04-03-2025 01:16:33 AM
తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఘటన
పటాన్ చెరు, మార్చి 3: మద్యానికి బానిసైన కొడుకు ఆస్తి కోసం జన్మనిచ్చిన తల్లిని కత్తితో పొడిచి చంపాడు. ఈ హృదయ విధారక ఘటన సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో సోమవారం తెల్లవారు జామున జరిగింది. స్థానికులు, కొల్లూరు పోలీసులు తెలిపిన వివరాల మేరకు... తెల్లాపూర్ కు చెందిన నవారి మల్లారెడ్డి కుటుంబంతో కలిసి గత కొంత కాలంగా డివినోస్ విల్లాస్ లో నివాసం ఉంటున్నారు. మల్లారెడ్డికి భార్య రాధిక(52), సందీప్రెడ్డి, కార్తీక్రెడ్డి ఇద్దరు కొడుకులు.
కాగా మద్యం, మత్తు పదార్థాలకు బానిసైన చిన్న కొడుకు కార్తీక్ రెడ్డి ఆస్తిని పంచాలని తరచూ ఇంట్లో గొడవ పడుతుండేవాడు. ఆస్తి పంపకాలకు కొన్ని రోజులు ఆగాలని తల్లి రాధికా కొడుకుకు సర్ది చెబుతుండేది. కాగా మద్యం మత్తులో ఉన్న కార్తీక్రెడ్డి సోమవారం తెల్లవారు జామున 4గంటల సమయంలో నిద్ర లేచి ఆస్తిని పంచాలంటూ తల్లితో గొడవకుదిగాడు. కొడుకును సమాదాన పరుస్తున్న క్రమంలోనే కోపోద్రిక్తుడైన కార్తీక్రెడ్డి ఆవేశంలో తల్లిని కత్తితో ఎనిమిది సార్లు కడుపులో పొడిచాడు. అడ్డుకోబోయిన తండ్రి, అన్నపై దాడి చేశాడు.
తండ్రి చేతికి గాయాలు అయ్యాయి. భయంతో తండ్రి మల్లారెడ్డి, పెద్ద కొడుకు సందీప్రెడ్డి కాపాడాలంటు బయటకు వెళ్లి అరవడంతో చుట్టు పక్కల వాళ్లు ఇంట్లోకి వచ్చే సరికి రాధిక రక్తం మడుగులో పడి ఉంది. వెంటనే సిటిజన్ దవాఖానకు తరలించిగా చికిత్స పొందుతూ మృతి చెందింది. సంఘటన స్థలానికి కొల్లూరు పోలీసులు వచ్చి కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడు కార్తీక్రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.