calender_icon.png 1 March, 2025 | 4:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ ఇచ్చిన దేవత సోనియా

09-12-2024 02:12:13 AM

దశాబ్దాల కల నేరవేర్చిన ధీర వనిత.. 

నేడు సోనియా గాంధీ జన్మదినం

దశాబ్దాల నుంచి ఎదురుచూపులు.. సుదీర్ఘ పోరాటం.. అసలు రాష్ట్రం ఏర్పడుతుందా? లేదా? రోజు రోజుకు కమ్ముకుంటున్న చీక ట్లు.. నీళ్లు, నిధులు, నియామకాల కోసం రాష్ట్రం ఏర్పడటమే శరణ్యమని భావించిన తరుణం. సబ్బండ వర్ణాల్లో గూడుకట్టుకున్న ఆవేదన. ఎన్నాళ్లీ దురావస్థ.

ఎన్నాళ్లకు బతుకులు బాగుపడేది? చిరకాల వాంఛ తీరేదెన్నడు? అని తెలంగాణ ప్రజానీకంలో ఒకటే ఆవేదన.. ఆందోళన. ఈ అనుమానాలను పటాపంచలు చేస్తూ 2004లో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కరీంనగర్ బహిరంగ సభ వేదికగా శుభవార్త అందించారు. అశేష ప్రజల మధ్యలో హామీ ఇచ్చారు. ‘మీ ఆకాంక్ష.. మీ చిరకాల వాంఛ.. మీ కోరిక.. మీ బాధ నాకు తెలుసు.

అవి నెరవేరే రోజు ఎంతో దూరంలో లేదు.. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చి తీరుతాం’ అని స్పష్టంచేశారు. ఆ ప్రకారం ఇచ్చిన మాటకు కట్టుబడి సోనియాగాంధీ పరిష్కారమార్గం చూపించారు. 2014లో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయించి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. సోనియాగాంధీ తెలంగాణ ఇవ్వడంతో రాష్ట్ర ప్రజలు దేవతలా కొలుస్తున్నారు.

సోనియాగాంధీ విలక్షణ నేత.. అత్యంత ప్రతిభవంతురాలు, పట్టుదల, దూరదృష్టి చాలా ఎక్కువ. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు. దేశ వ్యాప్తంగా రాజకీయపరంగా ఎన్నో ఒత్తిళ్లు, ఇబ్బందులు ఎదురైనా ఏమాత్రం లెక్క చేయలేదు. వాటిన్నంటిని అధిగమిస్తూ ముందుకు సాగారు. వెనక్కి తిరిగి చూడలేదు. ఉద్యమకారుల ఆశలు, ప్రజల ఆశలను నిలబెట్టడంతోపాటు విభజనకు అనుకూలంగా వ్యవహరించారు.

ఈ నేపథ్యంలోనే ప్రజల కల సాకారమైంది. దీంతో తెలంగాణ ప్రజల మనసును దోచుకున్నారు. ప్రజలు ఆమెను తమ నాయకురాలిగా కీర్తిస్తున్నారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఆమె మద్దతు చరిత్రలో నిలిచిపోయే ఘట్టం. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంతోపాటు రెండుసార్లు కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి సోనియాగాంధీ కృషి ఎనలేనిది. దీంతో భారత రాజకీయాల్లోనే గొప్ప చరిత్ర సృష్టించారు.

దీంతో 2023 డిసెంబర్ 7న తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం ఏర్పడింది. ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. సహచర మంత్రులతో కలిసి రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయింది. ప్రజా హితమే లక్ష్యంగా పాలన సాగిస్తున్నది. 

తెలంగాణ అంశం సోనియా దృష్టికి.. 

తెలంగాణ వాదం బలహీన పడకుండా తెలంగాణ శాసనసభ్యుల ఫోరం ప్రత్యేకంగా కృషిచేసింది. ఈ ఫోరాన్ని 1991లో ఏర్పాటు చేశారు. శాసనసభ్యుల ఫోరానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి చైర్మన్‌గా, కన్వీనర్‌గా వెలిచాల జగపతిరావు వ్యవహరించారు. ఈ ఫోరాన్ని జగపతిరావు ముందుండి నడిపించారు. సాగునీటి పంపకంలో తెలంగాణ పట్ల వివక్షను ఫోరం తీవ్రంగా నిరసించింది.

నాడు శాసనసభ్యుల ఫోరం చేసిన పోరాట ఫలితంగానే దేవాదుల, నెట్టెంపాడు, తుపాకులగూడెం, కల్వకుర్తి ఎత్తిపోతల, శ్రీశైలం ఎడమకాలువ, కరీంనగర్ వరద కాలువ పథకాలు మొదలయ్యాయి. పీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా ఉండగా అనేకమార్లు తెలంగాణ వాటాలో వివక్షపై వెలిచాల జగపతిరావు ప్రస్తావించేవారు.

అనేకమార్లు ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణ ఉద్యమంలో జగపతిరావు కీలకంగా వ్యవహరించారు. అదేవిధంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహకరించాలని 1999లో 42 మంది కాంగ్రెస్ శాసనసభ్యుల ఫోరం కన్వీనర్ డాక్టర్ చిన్నారెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ అగ్రనేత సోనియాకు వినతి పత్రం అందించారు. అప్పటి నుంచి తెలంగాణ మలి దశ ఉద్యమానికి బీజం పడింది.

అప్పట్లో వీరిచ్చిన లేఖపై సోనియాగాంధీ, డాక్టర్ మన్మోహన్‌సింగ్ నేతృత్వంలో ఒక ఉప కమిటీని ఏర్పాటు చేశారు. ఆ ఉప కమిటీ బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించింది. ఆనాటి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయింది. తెలంగాణ ఏర్పాటుపై కాంగ్రెస్ తన వాణిని బలంగా వినిపించింది. 2009 నాటికి తెలంగాణ ఉద్యమం మరింత ఉద్ధృతమైంది.

ఉద్యమానికి అన్నివర్గాల ప్రజలు, కులాల, మతాలకు అతీతంగా ప్రజలు సంపూర్ణ సహకారాన్ని అందించారు. విద్యావంతులు, మేధావులు, విద్యార్థులు, ఉద్యోగులు, జర్నలిస్టులు, న్యాయవాదులు, కళాకారులు, రచయితలు, వైద్యులు.. సబ్బండ వర్గాల పోరాటంతో 2009 డిసెంబర్ 9న నాటి హోంమంత్రి చిదంబరంతో సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామని ప్రకటన చేయించారు.

తెలంగాణకు అనుకూలంగా 2001లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానం ఆమోదించడం దగ్గర నుంచి 2009 డిసెంబర్ 9న ప్రకటన చేయించేవరకు అనేక ఒత్తిడులు ఎదురైనా సోనియాగాంధీ మాటమీద నిలబడ్డారు. 2010లో ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం నిర్వహించడం, 2010 ఫిబ్రవరి 3న జస్టిస్ శ్రీకృష్ణ నేతృత్వంలో ఐదుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేయడం, ఆ కమిటీ నివేదిక సమర్పించిన తర్వాత 2012లో కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే నేతృత్వంలో మళ్లీ అఖిలపక్ష సమావేశం నిర్వహించారు.

ఆ తర్వాత 2013 జూలై 30న సీడబ్ల్యూసీ సమావేశం ఏర్పాటుచేయించి ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు తీర్మానం చేయించడం వంటి పరిణామాలన్నీ సోనియాగాంధీ ప్రత్యేక చొరవ వల్లే సాధ్యమైంది. ఒక రాష్ట్రం ఇస్తే మరో రాష్ట్రంలో పార్టీ తీవ్రంగా నష్టపోతుందని తెలిసినా, ఆనాడు సమైక్యవాదులు హెచ్చరికలు జారీచేసినా.. వాటిని లెక్క చేయకుండా తెలంగాణ ప్రజల ఆకాంక్షలను సోనియాగాంధీ నెరవేర్చారు. 

పేదల పక్షపాతి 

పేదల కోసం యూపీఏ ప్రభుత్వ హయంలో సోనియాగాంధీ ఎంతో కృషి చేశారు. వారి సంక్షేమానికి సంబంధించి అనేక పథకాలు, చట్టాల రూపకల్పనలో కీలకంగా వ్యవహరించారు. కూలీల వలసలు నిరోధించేందుకు, వారికి చేతి నిండా పని కల్పేందుకు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధిహామీ చట్టాన్ని తీసుకొచ్చారు.

అదే విధంగా ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక సవరణ చట్టం, నిర్బంధ విద్యా హక్కు చట్టం, జాతీయ ఆహార భద్రతాచట్టం, ఆదివాసుల అటవీ హక్కుల చట్టం, గృహహింస చట్టం, వీధి వ్యాపారుల రక్షణ చట్టం, సామాజిక భద్రతా చట్టం, భూమి స్వాధీన సవరణ చట్టం, సమాచార హక్కు చట్టం లాంటివి తీసుకొచ్చి సంక్షేమ, ప్రజాస్వామ్య విలువలను మరింత సుసంపన్నం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదే.

75 సంవత్సరాల భారత చరిత్రలో కేవలం పదేళ్లలో ప్రజాసంక్షేమానికి అనేక బృహత్తర చట్టాలను తీసుకురావడం సోనియాగాంధీకి పేదల పట్ల ఉన్న నిబద్ధతను తెలుపుతుంది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ తర్వాత పేదల పక్షాన నిలబడి, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ సోనియాగాంధీ పేదల పక్షపాతి అని పేరు తెచ్చుకున్నారు.

సోనియా తెచ్చిన చట్టాలు రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల అమలుకు సజీవ సాక్ష్యాలుగా నిలిచాయి. ఆమెకు రాజ్యాంగమే మార్గదర్శకంగా పని చేసింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3ను ఆయుధంగా చేసుకున్నారు.

భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలోనే నూతన అధ్యాయాన్ని సృష్టించారు. 2014 ఫిబ్రవరి 2న గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లుపై ముందుకెళ్లాలని తీర్మానించింది. 7వ తేదీన కేంద్ర మంత్రిమండలి బిల్లుకు ఆమోదముద్ర వేసింది. 18న లోక్‌సభ, 20న రాజ్యసభ ఆమోదం పొందింది.

పునర్విభజన చట్టానికి 2014 మార్చి 1న రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడంతో భారతావనిలో జూన్ 2న 29వ రాష్ట్రంగా ప్రత్యేక తెలంగాణ ఆవిర్భవించింది. ఇదంతా సోనియా అండదండలు, ఆశీస్సులతో సాధ్యమైంది. సోనియా తెలంగాణ ప్రజల హృదయాల్లో నిలిచిపోయారు. 

ప్రధాని పదవినే తిరస్కరించిన తల్లీకొడుకుది గొప్ప త్యాగం

1984 అక్టోబర్ 31న ప్రధానమంత్రిగా ఉన్న ఇందిరాగాంధీ హత్య జరిగింది. దీంతో సోనియాగాంధీ తీవ్ర ఆందోళనకు గురయ్యారు. 1991 మే 21న తమిళనాడులో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన రాజీవ్‌గాంధీ ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడిలో మృతిచెందారు. ఏడేళ్ల వ్యవధిలో దేశం కోసం అత్త, భర్త దూరం కావడంతో సోనియా ధైర్యాన్ని కోల్పోయారు.

పిల్లలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని చూసుకుంటూ మనోనిబ్బరంతో ముందుకుసాగారు. రాజీవ్ మరణం తర్వాత కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేపట్టి, ప్రధానమంత్రి కావాలని దేశ ప్రజలంతా విన్నవించినా సోనియా సున్నితంగా తిరస్కరించారు. పార్టీలోని సీనియర్ నాయకుల ఒత్తిడితో సోనియా 1997లో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకున్నారు.

అనంతరం 1998లో ఏఐసీసీ అధ్యక్ష పదవిని స్వీకరించారు. 1999 ఎన్నికల్లో కాంగ్రెస్ 114 స్థానాల్లో విజయం సాధించడంతో సోనియా లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా ఎన్నికయ్యారు. దేశ ప్రజల అభిమానాన్ని పొంది 2004లో కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలో వచ్చేందుకు ఎంతో కష్టపడ్డారు. ప్రతిపక్ష పార్టీలను ఒక్కతాటిపైకి తీసుకొచ్చి యూపీఏ కూటమిని ఏర్పాటు చేశారు.

ప్రధానమంత్రి పదవిని త్యాగం చేసి సుదీర్ఘకాలం ఏఐసీసీ అధ్యక్షురాలిగా పనిచేశారు. సోనియాగాంధీ దేశం కోసం, ప్రజల కోసం చేసిన అనేక త్యాగాలను గమనిస్తే ఆమె జీవితం త్యాగాలకు చిరునామాగా నిలుస్తున్నది. సోనియాగాంధీ నేతృత్వంలో 2004, 2009 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది.

రెండోసారి 2009లో కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలోకి రాగానే అగ్ర నేత రాహుల్ గాంధీని  ప్రధానమంత్రిగా ఉండాలని సీనియర్ నాయకులు ఎంత ఒత్తిడి చేసినా సున్నితంగా తిరస్కరించారు. పదవి తీసుకోబోనని తేల్చిచెప్పారు. ఒకవైపు సోనియా మరోవైపు రాహుల్ .. తల్లీకొడుకులు ప్రధాని పదవిని తిరస్కరించడం వారి గొప్పతనం.

ఇంతకంటే ఏం కావాలి త్యాగాలు చేయడానికి. అది సోనియా కుటుంబానికి ఉన్న నిబద్ధత. రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియాగాంధీ నిజంగా దేవతే. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సారథ్యంలో రాష్ట్రం అన్నిరంగాల్లో ప్రగతి పథంలో దూసుకెళ్తున్నది. ప్రపంచంలోనే ఒక గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నారు.

ఇందుకోసం ప్రజలంతా కృతజ్ఞత భావంతో మెదలాలి. దశాబ్ధాల కల నెరవేర్చి ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ప్రభుత్వానికి ప్రజలు ఎళ్లవేలలా అండగా ఉండాలి. ప్రజల క్షేమాన్ని మాత్రం కోరేది కాంగ్రెస్సే. ఇందులో ఎలాంటి అనుమానాలకు తావులేదు. 

వెలిచాల రాజేందర్రావు

కరీంనగర్ పార్లమెంట్  నియోజకవర్గ

కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి

9849061481