- త్వరలోనే కాంగ్రెస్‌కు మరి కొందరు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు
- కాంగ్రెస్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి
హైదరాబాద్,సెప్టెంబర్ 13 (విజయక్రాంతి): కాంగ్రెస్ సర్కార్‌ను కూలదోసేందుకు ప్రతిపక్ష బీఆర్‌ఎస్ శతవిధాలా ప్రయత్నిస్తోందని, ప్రభుత్వ జోలికి వస్తే పుట్టగతులుండవని కాంగ్రెస్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన సీఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు తూడి మేఘారెడ్డి, నాగరాజుతో కలిసి మీడియాతో మాట్లాడారు. మహిళలను కించపరిచేలా చీరలు, గాజులు పంపుతానంటూ, నీ ఇంటికి వస్తానని అరికెపూడి గాంధీని రెచ్చగొట్టింది కౌశిక్‌రెడ్డి కాదా అని ప్రశ్నించారు.
సెటిలర్స్‌పై కౌశిక్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను హరీశ్‌రావు, కేటీఆర్ ఎందుకు ఖండించలేదని ఆయన అడిగారు. కేటీఆర్, హరీశ్‌రావుల దుర్మార్గమైన ఆలోచనలు, సూచనల మేరకే కౌశిక్‌రెడ్డి రెచ్చిపోతున్నాడని వాపోయారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ ఏపీ భవన్‌లోని ఒక అధికారిపైన హరీశ్‌రావు దాడి చేశారని, కేటీఆర్ కూడా ఒక సీఐని ఎలా దూషించారో ప్రజలందరికీ తెలుసని ప్రకాశ్‌రెడ్డి గుర్తు చేశారు. తాజాగా సీపీ కార్యాలయంలో హరీశ్‌రావు చేసిన రౌడీయిజం అంతా చూశారన్నారు.
ఎమ్మెల్యే అరికెపూడి గాంధీతో పాటు 19 మందిపై పోలీసులు కేసులు పెట్టారని, కాంగ్రెస్ ఎమ్మెల్యే గణేశ్‌ను కూడా హౌస్ అరెస్ట్ చేశారని గుర్తుచేశారు. ప్రగతి భవన్‌కు ప్రజాప్రతినిధులు వెళ్తే అరెస్టు చేసిన ఘనత బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి ఉందని ధ్వజమెత్తారు. బీఆర్‌ఎస్ బీఫామ్‌పై గెలిచిన ఎమ్మెల్యే అరికెపూడి గాంధీని ఇప్పుడు ఆంధ్రోడు అంటున్నారని, అప్పుడు పార్టీలోకి చేర్చుకొని టికెట్ ఎందుకు ఇచ్చారో చెప్పాలని నిలదీశారు.