భారత ప్రధాన న్యాయమూర్తిగా సోమవారం పదవీ విరమణ చేయనున్న జస్టిస్ డీవై చంద్రచూడ్ సర్వోన్నత న్యాయస్థానం చరిత్రలో తనదైన ముద్ర వేశారు. సుప్రీంకోర్టు పని చేయడంలో అనేక సంస్కరణలు తీసుకు రావడం ద్వారా న్యాయవ్యవస్థను ప్రజలకు చేరువ చేశారు. 2016లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఎన్నికయినప్పటినుంచి ఎన్నో కేసుల పరిష్కారంలో డీవై చంద్రచూడ్ తనదైన ముద్ర వేశారు. అంతేకాక దేశ చరిత్రలో ఎక్కువ కాలం సీజేఐగా పనిచేసిన వైవీ చంద్రచూడ్ తనయుడయిన డీవై చంద్రచూడ్ చీఫ్ జస్టిస్‌గా తండ్రి ఇచ్చిన తీర్పులనే తిరగరాశారు.
వైవీ చంద్రచూడ్ అడల్టరీ చట్టం, గోప్యతకు సంబంధించి ఇచ్చిన తీర్పులను కుమారుడు డీవై చంద్రచూడ్ తిరగరాశారు. 2022 నవంబర్ 9న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన డీవై చంద్రచూడ్ తన పదవీ కాలంలో ఎన్నో చారిత్రాత్మక తీర్పులు వెలువరించారు. ఆర్టికల్ 370, స్వలింగ సంపర్కుల వివాహం, రామమందిరం, డ్రైవింగ్ లైసెన్స్, బుల్డోజర్ చర్య అంశాలతో పాటుగా ఉమర్ ఖలీద్, స్టాన్ స్వామి, జీఎస్ సాయిబాబా బెయిల్‌కు సంబంధించి సంచలన తీర్పులు ఇచ్చారు.
అన్నిటికన్నా మించి రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఎలక్టోరల్ బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధమని, ఏకపక్షమని పేర్కొంటూ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు జడ్జీల ధర్మాసనం ఆ పథకాన్ని రద్దు చేస్తూ తీర్పు చెప్పింది. స్వలింగ సంపర్కుల వివాహానికి చట్టబద్ధమైన గుర్తింపు ఇవ్వలేమని 2023 అక్టోబర్‌లో సీజేఐ చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం తీర్పు చెప్పింది. స్వలింగ వివాహం చేసుకున్న వారిని దంపతులుగా గుర్తించలేమని పేర్కొంది.
రాజ్యాంగంలోని 270 ఆర్టికల్‌ను రద్దు చేసి జమ్మూ, కశ్మీర్‌నుంచి లద్దాఖ్‌ను విభజించి దాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించడాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. ప్రస్తుతం కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్న జమ్మూ, కశ్మీర్‌కు రాష్ట్రహోదాను త్వరగా పునరుద్ధరించాలని, ఈ ఏడాది సెప్టెంబర్ 30లోగా అక్కడ ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది కూడా ఆయన నేతృత్వంలోని ధర్మాసనమే.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ యూజీ పేపర్ లీకేజి కేసులోనూ విచారణ జరిపిన సుప్రీంకోర్టు మరోసారి పరీక్ష నిర్వహించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. అలా ఆదేశిస్తే గతంలో పరీక్ష రాసిన దాదాపు 24 లక్షల మంది అభ్యర్థుల భవిష్యత్తుపై ప్రభావం చూపుతుందని డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. తాజాగా యూపీ మదర్సాల చట్టంపై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం మరో కీలక తీర్పు ఇచ్చింది.
ఈ చట్టాన్ని రద్దు చేస్తూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కన పెట్టింది. ప్రైవేట్ ఆస్తులను ప్రభుత్వాలు స్వాధీనం చేసుకోవడంపై ఇటీవల సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం వ్యక్తుల ఆధీనంలోని ఆస్తులన్నీ సమాజ ఉమ్మడి వనరులు కావని తేల్చి చెప్పింది.
నోయిడా ట్విన్ టవర్స్ కూల్చివేత, జైళ్లలో కులవివక్ష, బాల్య వివాహాలు.. ఇలా అనేక అంశాలపై చంద్రచూడ్ సీజేఐగా ఉన్నప్పుడేసర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పులిచ్చింది. తన పదవీకాలం చివరి రోజు సైతం జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీకి మైనారిటీ హోదాపై కీలక తీర్పు ఇచ్చింది.
దీన్ని మైనారిటీ సంస్థగా గుర్తించలేమంటూ 1967లో అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని బెంచ్ నిర్ణయించింది. అయితే దీనికి మైనారిటీ హోదా ఉండాలా వద్దా అనే అంశాన్ని తేల్చేందుకు పిటిషన్లను వేరే బంచ్‌కి బదిలీ చేయాలని నిర్ణయించింది. కేవలం రెండేళ్ల కాలంలోనే ఎన్నో చరిత్రాత్మక తీర్పులు వెలువరించిన చంద్రచూడ్ న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను ఇనుమడింపజేశారడంలో సందేహం లేదు.