calender_icon.png 25 December, 2024 | 6:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆత్మకథలోని కొన్ని అరుదైన సంఘటనలు

23-09-2024 12:00:00 AM

అగ్రహారంగా వేములవాడ

వేములవాడ బ్రాహ్మణాగ్రహారం. ఆ ఊరి బ్రాహ్మణులందరూ మంచి ఈనాం భూములున్న వారు. దేవాలయం ఆదాయంలోనూ వారికి ‘ఘర్ పట్టీ’ అనే పేరుతో ప్రతి సంవత్సరం ఆయా కుటుంబాల భాగాలను అనుసరించి రూపాయలను పంచి ఇచ్చేవారు. వారివి రెండు మూడు భవంతుల ఇండ్లు. కనుక, ఎన్ని కుటుంబాలు వచ్చినా తమ యిండ్లలోనే వారి వారికి తగిన విధంగా వసతి ఏర్పాటు చేసేవారు. బ్రాహ్మణులకైతే వంటలు చేసి భోజనాలు కూడా పెట్టేవారు. ఇంటికి కిరాయ లేదు. గృహస్థులు వారి శక్తికి తగినట్లుగా పురోహితులకు సంభావన ఇచ్చేవారు. కనుక వారి జీవనం సుఖంగా సాగిపోయేది.

ఉస్మాన్ అలీ ‘సిల్వర్ జూబ్లీ’ పతకాలు

ఒకటవ తరతగతిలో ఉండగా అప్పటి నిజాం నవాబు ఉస్మాన్ అలీగారి ‘సిల్వర్ జూబ్లీ మహోత్సవం’ జరిగింది. విద్యార్థులందరికీ మూడేసి పైసలకొకటి చొప్పున జూబిలీ పతకాలను స్కూలులో ఇచ్చినారు. స్కూలులో నేను 2వ తరగతి చదువలేదు. నాకు 1వ తరగతి సంవత్సర పరీక్షలో మంచి మార్కులు వచ్చినందున డబల్ ప్రమోషనిచ్చి 3వ తరగతికి పంపించినారు. 

పంచశిఖలవల్ల స్కూలులో అవమానం

3వ తరగతిలో ఉండగానే నాకు వడుగైంది. అప్పటి వరకు నాకు శిఖ లేదు. మా ఇంటిలో వడుగయ్యే వరకు జుట్టును శిఖగా ఉంచే వంచన లేదు. ‘వంచన’ అంటే ఇంటి ప్రత్యేక ఆచారం. వడుగులో పంచశిఖల నేర్పాటు చేసినారు. నెత్తికి టోపీ అలవాటు లేదు. అందుకని స్కూలు పిల్లలు నన్ను పరిహాసం చేసేవారు. అది నాకు అవమానంగా ఉండేది.

300 రూపాయలతో ముల్కీ సర్టిఫికెట్

నేను ప్రభుత్వోద్యోగంలో చేరాలని నిర్ణయించుకొని, అందుకు ముఖ్యంగా కావలసి ఉండిన ముల్కీ సర్టిఫికెట్టును సంపాదించే ప్రయత్నం ప్రారంభించినాను. సీతాఫలమండిలో 16 రూపాయలకు దొంగ ముల్కీ సర్టిఫికెట్టులు దొరుకుతున్నవని ఎవరో చెప్పినారు. చాలామంది ఈ సర్టిఫికెట్టులతోనే ఉద్యోగాలు సంపాదించుకొన్నట్లుగా కూడా తెలియవచ్చింది. నాకది రుచించలేదు. నిజామాబాద్ కలెక్టరాఫీసు నుంచి సక్రమ మార్గంలో ముల్కీ సర్టిఫికెటును తీసుకోవాలని నిర్ణయించుకొన్నాను. దానికి గ్రామ పట్వారి, తహసీల్దారుల ద్వారా దరఖాస్తు చేయగా, విచారణానంతరం 300 రూపాయిల వ్యయంతో జూన్‌లో నాకు ఆ సర్టిఫికెట్ లభించింది.

ముద్రణకు నోచుకోని రచనలు

ముని మాణిక్యం నరసింహారావు గారికి నా మీద చాలా మంచి అభిప్రాయం ఉండేది. ఆయన నా చేత రేడియోలో వివిధ విషయాలపై ప్రసంగాలు చేయించారు. రేడియో నాటికలు వ్రాయించారు. అట్లాగే, కేశవపంతుల నరసింహశాస్త్రిగారు సంస్కృతాంధ్ర సాహిత్యాలపై ప్రసంగాలు చేయించారు. ఆ ప్రసంగాలను జాగ్రత్తగా కాపాడలేక పోవడం చేత అవి ముద్రణ భాగ్యానికి నోచుకోలేకపోయినవి.

ఆర్మూరులో తొమ్మిది గజాల చీరలు

ఆర్మూరుకు నవనాథ క్షేత్రమని ప్రసిద్ధి. ఈ ఊరిలో పట్టు పరిశ్రమ బాగా వృద్ధి పొందింది. ఇక్కడి పట్టు నేతవారు పట్కరివారు. ఈ కుటుంబాల సంఖ్య ఇక్కడ చాలా ఎక్కువగా ఉండేది. వీరు ప్రధానంగా పట్టుచీరలు తయారుచేసేవారు. ఇవి తొమ్మిది గజాల చీరలు. మహారాష్ట్ర ప్రాంతంలో వీటికి మంచి గిరాకీ ఉండేది.

శ్రీపాద వంటివారికే తప్పలేదు!

ఆ మహాసభల్లో ఒక అపశ్రుతి దొర్లింది. శ్రీపాదకృష్ణమూర్తి శాస్త్రి కమ్యూనిస్టు పార్టీ విధానాలు భారతీయ సంప్రదాయ విరుద్ధాలని సభలో వ్యాఖ్యానించారు. ముంగొండలోని గుర్రబ్బండ్ల వాళ్లు ఆ పార్టీకి విధేయులైన కార్యకర్తలుగా ఉండేవారు. వ్యతిరేక ప్రదర్శనలుగాని నినాదాలుకాని చోటు చేసికోలేదు. కాని, ఆ బండ్లవారు కృష్ణమూర్తిశాస్త్రిగారికే కాదు, సభలకు వచ్చిన పండితులెవ్వరికి గుర్రబ్బండ్లు కట్టరాదని నిర్ణయించుకొన్నారు. ముంగొండ నుండి ఎటువైపు వెళ్లాలన్నా గుర్రబ్బండ్లే ఆధారం. అక్కడికప్పుడు బస్సు సౌకర్యం లేదు. బస్సుకోసమైతే అంబాజీపేటకు వేళ్లాలె. లాంచీకోసమైతే గన్నవరానికి వెళ్లాలె. ఎటు వెళ్లాలన్నా మూడు నాలుగు కిలోమీటర్ల ప్రయాణం. పండితులందరూ శాస్త్రిగారితో సహితంగా సభలై పోయిన తరువాత కాలి నడకనే ప్రయాణం చేయవలసి వచ్చింది.

మగపెండ్లి వారివలె ఆంధ్రులకు సౌకర్యాలు

హైదరాబాద్‌లో ఆంధ్ర నుండి వచ్చిన ఉద్యోగుల కోసమైతే ప్రభుత్వం వారు సమకూర్చిన సౌకర్యాలు ఇన్నీఅన్నీ కావు. మగపెండ్లి వారు వస్తూ ఉన్నారంటే విడిదికోసం ఆడపెండ్లి వారు కావించే ఏర్పాట్లను తలదన్నే విధంగా జరిగినవి ఆ ఏర్పాట్లు. గుంటూరునుండి హైకోర్టు రాకతో అక్కడినుండి ఆ ఉద్యోగులు హైదరాబాదుకు వచ్చినారు. కర్నూలు నుండి ప్రభుత్వ కార్యాలయాలు వచ్చినందువలన అక్కడ గుడారాల్లో ఉన్న ప్రభుత్వోద్యోగులు ఇక్కడికి తరలి వచ్చినారు.

వీరికోసం ప్రభుత్వం వేలకొలది ఇండ్లతో కాలనీలకు కాలనీలనే నిర్మించింది. ఆ విధంగా వచ్చిందే మలక్‌పేటలోని ఆంధ్రకాలనీ, పంజాగుట్టలో కాలనీ, దానికి సమీపంలోనే మరో కాలనీ. వీటికి రోడ్డు సౌకర్యం, కరెంటు సౌకర్యం, నీళ్ల సౌకర్యం చేకూర్చారు. వారి వైద్య సౌకర్యం కోసం ఆంధ్ర కాలనీలో ఒక ప్రభుత్వ వైద్యశాల యేర్పడింది. వారి పిల్లల చదువుల కోసం ప్రత్యేకంగా స్కూలు సౌకర్యం, ఆఫీసులకు ప్రయాణం చేయడానికి స్పెషల్ బస్సులను ఏర్పాటు చేసినారు. ప్రభుత్వం ప్రైవేటు ఇండ్లవారు తమ ఇండ్లను ఇష్టం వచ్చిన రీతిగా కిరాయలకీయకుండా రెంట్ కంట్రోల్ యాక్టును అమలు చేసిందికూడా. 

చప్పా ఆచారం

వేములవాడ రాజేశ్వరస్వామి దేవాలయంలో గుడిలో ప్రవేశించడానికి ముందు సింహద్వారంలోకి వెళ్లగానే మూడు పైసలిచ్చి చప్పా కొట్టించుకోవలసిన ఆచారం ఉండేది. ఇది దేవాలయానికి చాలా ఆదాయం ఇచ్చే వనరుగా ఉండేది. ఇప్పుడిది ఉన్నదో? లేదో? అయితే బ్రాహ్మణులకు చప్పా అవసరం ఉండేది కాదు.

(‘ఆత్మ నివేదనం’ నుంచి..)