27-02-2025 12:35:28 AM
రూపొందిస్తున్న ఈపీఎఫ్‌ఓ
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: కేంద్ర ప్రభుత్వం కొత్త పెన్షన్ పథకం తీసుకొచ్చేందుకు యోచిస్తున్నట్లు విశ్వసనీ య వర్గాలు తెలిపాయి. అసంఘటిత రంగంలో పని చేసే వారికి ఈ పెన్షన్ స్కీమ్ ఎంతో ప్రయోజనం చేకూర్చనుందని కార్మిక శాఖ వర్గాలు తెలిపా యి. ప్రస్తుతం అసంఘటిత రంగ కార్మికులైన నిర్మాణ రంగ కార్మికులు, గిగ్ వర్కర్లు మొదలగు వారికి ప్రభు త్వం అందిస్తున్న పథకాలు అందడం లేదు కానీ ఈ కొత్త పెన్షన్ విధానం వల్ల వారికి ఎంతో ప్రయోజనం చేకూరనుంది. వేతన జీవులకు, స్వయం ఉపాధి పొందుతున్న వారికి కూడా ఈ పథకం వర్తించనుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న వివిధ రకాల పెన్షన్ పథకాలు కూడా ఈ పథకం కిందకు రానున్నాయి. ఇప్పటికే కేంద్ర ప్రభు త్వం ప్రధాన మంత్రి శ్రమ యోగి మాన్‌దాన్ యోజన, ప్రధానమంత్రి కిసాన్ మాన్‌దాన్ యోజన వంటి పథకాలను కేంద్రం అందిస్తోంది.
స్వచ్ఛందంగా..
ప్రస్తుతం ఉద్యోగాలు నిర్వర్తిస్తున్న వేతన జీవులు పదవీ విరమణ పొం దిన తర్వాత ఈపీఎఫ్‌ఓ వారికి పెన్షన్ అందిస్తోంది. వారు ఉద్యోగం చేస్తున్న సమయంలో వారి జీతం నుంచి 12 శాతం తీసుకుని.. వారి సంస్థ కూడా అంతే మొత్తాన్ని జమ చేసేలా దీనిని రూపొందించారు. కానీ ప్రస్తుతం సార్వత్రిక పెన్షన్ పథకంలో మాత్రం ఉద్యోగులతో పాటు స్వయం ఉపాధి పొందుతున్న వారు కూడా చేరేలా అవకాశం కల్పించనున్నారు. ఈపీఎఫ్‌ఓ ఈ పథకం విధి విధానాలు రూపొందిస్తుందని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఈ కొత్త పెన్షన్ పథకంలో 18 నుంచి 60 సంవత్సరాల వయసున్న ఎవరయినా కానీ చేరేందుకు ఆస్కారం ఉంది.