సినీ గీతాల రచనలో ప్రత్యేకత చాటుతున్న అక్కల చంద్రమౌళి
‘సౌ సార చెటాక్ కారా.. పోదాం పారా.. బగ్గ తాగుదం.. బొర్ర పెంచుదం.. బాజార్లనే పందాం.. కాళ్ల కూర తిందాం.. సప్పుడేక ఉందాం...’
ఈ పదాలన్నీ ఎక్కడో మారుమూల పల్లెల్లో విన్నట్టుగా అనిపిస్తోంది కదూ?! పదాలు కావివి పాటలోని పంక్తులు. ఔను, పాటే ప్రాణంగా బతుకుతూ, యాసే శ్వాసగా జీవిస్తూ చిత్రసీమ వైపు అడుగులు వేసిన ఆయన కలం నుంచి జాలువారుతున్న పాటలన్నీ సంగీత ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. తెలంగాణ పల్లె పొత్తిళ్లలో పురుడు పోసుకున్న పద సంపదను పదిలంగా చిత్రసీమకు చేర్చే క్రమంలో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారాయన.
పాతతరం మాటలతో పాటలు అల్లుతూ సినీ సాహిత్యంలో అసలు సిసలు తెలంగాణ నుడికారాలకు గుడి కడుతున్న ఆయన పేరు అక్కల చంద్రమౌళి. మంచిర్యాలకు చెందిన చంద్రమౌళి, తన గురించి ‘విజయక్రాంతి చెప్పిన విశేషాలు ఆయన మాటల్లోనే... మా స్వస్థలం మంచిర్యాల జిల్లా దండేపల్లి మండల కేంద్రం. మంచిర్యాల సమీపంలో ఉన్న గద్దెర్యాగడి ప్రాంతంలోని రామకృష్ణాపూర్‌లో ప్రస్తుత మకాం. నాన్న పేరు లచ్చన్న. అమ్మ రాజేశ్వరి. వారికి నేను మూడో కుమారున్ని.
నా భార్య కవిత గృహిణి. మాకు ఓ పాప, బాబు సంతానం. కూతురు పేరు సుస్వర. కొడుకు పేరు స్వరణ్. ఇక నా ఎడ్యుకేషన్ విషయానికొస్తే.. పదోతరగతి వరకు సొంతూరిలోనే చదువుకున్నా. ఇంటర్మీడియట్, డిగ్రీ కోసం హైదరాబాద్ వెళ్లా. ఉస్మానియా యూనివర్సిటీలో ఎంసీఏ పూర్తి చేశా.
స్కూల్ ఏజ్‌లోనే తొలి పాట..
నాన్న సింగరేణి ఉద్యోగి. కారు ణ్య నియామకం ద్వారా ఆ ఉద్యోగం పొందే అవకాశం నాకు వచ్చింది. కానీ, కళను నమ్ముకున్న నా కల మాత్రం ఫిల్మ్ ఇండస్ట్రీకి చేరడం. అందుకే ఆ ఉద్యోగాన్ని వదులుకొని సినీ రంగం వైపు నడిచా. 2013లో ‘గులాబీ’ చిత్రంలోని ‘శతమానం భవతి..’ పాటతో సినీ పరిశ్రమకు పాటల రచయితగా పరిచయమయ్యా. అలా సినిమాల కోసం నేను ఇప్పటివరకు వందకు పైగా పాటలు రాశా. తొలి పాట స్కూల్ ఏజ్‌లోనే రాశా. ‘పొలంగట్టు మీద పిల్లో పిల్ల..’ అనే ఆ పాట జానపద బాణీలో సాగుతుంది.
జపాన్ టూరిజం ఫిల్మ్ అవార్డు..
సినిమా పాటలే కాదు రాష్ట్ర ప్రభుత్వ డాక్యూమెంటరీలకు కూడా సాంగ్స్ రాశా. వాటిలో ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అనే టూరిజం పాట చెప్పుకోదగ్గది. ఎందుకంటే ఈ పాటకు 2019 మార్చిలో జపాన్‌లో నిర్వహించిన ‘జపాన్ వరల్డ్ టూరిజం ఫిల్మ్ ఫెస్టివల్’లో అంతర్జాతీయ టూరిజం థీమ్ సాంగ్ అవార్డు వచ్చింది. నేను రాసిన సుమారు 10 కథలు వివిధ మ్యాగజైన్లలో ప్రచురితమయ్యాయి.
చౌరస్తా బ్యాండ్’తో అనుబంధం..
మైఖేల్ యార్క్ అనే వ్యక్తి 1983లో తీర్యాణిలో డాక్యుమెంటరీని చిత్రీకరించారు. పలు సందర్భాల్లో ప్రపంచం నలుమూలల వారితో కలిసి పనిచేసే అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నా. ముఖ్యంగా ‘చౌరస్తా బ్యాండ్’తో అనుబంధం గర్వంగా ఫీలవుతా. ఇది ప్రస్తుతం తెలంగాణలో పాపులర్ బ్యాండ్. ‘బస్కింగ్’ ప్రోగ్రామ్‌లో భాగంగా గ్రామీణ, మైదాన గిరిజనుల జీవన విధానాన్ని సమాజానికి తెలియజెప్పేందుకు కృషి చేస్తున్నాం. గోండిలో వైవిధ్యంగా కథలు రాస్తున్నాం.
ఆదిలాబాద్‌కు పేరు తేవాలన్నదే నా కోరిక
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీ, కార్మిక రైతాంగానికి సంబంధించిన విషయాలను అర్థం చేసుకోవడంతో ఇక్కడి సంస్కృతి, భాషపై పట్టు లభించింది. ఈ క్రమంలో నా కలం నుంచి జాలువారే అక్షరాలే నాకు గుర్తింపు తెచ్చిపెడుతున్నాయి. 2023లో రూపక్ రోనాల్డ్‌సన్ రచన, దర్శకత్వం వహించిన ‘పరేషాన్’ సినిమాలోని పాటలతో 1950 దశాబ్దానికి సంబంధించిన తెలంగాణ గ్రామీణ భాషను కొత్తతరానికి అందివ్వడం ఆనందంగా అనిపించింది. ఆ చిత్రంలోని ‘గాంధారి గంగ మ్మా..’ పాట చాలా మంది ప్రజలకు దగ్గరయింది. ఇందులో ‘గుడిరేవు నెమలీకలు’ ప్రాశస్త్యం గురించి చెప్పడం గర్వంగా అనిపించింది.
ఎందుకంటే చాలా మందికి గుస్సాడీ నృత్యం గురించే తెలుసు. కానీ దీపావళి టైమ్‌లో గుడిరేవుల వద్ద కాకాబాయి అనే పండుగను నిర్వహిస్తారు. ఛత్తీస్‌గడ్, మహారాష్ట్ర వంటి రాష్ర్టేతర ప్రాంతాల భక్తులు కూడా ఇక్కడికి వస్తారు. ఇలా అవకాశం ఉన్న ప్రతిసారి మన ప్రాంత ప్రస్తావన చేయడం ద్వారా అభివృద్ధికి తోడ్పాటునందించడంలో ఆనందమే వేరు కదా. అల్లం రాజయ్య రచనలు నన్ను ఎంతో ప్రభావితం చేశాయి. ఆయన నుంచి ఎన్నో కొత్త విషయాలు తెలుసుకున్నా. ఇలా తెలంగాణ యాసను ఒడిసిపట్టి వాటి కి పాట రూపమిస్తూ మున్ముందు మరిన్ని మంచి పాటలు రాసి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు పేరు తీసుకురావాలన్నదే నా కోరిక.