calender_icon.png 23 October, 2024 | 7:04 PM

ఆత్మ క్షేత్రం!

14-06-2024 12:00:00 AM

కంటికి కనపడకుండా కదిలిస్తున్నదీ, అంతటా అన్నిటా ఉన్నదీ, చావు పుట్టుకలు ఎరుగని శాశ్వతము, నిత్యము, సత్యముగా ఉన్నదీ, ఎవరైనా ఎప్పటికైనా స్పృశించవలసినదీ ఒక్కటే, అదే ఆత్మ! కర్మేంద్రియాలను, జ్ఞానేంద్రియాలను, మనసును ప్రేరేపించేదే ఆత్మ. ఈ విషయమంతా భౌతిక పదార్థవిజ్ఞానానికి అందేది కాదు. మనసును, బుద్ధిని, చిత్తాన్ని దాటి అంతరంగస్ఫురణ, అహంస్ఫురణ కలిగినవాడే ఆత్మను తన పరిధిలో అనుభూతిమయం చేసుకోగలుగుతాడు. ఇది తీవ్ర సాధనవలననే సాధ్యం. 

అందరియందు తనను, తనయందు అందరినీ చూడగలిగిననాడే ఆత్మావలోకనం కలుగుతుంది. మానవ జన్మకు పరమార్థం ఇదే! గమ్యమూ ఇదే. ఈ స్థితిని అందుకున్నవాడు ద్వేషాన్ని, పగను, న్యూనతను వదిలి తన హృదయాన్ని ప్రేమమయం చేసుకుంటాడు. ప్రేమభావం కారణంగా తాను చేస్తున్న పనులన్నిటిని సేవగా చేస్తాడు. 

ప్రేమకు అందరిని ఏకం చేయగల శక్తి ఉన్నది. అది సేవగా ఆచరణాత్మక స్థాయిని అందుకున్నప్పుడు, సంఘజీవనం ఔదార్యభూమికలో నందనారామమై శోభిల్లుతుంది. సత్పురుషుల జీవితాలు ఈ రెండు భావాలకు భాష్యంగా నిలుస్తయ్. పద్దెనిమిది పురాణాల సారమే ఇది. కథను, కథనాన్ని పక్కకు నెట్టి అంతరార్థం గ్రహించగలిగితే ఆత్మకున్న రెండు పార్శలు ప్రేమ, సేవగా స్పష్టమవుతాయి. అందుకే సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ అన్న మాట ఏర్పడింది. ఇక్కడ బ్రహ్మమంటే ఆత్మ అని అర్థం. శంకరభగవత్పాదులు చేప్పిన బ్రహ్మసత్యం అంటే ఇదే.

ఈ మూలాన్ని ఎరిగిన మరుక్షణం మనిషి తన అహాన్నీ, మోహాన్నీ వదుల్చుకుని ఆత్మ స్వరూపంగా తనను తాను దర్శించుకుంటాడు. సమస్యంతా నేను వేరు, ఆత్మ వేరు అన్న అజ్ఞానంలోనే ఉంది. ఆత్మే అసలు నేను. నేనుగా అనుకుంటున్న, విశ్వసిస్తున్న నేను కేవలం మేనే! అంటే దేహమే! ఈ ఒక్క సత్యాన్ని తన స్వభావంగా మార్చుకోగలిగితే మనిషి జీవన దృక్పథం మారిపోతుంది. అంతటా ఆత్మను దర్శించగలస్థితి మహనీయమైనది.

ఊహామాత్రమైన స్వర్గలోక భావననుండి బయటపడి భూలోకమంతా పరమ రమణీయంగా దర్శనమౌతుంది. కావలసింది ఇదే. అధివాస్తవిక జీవితమంటే ఆత్మభావనతో జీవించటమే. అద్వైత, అద్వయ, రమణీయ, మనోజ్ఞస్థితి ఇదే.

పిపీలికాది బ్రహ్మపర్యతం నిండి ఉన్నది ఆత్మస్థితే. వృత్తిని బట్టి వ్యక్తిని అంచనా వేయడం ఆగి, అతడి ప్రవృత్తిని, అతడు అనుసరిస్తున్న నివృత్తి మార్గాన్ని గౌరవించటంతో అసమాన మానసిక భావనలు తొలగి, సామాన్యంగా కనిపించే క్షేత్రమంతా ధర్మ, కర్మ క్షేత్రమవుతుంది. ఈ నేపథ్యంలోనే కర్మఫలాలను ఇతరులకోసం త్యాగం చేయడం సాధ్యమవుతుంది.

ఆత్మ విచారణ, సంచారణ తీవ్రతరం అవుతుంది. మనిషి తన మూలాన్ని సానందంగా అనుభవిస్తాడు. స్పష్టంగా నియమబద్ధం, కాలబద్ధం, కార్యకారణబద్ధం. సంక్షిష్టత నుండి సరళత్వంవైపు ఆలోచనలను నడిపించగల స్థితిని ఈ ఆత్మానుభవం అనుగ్రహిస్తుంది. ఈ నియమాన్ని అనుసరించి ఆనందమయ, ఆహ్లాదమయ, ఆయుష్మంత జీవితాన్ని జీవించగల నేర్పే, ఋతంభరా ప్రజ్ఞ!

లౌకిక, పారలౌకిక తత్తమంతా నిజానికి ఒకటి కావాలి. ఆవిష్కరణ జరగనంతవరకు అది విత్తు! ఆవిష్కృతం కాగానే అది వృక్షం! వేళ్లు, కాండలు, కొమ్మలు, రెమ్మలు, ఆకులు, పూలు, కాయలు, పండ్లు.. ఎంతో వైవిధ్యంగా కనబడే చెట్టుమూలం మాత్రం విత్తే! వైరుధ్యమెరగని వైనమిదే!

ఈ ఆధ్యాత్మిక దృష్టే సమ్యక్ దృష్టి, భిన్న భిన్నంగా గోచరిస్తున్నా, మార్గాలన్నీ ఒకే గమ్యంవైపు నడిపించి, సత్యాన్వేషణను అందంగా ముగించి, ఆత్మానుభూతిని సంస్థితం చేస్తయ్. మానవజన్మ పరమార్థం ఇదే. 

ఈశోపనిషత్ ఆత్మపధగామికి ఎన్నో మార్గాలను పరిచయం చేస్తూ, వీటన్నిటినీ ఆచరించటం ఆరంభించమని, ఆచరణతో అనుభవాన్ని పొంది, అనుభూతిని స్థిరం చేసుకుని, జీవితాన్ని శతపత్ర సుందరంగా జీవించమంటుంది. పరమచరమమైన పరమానందాన్ని హాయిగా పొందమంటుంది. వసుధైక కుటుంబ నిర్మాణానికి తొలి అడుగు వేయమంటుంది. జాతి, మత, వర్గ వర్ణాలను సమన్వయ రీతిలో సహజీవనం చేయమంటుంది.

ఆర్థిక న్యాయాలకు అతీతంగాహార్ధిక సౌహార్ద్రభూమికను సుస్థిరం చేయమంటుంది. సర్వసంస్కృతులలో దాగివున్న అంతస్సూత్రాన్ని తెగిపోకుండా, నిలబెట్టుకోమంటుంది. కలహం, ద్వేషం విడనాడి ఆనందం, ఉత్సాహం, సామర్థ్యం, శాంతి, ప్రేమ, సహనం, సేవ వంటి ఆదర్శభావాలతో జీవితాన్ని నింపుకోమంటుంది. కల్లోల క్షుభిత ప్రపంచానికి ఆశాదీపాన్ని, దారిదీపంగా చేతికందిస్తున్న ఈశోపనిషత్, బహుధా ఆచరణీయం. అదొక అనుష్ఠానభూమిక.

 వీఎస్‌ఆర్ మూర్తి