calender_icon.png 11 October, 2024 | 9:52 AM

పదోసారీ ఆర్బీఐ సారీ

10-10-2024 12:00:00 AM

వడ్డీ రేట్లు యథాతథం

విధాన వైఖరిలో మార్పు

ముంబై, అక్టోబర్ 9: రిజర్వ్‌బ్యాంక్ తన కీలక వడ్డీ రేటును వరుసగా పదోసారీ యథాతథంగా అట్టిపెట్టింది. అయితే భవిష్యత్తులో రేట్ల తగ్గింపునకు తొలి అడుగుగా తన కఠిన విధాన వైఖరిని న్యూట్రల్‌కు మార్చిం ది. రెపొ రేటులో ఎటువంటి మార్పు చేయరాదంటూ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) నిర్ణయించింది.

ఆరుగురు సభ్యులుగల ఎంపీసీలో ఐదుగురు రేట్లను యథా తథంగా అట్టిపెట్టేందుకు ఓటు చేశారు. ఎంపీసీని ఇటీవల కేంద్ర ప్రభుత్వం పునర్‌వ్యవస్థీకరించి ముగ్గురు కొత్త సభ్యుల్ని నియమించిన సంగతి తెలిసిందే. కేంద్రం నియమిత సభ్యులుకాకుండా ఆర్బీఐకి చెందిన మరో ముగ్గురు అధికారులు కమిటీలో ఉంటారు. గవర్నర్‌తో పాటు ఏడుగు రు సభ్యులు ఉండే కమిటీలో మెజారిటీ ఓటింగ్‌కు అనుగుణంగా పాలసీ నిర్ణయాలు వెలువడతాయి. 

మూడు రోజులు ఎంపీసీ మావేశం అనంతరం బుధవారం కమిటీ నిర్ణయాన్ని శక్తికాంత్ దాస్ వెల్లడించారు.  ప్రస్తుతం ఆర్బీఐ రెపో రేటు 6.5 శాతం వద్ద ఉన్నది. వాణిజ్య బ్యాంక్‌లకు ఆర్బీఐ ఇచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీ రేటునే రెపో రేటుగా వ్యవహరిస్తారు. రెపో రేటు తగ్గితే బ్యాంక్‌లు ఇచ్చే గృహ, ఆటో, కార్పొరేట్ రుణాలపై వడ్డీ రేట్లు సైతం తగ్గుతాయి.

ఆర్బీఐ విధాన వైఖరిని ‘విత్‌డ్రాయిల్ ఆఫ్ అకామడేషన్’ నుంచి ‘న్యూట్రల్’కు మార్చేందుకు ఎంపీసీ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. 2023 ఫిబ్రవరిలో రెపో రేటును 6.25 శాతం  నుంచి 6.50 శాతానికి పెంచిన తర్వాత ఇప్పటివరకూ 10 పాలసీ సమీక్షల్లోనూ ఆర్బీఐ యథాతథంగా అట్టిపెట్టింది.

అయితే వైఖరిని మార్చుకున్నందున, తదుపరి ఎంపీసీ సమావేశాల్లో రేట్ల తగ్గుదలకు అవకాశం ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వైఖరిలో మార్పు చేసినందున, డిసెంబర్ సమీక్షలో వడ్డీ రేటు తగ్గించే ఛాన్స్ ఉన్నదని ఇక్రా చీఫ్ ఎకానమిస్ట్ అదితి నాయర్ చెప్పారు. కానీ రేట్ల కోత పరిమితంగా ఉండవచ్చని, రెండు సమీక్షల్లో పావు శాతం చొప్పున తగ్గించే అవకాశం ఉన్నదని అంచనా వేశారు.

2024 డిసెంబర్‌లో పావు శాతం, 2025 ఫిబ్రవరిలో పావుశాతం మేర వడ్డీ రేట్లను తగ్గించవచ్చని నాయర్ అంచనాల్లో పేర్కొన్నారు.  రేట్ల కోతల్ని ప్రారంభించేముందు, ద్రవ్యోల్బణం ట్రెండ్స్‌పై మరింత స్పష్టత కోసం ఆర్బీఐ వేచిచూస్తుందని బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ ఎకానమిస్ట్  మదన్ సబ్నవీస్ పేర్కొన్నారు. ఇజ్రాయిల్ ఉద్రిక్తతలు తీవ్రతరమైతే, ద్రవ్యోల్బణం ట్రెండ్‌పై మరింత అనిశ్చితి నెలకొంటుందన్నారు.

ప్రస్తుతానికి రేట్ల కోతపై మాట్లాడను: శక్తికాంత్ దాస్

సమీప భవిష్యత్తులో ద్రవ్యోల్బణం తగ్గుతుందన్న విశ్వాసంతో తమ విధాన వైఖరిని ‘న్యూట్రల్’ మార్చామని, తద్వారా ధరల పెరుగుదల, వృద్ధి మధ్య సమతౌల్యం ఏర్పడుతుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ చెప్పారు. అయితే భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ద్రవ్యోల్బణానికి ‘భారీ రిస్క్‌లు’ పొంచి ఉన్నాయని, అందుచేత ప్రస్తుతానికి రేట్ల కోతపై మాట్లాడటం సబబు కాదని అన్నారు.

ఇప్పటివరకూ కొనసాగిన ‘విత్‌డ్రాయిల్ ఆఫ్ అకామడేషన్’ నుంచి ‘న్యూట్రల్’కు విధాన వైఖరిని మార్చడమంటే వడ్డీ రేట్లు గరిష్ఠస్థాయికి చేరినట్లేనే అన్న ప్రశ్నకు దాస్ స్పందిస్తూ దీనిని ఇతరులు విశ్లేషించుకోవాలన్నారు. ఆర్బీఐ ఎంపీసీ ద్రవ్య విధాన సమీక్ష అనంతరం గవర్నర్ మీడియాతో మాట్లాడుతూ జీడీపీ వృద్ధి, ద్రవ్యల్బోణం మధ్య సమతౌల్యం ఉంటుందన్న దృష్టితో వైఖరిలో మార్పు చేశామని చెప్పారు.

ఆర్బీఐ కోరుకున్నదానిని (ద్రవ్యోల్బణం 4 శాతానికి అదుపు) సాధించిందున, గత వైఖరిని కొనసాగించాల్సిన అవసరం లేదని భావించామన్నారు. అయితే భవిష్యత్తు అంతా ‘అనిశ్చితుల మయం’గా దాస్ అభివర్ణించారు. ఈ అనిశ్చితులు, రిస్క్‌లను తక్కువగా అంచనావే యడం సరికాదని, ఈ కారణంగా ప్రస్తుతానికి రేట్ల కోత సమయంపై మాట్లాడు కోవడం కరెక్టు కాదన్నారు. లిక్విడిటీ గుర్రపు పగ్గాలు వదిలితే, అది విజృభిస్తుందని, ఆ విషయంలో ఆర్బీఐ చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు. 

డిసెంబర్‌లో తగ్గుతాయా?

వచ్చే డిసెంబర్ సమీక్షలో లేదా అంతకంటే ముందుగా రేట్ల కోత కోసం చూడవచ్చా అన్న ప్రశ్నకు ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ మైఖల్ పాత్రా స్పందిస్తూ ప్రస్తుతానికి తాము ద్రవ్యోల్బణంపైనే దృష్టి పెట్టామని, అక్టోబర్‌లో ద్రవ్యోల్బణం 5 శాతాన్ని మించుతుందని అంచనా వేస్తున్నామన్నారు. తదుపరి చర్యలు చేపట్టే ముందు ద్రవ్యోల్బణంపైనే తాము దృష్టి పెట్టామన్నారు.

పాలసీ ప్రధానాంశాలు

* రెపో రేటు 6.5 శాతం వద్ద యథాతథం. 2023 ఫిబ్రవరి నుంచి మార్పులేని వడ్డీ రేట్లు

* ద్రవ్య విధాన వైఖరి ‘న్యూట్రల్’కు మార్పు

* మానిటరీ పాలసీ కమిటీలో కొత్త సభ్యులు చేరిన తర్వాత ఇది తొలి సమావేశం

* ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి అంచనా 7.2 శాతం. క్యూ2లో 7 శాతం, క్యూ3లో 7.4 శాతం, క్యూ4లో 7.4 శాతం వృద్ధి సాధించవచ్చన్న అంచనా

* ప్రస్తుత 2024-25 ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యోల్బణం అంచనా         4.5 శాతం

* యూపీఐ123 పే (ఫీచర్ ఫోన్‌కు) ఒక్కో లావాదేవీ పరిమితి రూ. 5,000 నుంచి రూ.10,000కు పెంపు

* యూపీఐ లైట్ వ్యాలెట్ లిమిట్ రూ.5,000కు పెంపు. ఒక్కో లావాదేవీ పరిమితి రూ.500 నుంచి రూ.1,000కు పెంపు

* తదుపరి ఆర్బీఐ ఎంపీసీ                సమావేశం డిసెంబర్ 4 నుంచి            6 వరకూ.