calender_icon.png 2 October, 2024 | 9:53 AM

రామప్ప గుడిలో మరిచిపోయిన కొందరు దేవుండ్లు

02-10-2024 12:00:00 AM

శ్రీరామోజు హరగోపాల్ :

రామప్ప గుడి మంటపం, ఉపాలయాల్లో కొన్ని విడి విగ్రహాలు కనిపిస్తాయి. వాటిలో ఉమామహేశ్వరుడు, గణేశుడు, భైరవుడు, సూర్యుడు, కేశవమూర్తి, మహిషాసురమర్దిని విగ్రహాలున్నాయి. 

ఉమామహేశ్వరుడు: ఈ శిల్పంలో అధిష్ఠాన పీఠం మీద ఉమాసహితుడైన శివుడు, వాహనం నంది కనిపిస్తారు. మహేశ్వరుడు చతుర్భుజుడు. పరహస్తాలలో ఢమరుకం, సర్పం, నిజహస్తాలలో కుడిచేయి అక్షమాల ధరించిన అభయహస్తం, ఎడమచేతి ఉమాలింగన హస్తం. ఉమదేవి శివుణ్ణి కుడిచేత కౌగిలించుకుని, శివుని ఎడమ తొడమీద కూర్చున్నది. ఇద్దరి తలలపై కరండమకుటాలు, చెవులకు పెద్ద కుండలాలు ధరించి ఉన్నారు. చాళుక్యశైలి శిల్పమిది.

గణపతి: మూషిక వాహనుడు, లలితాసనంలో కూర్చొని ఉన్నాడు. తలపై కరండమకుటం, చేట చెవులు, చతుర్భుజుడే అయినా పరహస్తాలు విరిగిపోయాయి. నిజహస్తాలలో విరిగిన దంతం, కుడుములున్నాయి. మెడలో హార, గ్రైవేయకాలున్నాయి. పొట్టమీద సర్పమే ఉదర బంధంగా ఉంది. తొండం ఎడమవైపు అడ్డంగా ఉంది. ఇది కూడా చాళుక్యశైలి శిల్పమే.

భైరవుడు: ఈ శిల్పం త్రిభంగిమలో స్థానక శిల్పం. జటామకుటంతో, సర్పకుండలాలతో, అష్టభుజాలతో, మెడలో హార, గ్రైవేయకాలతో, మోకాళ్ల మీద నాగబంధంతో, కపాలమాలాలంకృతుడైన కాలభైరవుడు శ్వానంతో, సర్పం అధిష్టాన పీఠంగా కనిపిస్తున్నాడు. అద్భుత తాంత్రిక భైరవ శిల్పం.

కేశవమూర్తి: కాకతీయశైలి మకర తోరణంతో సమస్థానక భంగిమలో నిల్చున్న వైష్ణవమూర్తి శిల్పం. చతుర్భుజుడు. కరండమకుటం, హార, గ్రైవేయకాలు, హస్తభూషణాలు, మేఖల, ఉరుడాలు, జయమాలతో గరుడ, లక్ష్మీసమేతుడై కనిపిస్తున్నాడు. చేతులు విరిగిపోవడం వల్ల వైష్ణవమూర్తిని గుర్తించడంలో ఇబ్బంది. 

ఆదిత్యుడు: కాకతీయశైలి ఆదిత్యశిల్పం. సమస్థానక భంగిమలో నిల్చున్న సూర్యుడు ద్విభుజుడు. ఆ రెండు చేతులు విరిగిపోయి ఉన్నాయి. కరండమకుటంతో, సర్వాలంకార భూషితుడైన మూర్తి పాదాల కింద అధిష్టానం మీద సప్తాశ్వాలున్నాయి. మూర్తికి రెండువైపుల దేవేరులిద్దరున్నారు.

మహిషాసురమర్దిని: దశభుజి మహిషాసురమర్దిని. దేవత కుడికాలు నేలమీద ఆనించి, ఎడమకాలు రాక్షసుని ఎడమ తొడ మీద పెట్టింది. దేవత చేతుల్లో చక్రం, ఖడ్గంపై కుడిచేతుల్లో గుర్తింపవీలుకాని ఆయుధాలు, పైఎడమచేతుల్లో శంఖం, పాశం, పాత్ర ధరించింది. ముందరి కుడిచేత త్రిశూలాన్ని మహిషాసురుని దేహంలోనికి దింపింది. ఎడమచేత రాక్షసుని చేయిని వొడిసిపట్టుకున్నది.

ఆ రాక్షసుడు మహిషదేహం నుంచి పుట్టుకొస్తున్నాడు. దేవత తలపై కరండ మకుటం ఉంది. కుచబంధం, యజ్ఞోపవీతం, కంకణాలు, ఇతర ఆభరణాలున్నాయి. దేవతకు కుడి, ఎడమల్లో అంజలి ముద్రలతో స్త్రీల శిల్పాలున్నాయి. తెలంగాణలో మహిషాసురమర్దిని శిల్పాలు వందలాదిగా కనిపిస్తాయి.

వీటిలో రెండు చేతుల నుంచి చతుర్వింశతి హస్తాలతో కనిపించే శిల్పాలున్నాయి. అవి 6 నుంచి 17,18వ శతాబ్దాలదాక చెక్కిన శిల్పాలు. బాదామీ చాళుక్య శిల్పాలశైలి నుంచి విజయనగర, వారి సామంతుల దాక వైవిధ్యభరితమైన శైలులలో కనిపించే విగ్రహాలెన్నో ఉన్నాయి.