09-03-2025 01:00:11 AM
వివిధ చిత్ర పరిశ్రమలకు చెందిన నటీమణులు తెలుగు సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా బాలీవుడ్‌కు చెందిన దీపికా పదుకొణె, జాన్వీకపూర్, అనన్యపాండే, త్రిప్తిడిమ్రీ వంటివారు తమ అందచందాలతో ఇప్పటికే టాలీవుడ్ ప్రేక్షకుల మనసు దోచుకున్నారు. ఈ జాబితాలోకి ఇప్పుడు సోనాక్షి సిన్హా చేరింది. బీటౌన్‌లో హీరోయిన్‌గా విభిన్నమైన చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుంది సోనాక్షి. ఇటీవల ‘హీరామండి’ చిత్రంతో ప్రేక్షకులను మెప్పించిన సోనాక్షి టాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్ధమైంది. సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న చిత్రం ‘జటాధార’తో సోనాక్షి సిన్హా తెలుగులో అరంగేట్రం చేస్తున్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ విషయాన్ని వెల్లడిస్తూ మేకర్స్ సోనాక్షి కొత్త పోస్టర్‌ను రివిల్ చేశారు.
ప్రేక్షకులు ఆధ్యాత్మిక ప్రపంచంలో విహరించిన అనుభూతిని పొందేలా రూపుదిద్దుకుంటోందీ సినిమా. కాగా, ఇందులో సోనాక్షి యాక్షన్, మిస్టరీతో కూడిన పవర్‌ఫుల్ అవతార్‌లో కనిపించనుందని మేకర్స్ తెలిపారు. ఇటీవల హైదరాబాద్‌లో ముహూర్తంతో ఈ సినిమా ప్రారంభమైంది. ప్రస్తుతం టీమ్ మౌంట్‌అబూ అడవుల్లోకి వెళ్లనుంది. అక్కడ మౌకా స్టూడియోస్‌లో ఓ అడవి సెట్ వేశారు. సోనాక్షి సిన్హా మార్చి 10న షూట్‌లో జాయి న్ అవుతారని చిత్రబృందం వెల్లడించింది. సుధీర్‌బాబు లీడ్ రోల్ నటిస్తున్న ఈ చిత్రానికి నూతన దర్శకుడు వెంకట్ కళ్యాణ్ దర్శకత్వం వహించగా, జీ స్టూడియోస్ ఉమేశ్ కేఆర్ బన్సాల్, ప్రేరణ అరోరా, అరుణ అగర్వాల్, శివిన్ నారంగ్ నిర్మిస్తున్నారు.