calender_icon.png 11 October, 2024 | 12:19 PM

బ్రహ్మమానస పుత్రరత్నం

11-10-2024 12:00:00 AM

17న వాల్మీకి జయంతి :

ఆదికావ్యమైన రామాయణాన్ని రచించిన వాల్మీకి ఎక్కడా తనను గురించి తాను చెప్పుకోలేదు. ఆయనను గురించి తెలుసుకోవడానికి ఐతిహ్యాలే మార్గాలు. ఇంద్రసభ లో రంభాదుల నృత్యాన్ని చూస్తున్న బ్రహ్మదేవునికి రేతఃస్ఖలనమై పంకంలో కలిసింది.

అందుండీ వాల్మీకి పుట్టినాడనీ, అలా పుట్టినవాడు తన తండ్రివద్దకు వచ్చి, నలుగురిలో విషయాన్ని బట్టబయలు చేసి తనకు అన్నాన్ని ప్రసాదించమని తండ్రిని కోరినాడని, అందుకు కోపించిన బ్రహ్మదేవుడు “నువు పతితుడవై బోయలలో కలిసి క్రూరకర్మలతో జీవించు” అని శపించినాడని ఐతిహ్యము.

మరొక కథనం ప్రకారం, సదాచార పరాయణ వంశంలో జన్మించిన రత్నాకరుడు ఒక బోయ కన్య ప్రేమలో పడ్డాడు. తన కుటుంబ ఆచార వ్యవహారాలను వదిలేసి అడవిబాట పట్టాడు. కుటుంబ పోషణకు వేటద్వారా వచ్చే ఆదాయం సరిపోక దొంగగా మారాడు. 

ఆ క్రమంలో అడవి గుండా వెళుతున్న మును ల సమూహాన్ని దోచుకునేందుకు ప్రయత్నించిన రత్నాకరుడిని “ఈ దొంగతనాలవల్ల వచ్చే పాపంలో భాగాన్ని నీ భార్య స్వీకరిస్తుందేమో తెలుసుకొనిరా. అప్పుడు మమ్మల్ని దోచుకుందువు. మేమిక్కడే నిలిచి ఉంటాం” అన్నారు.

“భార్యాపిల్లల పోషణ భారం నీది. ధనార్జనకై నువు పాపపు మార్గాలను ఎన్నుకొంటే అందుకు బాధ్యత నీదే అవుతుంది. కనుక, నువు తెచ్చే ధనంతోనే మాకు సంబంధం. నీ పాపంలో మాకు భాగం లేదు” అని చెప్పిందా వ్యాధురాలు. ఆ మాటలతో రత్నాకరుడు విరక్తుడైనాడు. లభించిన అవకాశాన్ని మునులు సద్వినియోగ పరచుకొని, అతడికి ‘రామ’ నామాన్ని మంత్రంగా ఉపదేశించారు. ‘రామ’ అనికూడ అతడికి పలకడం రానందున ‘మరా’ అని ఉపదేశించారని, పదేపదే ఉచ్చరించడంతో అది ‘రామ’ నామమైందని కథనం.

‘మరా’ మంత్రమే రామనామమై..

రామనామ జపంలో లీనమైన రత్నాకరుని చుట్టూ పుట్టలు మొలుచుకు వచ్చాయని, వల్మీకం నుండి బయటకు వచ్చాడు కనుక ‘వాల్మీకి’ అయినాడని ఐతిహ్యం. తన ఆశ్రమానికి వచ్చిన నారదమహర్షిని ‘ముల్లోకాల్లో బుద్ధిమంతుడు, వీర్యవంతుడు, ధర్మం తెలిసిన వాడు, కృతజ్ఞుడు, సత్యవాక్పరిపాలకుడు, దృఢవ్రతుడు ఇత్యాది పదహారు సద్గుణాలు గల వారెవరైనా ఉంటే అతడి గురించి వివరింపుమని’ అడిగాడు వాల్మీకి. ‘అటువంటి సద్గుణ సంపన్నుడు వాల్మీకికి సమకాలీనుడేననీ, అయోధ్యను పాలిస్తున్న శ్రీరామచంద్రునిలో ఆ గుణగణాలన్నీ వున్నాయని’ శ్రీరామకథను నారదుడు వాల్మీకికి వివరించాడు.

క్రౌంచ మిథున పతనంతో వాల్మీకి శోకం శ్లోకమై ‘ఆదికావ్యం’గా పరిణమించింది. ఉత్తమ కుల సంజాతుడైన రత్నాకరుడు పతనం చెంది వ్యాధుడై వేటను వృత్తిగా చేసుకొన్నాడు. ఆపైన దొంగగా మారాడు. విరక్తుడై తపోమార్గాన్ని అనుసరించి మహర్షి అయ్యాడు. నారదుని కృపతో రామాయణేతిహాసాన్ని మహాకావ్యంగా మలచాడు. సత్తగుణ సంపన్న జీవితాన్ని వదిలిపెట్టిన రత్నాకరుడు రజోగుణ ప్రధాన వృత్తిని, ఆపైన తమస్సు నిండిన వృత్తిని చేపట్టాడు.

సాధనా మార్గంలో తిరిగి సత్తగుణ సంపన్నుడైనాడు. తన జీవితంలోని పతనోత్థానాలను సంపూర్ణంగా గ్రహించుకొన్నవాడు గనుకనే ఉత్తమ మార్గంలో మనిషి జీవించడానికి కావలసిన 16 గుణాలను అతడు గుర్తించాడు. అతని అన్వేషణ ఫలించి ఉత్తమోత్తమ గుణాలు పదహారింటిని కలిగిన శ్రీరామచంద్రుని దర్శించాడు. ఆతని గాథను గానం చేయడమేకాక చేయించాడు. రామాయణాన్ని చిరస్థాయిగా లోకంలో నిలిపాడు.

‘ఓంకారం’తోనే పరమపదం

వాల్మీకేర్ముని సింహస్య

కవితా వన చారిణః

శృణ్వన్ రామకథా నాదం

కోనయాతి పరాంగతిం॥

వాల్మీకి మునులలో సింహం. మౌనం ఆయన ప్రధాన ప్రవృత్తి. మితభాషిత్వం కారణంగా సిద్ధించిన వాక్ఛక్తివల్లనే రామాయణ మహాకావ్యం మంత్రపూతమైంది. ఈ ముని సింహం కవిత్వమనే అడవిలో తిరుగుతున్నదట. సింహం మృగరాజు. కవిత్వంలో వాల్మీకికి సాటి మరొకరు లేరని అర్థం.

రామాయణేతిహాసంలోని మానవ జీవన విధాన చర్చను మాత్రమే గాక అందులోని కవిత్వాన్ని కూడా ఆస్వాదించాలన్నది ఇందులోని ధ్వని. రామాయణాన్ని నాదంగా (ఓం కారంగా) వినిపించినాక పరమగతి సిద్ధింపకుండా ఉంటుందా? వాల్మీకికి కైవల్యం సిద్ధించిందని అర్థం. మనందరకూ పరమపదం కచ్చితంగా లభిస్తుంది. లభించునుగాక.  

 వరిగొండ కాంతారావు

9441886824