తన కార్యకలాపాలను ఆపి శరీరం నుండి బయటకు వెళ్ళటాన్ని ‘ఆయువు తీరటమని’ అంటాం. అదే మరణం. అంటే శరీరం, దానిని ఆశ్రయించి తమ కార్యకలాపాలను సాగించే ఇంద్రియాలు, ప్రాణశక్తికి లోబడి ఉంటాయన్న మాట. ప్రాణం పోయేవరకు ఉన్నదే అమరత్వ స్థితి. ప్రాణం పోతే మృతత్వం. ప్రాపంచిక సమస్త కార్యక్రమాల నిర్వహణకు ప్రాణశక్తే మూలం. విద్యాభ్యసనం మొదలుగా కడ శ్వాస వరకు ప్రాణశక్తే మనిషిని నడిపిస్తున్నది.

ఈ ప్రాణశక్తే ఇచ్ఛా, క్రియా, జ్ఞాన శక్తులుగా మనిషిని ధీర, వీర, గంభీర, ఉదాత్త స్థితులలో నడిపిస్తున్నది. ఇదొక అద్భుతమైన శక్తి త్రిపుటి. తల్లి గర్భంలో పిండం గా, ఆపై శిశువుగా, కౌమార, యౌవనాది దశలలో మనుష్యత్వాన్ని పరిపూర్ణమైన అనుభవంగా ఆవిష్కరించేది ఈ ప్రాణశక్తే!

కన్ను చూడాలన్నా, చెయ్యి కదలాలన్నా, చెవి వినాలన్నా ఆయా ఇంద్రియాలకు వాయు ప్రసారం ప్రస న్నంగా జరగాలి. అంటే, ప్రాణశక్తి సమానంగా, ప్రశాంతంగా ప్రవహించాలి. ఇదొక సమన్వయ క్రీడ. దీనికి ధీశక్తి, నిగ్రహం, సహనం, సమభావన, సమతుల్యం అవసరం. ఈ సమన్వయ సాధనే, అధ్యాత్మ సాధన. ఇదే నిజమైన యోగం.

సర్వత్రా వ్యాపించి ఉన్న వాయుతత్వమే సత్యం. అదే ఆత్మ! ఆత్మ నుంచీ వెలువడే శక్తే ప్రాణం. బింబ ప్రతిబింబాల వలె ఆత్మ, ప్రాణశక్తి భిన్నం కావు. వస్తువు లేకపోతే నీడ ఏర్పడని విధం ఇది. ఆత్మవలే ప్రాణశక్తి సర్వవ్యాపకం.

మూల వాసనల నుంచి వాసన లు; వాసనల నుంచి సంస్కారాలు; సంస్కారాల నుంచి ఆలోచనలు; ఆలోచనల నుంచి వాక్కు; వాక్కు నుంచి కర్మలు; కర్మల నుంచి జన్మలు; జన్మల నుంచి కర్మలు... పునరావృత్తిగా (అంటే, మరల మరల) జరిగే కార్యక లాపంగా, నిరంతరాయంగా సాగుతూనే ఉంటుంది. ఈ కలాపమంతా శరీరం లోపలే జరుగుతుంది. దీనిని “జరిపిస్తున్నదెవరు?” అన్న ప్రశ్నకు “ప్రాణశక్తే” అన్నది సమాధానం.

కాల, కార్య, కారణ, కర్తవ్య విధి విధానం లో భాగంగానే అప్పుడప్పుడు ఈ ప్రాణశక్తి, తాను నిర్మించుకున్న శరీరం నుంచీ బయటకు వెళ్ళి తిరిగి శరీరంలోకి ప్రవేశించన పుడు, ఆ స్థితిని ‘మరణం’ అంటాం. అంటే మరణం ప్రాణశక్తికి చివరి స్థితి కాదు. శరీరం దహింపబడుతున్నది కానీ, ప్రాణశక్తి అవ్యయంగా ఉంటున్నది. ఇదే ఎరుక! ఈ ప్రాణ శక్తి, శరీరంలో అగ్నిరూపంలో ఉంటున్నది.

ఇదొక సప్తజ్వాలికా మాలిక! అది వైశ్వానర రూపం! కనటం, వినటం, అనటం, శ్వాసించటం, నిశ్వాసించటం... ఈ ఐదు కలాపాలు ముఖ్య ప్రాణశక్తుల వల్లనే సంభవమవుతాయి. నిలపటం, ఆపై వదల టం ఈ రెండూ అంతర్జ్వాలలు. ఈ ఏడు నాలుకలతో ఆహారం ఒంట్లోని అన్ని అవయవాలకు అవసరమైన శక్తిని ప్రాణశక్తులు మోసుకొని వెళతాయి. కనుక, వీటి ని ‘వాహకాలు’ అంటాం. మోసుకు వెళ్ళే శక్తి మాత్రం వాయువుదే అంటే ప్రాణశక్తిదే.

నాలుగు విధాలుగా ఆహారం మనిషికి విభజితం అవుతుంది.. అదీ ప్రాణశక్తి ద్వారా! ఒక భాగం గత జన్మల సంచిత కర్మలను శమింపచేయటానికి. రెండో భాగం వర్తమాన జీవితాన్ని శక్తిమంతం చేయటానికి. మూడో భాగం జీవితాన్ని అధ్యాత్మ మార్గంలో నడిపించటానికి.

నాలుగో భాగం రాబోయే జీవితాన్ని సమగ్ర సుందరం చేయటానికి! కనుక, ప్రాణశక్తే సర్వశక్తుల నిలయం. ఏ శక్తినీ దుర్వినియోగం చేయరాదు. అంటే, మనిషి తన శరీరాన్ని శక్తి క్షేత్రంగానే అనుభవించాలి. పిప్పలాద మహర్షి హృదయం అద్భుత రహస్యాలను ఆవిష్కరిస్తున్నది. జిజ్ఞాసువులకు మహర్షి అనుగ్రహించిన సమాధానం అమృతోపమానమై రసాస్వాదన కలిగిస్తున్నది.

- వి.యస్.ఆర్.మూర్తి