16-04-2025 11:33:13 PM
మహబూబ్ నగర్ (విజయక్రాంతి): ఆస్తి తన పేరిట రాయలేదని ఓ కుమారుడు తండ్రి చనిపోయిన అంత్యక్రియలు నిర్వహించేందుకు దూరంగా ఉన్న సంఘటన మహబూబ్ నగర్ లో చోటుచేసుకుంది. తండ్రి మరణించడంతో చివరి ఘట్టమైన కర్మ కండ చేసేందుకు కుమారుడు రాకపోవడంతో బంధువులు ఆశ్చర్యానికి గురయ్యారు. వివరాలు ఇలా ఉన్నాయి. నారాయణపేట జిల్లా దామరగిద్ద మండల పరిధిలోని కేతనపల్లి గ్రామానికి చెందిన మాణిక్యరావు (80) సర్వే ల్యాండ్ రికార్డు శాఖ పరిధిలో అసిస్టెంట్ డైరెక్టర్గా తన విధులను నిర్వహించారు. మాణిక్యరావుకు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు.
మాణిక్యరావు భార్య గతంలోనే మృతి చెందడంతో వారి గ్రామంలో ఉన్న 15 ఎకరాల భూమిని, రూ 60 లక్షల డబ్బును కుమారుడు గిరీష్ కు ఇచ్చినట్లు తెలిసింది. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీలో గల ఇంటిని ఆర్థికంగా కొంత ఇబ్బందికరంగా ఉన్న తన కూతురు రాజా నందిని పై రిజిస్ట్రేషన్ చేశారు. గత కొంతకాలంగా అనారోగ్యం కారణంగా బుధవారం తెల్లవారుజామున మాణిక్యరావు మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ విషయాన్ని హైదరాబాద్లో ఉన్న మాణిక్యరావు కుమారుడు గిరీష్ కు తెలియజేశారు. కర్మకాండ నిర్వహించేందుకు రావాలని సోదరీమణులు తెలిపినప్పటికీ గిరీష్ కర్మ ఖండ నిర్వహించేందుకు రానని కరాకండిగా చెప్పినట్లు తెలుస్తుంది.
దీంతో చుట్టుపక్కల వారు సైతం కర్మ ఖండ నిర్వహించేందుకు మేము ముందుకు వస్తాం అని చెప్పడంతో మాణిక్యరావు చిన్న కూతురు నందిని కర్మ కండ నిర్వహించారు. తండ్రి మరణించిన కొడుకు గుండె కరగలేదంటే ఎంత కఠినమైనదని పలువురు ప్రత్యేకంగా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆస్తులు ఉంటే చాలు తల్లిదండ్రులు ఏమైపోయినా పర్వాలేదు అనుకునే ఇలాంటి వ్యక్తులు నేటి సమాజంలో తోటి వారికి ఎలాంటి మెసేజ్ ఇస్తారని పలువురు విమర్శిస్తున్నారు.