మహారాష్ట్ర శివాజీ విగ్రహం ఘటనపై ప్రధాని మోదీ
మొదటి నుంచి శివాజీని ఆరాధిస్తున్నానని వెల్లడి
ముంబై సమీపంలో మరో పోర్టుకు శంకుస్థాపన చేసిన ప్రధాని
పేదలకు 27 లక్షల కోట్ల రుణాలు అందించామని స్పష్టం
డిజిటల్ పేమెంట్స్‌లో భారత్ అగ్రగామిగా ఉందని ప్రశంస
ముంబై, ఆగస్టు 30: మహారాష్ట్రలో సింధుదుర్గ్ జిల్లాలో ఛత్రపతి శివాజీ విగ్రహం కూలిపోయిన ఘటనపై ప్రధాని నరేంద్రమోదీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై శుక్రవారం మహారాష్ట్ర పర్యటనలో ప్రధాని మోదీ క్షమాపణలు తెలియజేశారు. రాష్ట్రంలోని పాల్‌ఘాట్‌లో నిర్మించనున్న వధ్‌వాన్ పోర్ట్ శంకుస్థాపన కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శివాజీ విగ్రహం ఘటనపై మాట్లాడుతూ.. మహారాష్ట్రలో దిగిన వెంటనే విగ్రహం కూలటంపై శివాజీకి క్షమాపణలు చెప్పాను. ఛత్రపతిని దైవంగా భావించేవారు తీవ్ర వేదనకు గురయ్యారు. వారందరికీ శిరస్సు వంచి క్షమాపణలు తెలియజేస్తున్నాను. నేను కూడా ఈ ఘటనతో తీవ్ర మనోవేదనకు గురయ్యాను. మనకు ఈ దైవం కంటే గొప్పదేమీ లేదు అని మోదీ పేర్కొన్నారు.
వాళ్లకు ఇంగితజ్ఞానం కూడా లేదు
విగ్రహం కూలిపోవడంపై విమర్శలు చేస్తున్నవారికి మోదీ కౌంటర్ ఇచ్చారు. మనమంతా శివాజీని దేవుడిలా కొలుస్తాం. కానీ కొందరు వ్యక్తులు దేశభక్తులను అవమానిస్తున్నారు. వీర్ సావర్కర్‌ను కూడా ఇష్టారీతిన తిట్టిపోశారు. దేశభక్తులను అవమానించినవారు కూడా క్షమాపణలు చెప్పాల్సిందే. సమరయోధులను గౌరవించాలన్న ఇంగితజ్ఞానం కూడా వారికి లేదు. అయితే, క్షమాపణలు విషయం పక్కనబెడితే కోర్టుకు వెళ్లి పోరాటం చేసేందుకు మాత్రం సిద్ధమయ్యారు అని ప్రతిపక్షాలను ఉద్దేశించి తీవ్ర స్థాయిలో విమర్శించారు. 2013లో తనను బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించినప్పుడు మొదట రాయ్‌గఢ్‌లోని శివాజీ సమాధిని దర్శించుకున్నానని మోదీ తెలిపారు. అప్పటి నుంచే ఆయన కొత్త ప్రయాణం ప్రారంభమైందని, శివాజీ ముందు ఓ భక్తుడిలా కూర్చునే తన జీవితం సాగిందని వివరించారు.
27 లక్షల కోట్ల రుణాలు
ప్రపంచంలోనే అతివేగంగా భారత్ ఆర్థికపరంగా సాంకేతికతను ఉపయోగిస్తోందని ప్రధాని మోదీ అన్నారు. ముంబైలో జరిగిన గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ మాట్లాడుతూ.. గత పదేళ్లలో 31 బిలియన్ డాలర్ల పెట్టుబడులను సాధించి మన స్టార్టప్‌లు 500 శాతం వృద్ధి సాధించాయి. చిరుతిండ్ల నుంచి విమానాశ్రయం వరకు డిజిటల్ పేమెంట్లు కనిపిస్తున్నాయి. ప్రపంచంలో అతిపెద్ద మైక్రోఫైనాన్స్ పథకం ముద్ర యోజన కింద రూ.27 లక్షల కోట్లకు పైగా రుణాలు అందించాం. చౌకైన మొబైల్ డాటా, జీరో బ్యాలెన్స్ జన్‌ధన్ ఖాతాలు ఈ వృద్ధికి కారణం. నేడు 53 కోట్ల మందికిపైగా జన్‌ధన్ ఖాతాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా యూపీఐ సేవలు ౨౪ గంటలు పనిచేస్తున్నాయి అని మోదీ సందర్భంగా వివరిచారు.
వధ్‌వాన్ పోర్టుకు శంకుస్థాపన
మహారాష్ట్ర పాల్‌ఘర్‌లో రూ.76 వేల కోట్లతో నిర్మించనున్న వధ్‌వాన్ డీప్ సీ పోర్టుకు ప్రధాని మోదీ శుక్రవారం శంకుస్థాపన చేశారు. మహారాష్ట్రకు చేరుకునే ముందే ఇదెంతో ప్రత్యేకమైన ప్రాజెక్టు అని మోదీ పేర్కొన్నారు. దేశాభివృద్ధికి ఈ పోర్టు కీలకమని, అంతేకాకుండా మహారాష్ట్ర మరింత వేగంగా పుంజుకునేందుకు ఊతమిస్తుందని ఎక్స్ వేదికగా ప్రకటించారు. పోర్టుకు సంబంధించిన కీలకాంశాలు..
- * పాల్‌ఘర్ జిల్లాలోని దహను పట్టణానికి సమీపంలో ఈ పోర్టును నిర్మించనున్నారు. దేశంలోనే అతిపెద్ద డీప్ సీ పోర్టుగా ఇది నిలవనుంది. ఈ పోర్టు ద్వారా అంతర్జాతీయ షిప్పింగ్ మార్గాలకు నేరుగా అందుబాటులో ఉంటుంది. తద్వారా రవాణా సమయం, ఖర్చులు తగ్గుతాయి.
- * దేశ వాణిజ్యం, ఆర్థిక వృద్ధిని పెంచే ప్రపంచస్థాయి సముద్ర ద్వారాన్ని ఏర్పాటు చేయడం ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. అంతేకాకుండా ఈ పోర్టు దేశానికి సముద్ర కనెక్టివిటీని మెరుగుపరుస్తుంది. ప్రపంచ వ్యాణిజ్య కేంద్రంగా భారత్ స్థానాన్ని మరింత బలోపేతం చేస్తుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
- * ఈ ఓడరేవు అతిపెద్ద కంటైనర్ నౌకలు, పెద్ద పెద్ద కార్గో షిప్పులు, లోతుగా ప్రయాణించే నౌకలకు హాల్టింగ్ సౌకర్యం ఇవ్వగలుగుతుంది.
- * ముంబైలోని ప్రధాన పోర్టు, జవహార్‌లాల్ నెహ్రూ నౌకాశ్రయ ట్రస్ట్ (ప్రస్తుతం అత్యంత లోతైన ఓడరేవు) తర్వాత మూడో అతిపెద్ద ఓడరేవుగా వధ్‌వాన్ అవతరించనుంది. అంతేకాకుండా ఈ రెండు పోర్టుల మధ్య జాయింట్ వెంచర్‌గా వధ్‌వాన్ సేవలు అందించనుంది. ఈ పోర్టు మొత్తం 17,471 హెక్టార్ల ప్రాంతాన్ని కవర్ చేస్తుండగా.. 16,096 హెక్టార్లు నౌకాశ్రయ పరిధిలోకి వస్తుందని అంచనా.
- * ప్రస్తుతం దేశంలోనే అత్యధిక కంటెయినర్ల తాకిడి ఉన్న జవహార్‌లాల్‌నెహ్రూ పోర్టుపై ఒత్తిడి తగ్గించేందుకు వధ్‌వాన్ ఓడరేవు ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఈ ప్రాంతం గుజరాత్, రాజస్థాన్, మధ్య భారతదేశానికి సమీపంలో ఉండటం కూడా కలిసివచ్చే అంశం. ఈ ఓడరేవు నిర్మాణంతో ఉపాధి అవకాశాలతో పాటు స్థానిక వ్యాపారాలకు ప్రోత్సాహం అందించనున్నాయి.