రాంచీలోని మొరహాబాదీ మైదానంలో కార్యక్రమం
హాజరైన ఇండియా కూటమి నేతలు
సోషల్ మీడియా వేదికగా ప్రధాని శుభాకాంక్షలు
రాంచీ, నవంబర్ 28: జార్ఖండ్ ముక్తి మోర్చ(జేఎంఎం) నేత హేమంత్ సోరెన్ జార్ఖండ్ 14వ ముఖ్యమంత్రిగా గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. రాంచీలోని మొరహాబాదీ మైదానంలో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్ సంతోష్ కుమార్ గంగ్వార్ ఆయనతో ప్రమాణం చేయించారు.
దీంతో ఇప్పటి వరకు మూడు సార్లు సీఎంగా పని చేసిన సోరెన్.. తాజాగా నాలుగోసారి బాధ్యతలు చేపట్టారు. సోరెన్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రివాల్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ సహా తదితర ఇండియా కూటమి నేతలు హాజరయ్యారు. ఎక్స్ వేదికగా ప్రధాని నరేంద్రమోదీ సోరెన్‌కు అభినందనలు తెలిపారు. ఇదిలా ఉంటే అసెంబ్లీలో విశ్వాస తీర్మానం తర్వాత క్యాబినేట్ కూర్పుపై ఆయన దృష్టిపెట్టనున్నారు. అందువల్లే మంత్రివర్గంలో చోటు దక్కే ఇతర నేతలెవరూ ఆయనతో కలిసి ప్రమాణ స్వీకారం చేయలేదు.
తొలి నుంచీ పడుతూ లేస్తూ
ఎన్నికలకు దాదాపు ఏడాది ముందు అవినీతి కేసులో జైలు పాలైన సోరెన్ బెయిల్‌పై బయటికి వచ్చి పార్టీ విజయానికి కృషి చేశారు. సవాళ్లను ఎదుర్కోవడం ఆయనకు కొత్తేం కాదు. సోరెన్ తన రాజకీయ జీవితాన్ని ఓటమితోనే ప్రారంభించారు. 2005లో జేఎంఎం పార్టీ తరఫున దుమ్కా నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలోకి దిగిన ఆయన స్వతంత్ర అభ్యర్థి స్టీఫెన్ మరాండి చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ ఎన్నికల్లో కేవలం 19,610 ఓట్లను మాత్రమే పొంది మూడో స్థానానికి పరిమితమయ్యారు.
అనంతరం ఎంపీగా రాజ్యసభకు వెళ్లిన సోరెన్ 2009 అసెంబ్లీ ఎన్నికల్లో దుమ్కా నియోజకవర్గం నుంచే మళ్లీ బరిలో నిలిచారు. ఆ ఎన్నికల్లో 30.97శాతం ఓట్లు పొంది ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. తర్వాత సెప్టెంబర్ 2010 జనవరి 2013 మధ్య డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. అనంతరం ఆర్జేడీ, కాంగ్రెస్ మద్దతుతో 2013లో మొట్టమొదటిసారిగా జార్ఖండ్ సీఎంగా బాధ్యతలు చేపట్టి ఏడాదిన్నరపాటు ఆ పదవిలో కొనసాగారు. సీఎం హోదాలో 2014 అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లిన సోరెన్‌కు ఘోర ఓటమిని ఎదురైంది.
దుమ్కా నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి లూయిస్ మరాండి చేతిలో దాదాపు 5వేల ఓట్ల తేడాతో ఆయన ఓటమి చెందారు. అయితే ఆ ఎన్నికల్లో సోరెన్ బర్హుతై నియోజకర్గం నుంచి కూడా ఎన్నికల్లో పోటీ చేయడంతో ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వెళ్లారు. 2015 మధ్య కాలంలో ఆయన జార్ఖండ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రతిపక్ష నేతగా 2015 మధ్య బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లిన సోరెన్ 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చి, ముఖ్యమంత్రిగా రెండోసారి బాధ్యతలు చేపట్టారు.
ఈ క్రమంలోనే ఆయన 2022లో అసెంబ్లీలో విశ్వాస పరీక్షను ఎదుర్కొన్నారు. అనంతరం భూ కుంభకోణానికి సంబంధించిన ఆరోపణలు రావడంతో ఈడీ అరెస్టుకు ముందు 2024 ఫిబ్రవరిలో సీఎం పదవికి సోరెన్ రాజీనామా చేశారు. జూన్ 28న బెయిల్‌పై విడుదలైన సోరెన్ జూలైలో మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
గొంతు నొక్కాలని ప్రయత్నించారు
ప్రమాణ స్వీకారానికి ముందు బీజేపీని ఉద్దేశిస్తూ ఎక్స్ వేదికగా హేమంత్ విమర్శలు గుప్పించారు. జార్ఖండ్ ప్రజలను ఎవరూ విడగొట్టలేరని వ్యాఖ్యానించారు. “ఐకమత్యమే మనందరి ఆయుధం. మనల్ని ఎవరూ విభజించలేరు అలాగే తప్పుదోవ పట్టించలేరు. కొందరు మన నొక్కాలని ప్రయత్నించారు. అయితే వారి ప్రయత్నానికి రెట్టింపుగా మన తిరుగుబాటు, స్వరం మరింత బలపడింది. ఎందుకంటే మనమంతా జార్ఖండ్ బిడ్డలం. ఎవరీ తలవంచం” అని పేర్కొన్నారు.