calender_icon.png 14 November, 2024 | 9:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

న్యాస్ సర్వేలో ఈసారి ఎక్కడో!

10-11-2024 01:02:16 AM

  1. 2021లో చివరన రాష్ట్రం
  2. డిసెంబర్ 4న న్యాస్ సర్వే

హైదరాబాద్, నవంబర్ 9 (విజయక్రాంతి): ఈసారి నేషనల్ అచీవ్‌మెంట్ సర్వే (న్యాస్) ఫలితాలపై కులగణన సర్వే ఎఫెక్ట్ పడనుంది. ఉపాధ్యాయులు రాష్ట్రప్రభుత్వం నిర్వహిస్తున్న కులగణన సర్వేలో పాల్గొననుండటంతో న్యాస్‌లో మెరుగైన ఫలితాలు సాధించడం కష్టంగానే కనబడుతోంది. దేశవ్యాప్తంగా విద్యాప్రమాణాలు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు ప్రతీ మూడేండ్లకు ఒకసారి న్యాస్ పరీక్షను కేంద్ర ప్రభు త్వం నిర్వహిస్తోంది.

ఈ క్రమంలోనే తెలంగాణలో డిసెంబర్ 4న ఈ న్యాస్ సర్వే జరగనుంది. జాతీయ విద్యాపరిశోధన, శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్టీ) రూపొందించిన ప్రశ్నాపత్రాలను 3, 6, 9వ తరగతుల విద్యార్థులకు ఇచ్చి పాఠశాల విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలు ఎలా ఉన్నాయో పరిశీలించనున్నారు.

ఈసారి దేశవ్యాప్తంగా 792 జిల్లాల్లో ఈ సర్వేను నిర్వహిస్తున్నారు. 3, 6, 9 తరగతులకు చెందిన దాదాపు  50 లక్షల మంది విద్యార్థులు పాల్గొనబోతున్నారు. ప్రతి మూడేళ్లకోసారి ఈ సర్వేను నిర్వహిస్తారు. 2021లో నవంబర్ 12వ తేదీన 3, 5, 8, 10వ తరగతి విద్యార్థులకు నిర్వహించారు. అప్పుడు ఆ సర్వేలో తెలంగాణ రాష్ట్రం అట్టడుగు స్థానానికి పడిపోయింది.

 రాష్ట్రంలో శనివారం నుంచి అసలైన కులగణన సర్వే ప్రారంభమైంది. ఈ సర్వేలో దాదాపు 40 వేల మంది ప్రాథమిక పాఠశాలలకు చెందిన ఎస్జీటీ టీచర్లు, హెచ్‌ఎంలు పాల్గొంటున్నారు. మూడు వారాల పాటు ప్రాథమిక స్కూళ్లు ఒంటి పూటే నడవనున్నాయి. ఈక్రమంలో న్యాస్ పరీక్షలో మెరుగైన ఫలితాలు సాధించడమెలా అని పలువురు ఉపాధ్యాయులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

న్యాస్ పరీక్ష కోసం ఇప్పటికే మాక్ టెస్టులు, మాడల్ పేపర్లను తయారుచేసి విద్యార్థుల చేత ప్రాక్టీస్ చేయిస్తున్నారు. గత న్యాస్ ఫలితాల కంటే రాష్ట్రం మెరుగైన ఫలితాలను రాబట్టాలంటే ప్రణాళికలతో ముందుకెళ్లాల్సి ఉంటుంది. ఒకవైపు కులగణన విధులు, రోజూ వారి విధులు, ప్రభుత్వ కార్యక్రమాల పనులు ఉపాధ్యాయులపై వచ్చి పడడంతో చదువులకు ఆటంకంగా మారనుంది.