calender_icon.png 28 November, 2024 | 4:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమ్మ బరువైంది!

28-11-2024 02:55:01 AM

  1. కన్నతల్లిని స్మశానంలో వదిలేసిన కొడుకులు
  2. ఆలస్యంగా వెలుగుచూసిన అమానవీయ ఘటన 
  3. వృద్ధురాలిని సఖీ కేంద్రానికి తరలించిన అధికారులు 

జగిత్యాల, నవంబర్ 27 (విజయక్రాంతి): రోజు రోజుకు మనుషుల్లో మానవత్వం కరువవుతోంది. మానవ సంబంధాల కంటే ఆర్థిక సంబంధాలే ఎక్కువై జన్మనిచ్చిన తల్లిదండ్రులను సైతం విస్మరిస్తున్న సంఘటనలెన్నో. వృద్ధురాలైన కన్నతల్లిని బతికుండగానే స్మశానంలో వదిలేసిన అమానవీయ సంఘటన జగిత్యాల జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది.

జగిత్యా ల పట్టణం చిలకవాడకు చెందిన వృద్ధురాలు అల్లకొండ రాజవ్వకు తిరుపతి, గోపాల్, శ్రీనివాస్, రవి అనే నలుగురు కుమారులున్నారు. వారందరికీ వివాహమై పిల్లలు కూడా ఉన్నారు. చిన్న చిన్న వృత్తులు చేసుకొని జీవించే కుమారుల ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. రాజవ్వకు వచ్చే పింఛను డబ్బు లు తీసుకొని తల్లిని మూ డో కుమారుడు శ్రీనివాస్ పోషించేవాడు.

రాజవ్వకు కొన్ని రోజుల క్రితం ప్రమాదవశాత్తు కాలు విరిగింది. ఆమెకు సపర్యలు చేసేందుకు కోడలు ఇబ్బందులు పడుతుండడంతో శ్రీనివాస్ గత ఎనమిద రోజుల క్రితం రాజవ్వను మోతే స్మశాన వాటిక వద్ద ఉన్న కర్మకాండ నిలయంలో ఉంచాడు. ప్రతిరోజు ఆమెకు అవసరమైన భోజనం తెచ్చిపెడుతున్నాడు.

అచేతన స్థితిలో రాజవ్వ..

కాలు విరిగిన నొప్పితో విపరీతంగా బాధపడుతూ, కర్మకాండ నిలయంలో అచేతన స్థితిలో ఉన్న రాజవ్వను చుట్టుపక్కల వారు గమనించి అధికారులకు సమాచారం అందించారు. దీంతో జిల్లా సంక్షేమ అధికారి డాక్టర్ బోనగిరి నరేశ్ తన సిబ్బందితో  స్మశాన వాటికకు చేరుకొని వివరాలు తెలుసుకున్నారు.

నలుగురు కొడుకులు ఉన్నప్పటికీ తాను దిక్కులేని దానిలా స్మశానంలో పడి ఉన్నానని వృద్ధురాలు కన్నీటి పర్యంతమైంది. తన కాలు విరగడంతో తనను అనాథగా వదిలేశారని ఆవేదన వ్యక్తం చేసింది. తన నలుగురు కొడుకులను కంటికి రెప్పలా పెంచి పెద్ద చేశానని, తన ఒక్కదాన్ని  సాదుకోవడం వారికి బరువైందని వృద్ధురాలు రాజవ్వ వాపోయింది.

వృద్ధురాలి దీనస్థితిని చూసిన అధికారులు చలించిపోయి వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం ’సఖీ’ కేంద్రానికి తరలించారు. ఈ విషయంలో మరిన్ని వివరాలు సేకరించి, రాజవ్వ కుమారులను పిలిపించి వారికి కౌన్సిలింగ్ ఇస్తామని,వయోవృద్ధుల చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని  డాక్టర్ నరేశ్ తెలిపారు.

మొత్తం మీద కన్న కొడుకులే మాతృ ప్రేమను మరచి.. కసాయిలా మారి.. తల్లికి సేవలు చేయలేక బతికుండగానే స్మశానంలో ఉన్న గదిలో వదిలి వెళ్లిన సంఘటన పలువురిని కలచివేసింది. మొన్నటికి మొన్న సిరిసిల్ల జిల్లాలో సైతం ఇలాంటి సంఘటన వెలుగులోకి రావడం గమనార్హం.