న్యూఢిల్లీ: ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నూతన కేంద్ర కార్యాలయం ప్రారంభించింది. కొత్త భవనానానికి 'ఇందిరా భవన్' గా కాంగ్రెస్ పార్టీ పేరు పెట్టింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ 'ఇందిరా గాంధీ భవన్'ను(Indira Gandhi Bhawan) ప్రారంభించారు. బుధవారం జరిగిన ఈ ఆవిష్కరణ కార్యక్రమం దేశవ్యాప్తంగా పార్టీ నేతలను కలిసింది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యుసి), ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షులు, కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ (సిఎల్‌పి) నాయకులు, పార్లమెంటు సభ్యులు (ఎంపిలు), ఎఐసిసి కార్యదర్శులతో సహా దాదాపు 400 మంది అగ్రనేతలను వేడుకకు ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి పాల్గొన్నారు. ప్రస్తుతం అర్బర్ రోడ్డు 24 వ బంగ్లాలో ఏఐసీసీ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి.
ప్రభుత్వ బంగ్లాలో పార్టీ కార్యాలయాలు ఉండకూడదని గతంలో కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. కేంద్ర నిర్ణయంతో కాంగ్రెస్ పార్టీ సొంత భవనాలు నిర్మించుకుంది. 6 అంతస్తుల్లో అత్యాధునిక సౌకర్యాలతో కాంగ్రె కొత్త కార్యాలయం నిర్మించింది. ఏఐసీసీ నూతన కార్యాలయం 9ఏ కోట్లా రోడ్ కు మారనుంది. కార్యాలయం తరలించినా.. అక్బర్ రోడ్డులోనూ కార్యకలాపాలు ఉంటాయని నేతలు చెబుతున్నారు. ఇందిరా గాంధీ భవన్‌లోని ఐదో అంతస్తులో మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ(Mallikarjun Kharge, Sonia Gandhi), రాహుల్ గాంధీ కార్యాలయాలు ఉంటాయి. నాల్గవ అంతస్తును ప్రధాన కార్యదర్శులు ఉపయోగించుకుంటారు. రాష్ట్ర ఇంచార్జులు మూడో అంతస్తులో ఉంటారు. రెండవ అంతస్తును అఖిల భారత కార్యదర్శులు, వారి సిబ్బంది ఉపయోగించుకుంటారు. 2009 డిసెంబర్‌లో మాజీ ప్రధాని దివంగత మన్మోహన్ సింగ్ మరియు అప్పటి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కొత్త భవనానికి శంకుస్థాపన చేశారు. అయితే భవన నిర్మాణాన్ని పూర్తి చేయడానికి పార్టీకి 15 ఏళ్లు పట్టింది.