calender_icon.png 23 December, 2024 | 7:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సోమనాథ సోమయాజి

28-10-2024 12:00:00 AM

“కలరు బిక్కనవోలి శ్రీకామిరెడ్డి

భూమి విభునాశ్రయించిన బుధులు నిజము..”

అని బిక్కనవోలు (దోమకొండ సంస్థానం)ను అనేకమంది పండిత కవి  ఆశ్రయించి గొప్పనైన సాహిత్య సృష్టి చేశారు. ఆ విధానాన్ని తన ‘బ్రహ్మోత్తర ఖండము’ కావ్యంలోని కృత్యవతారికలో దోమకొండ సంస్థాన పండిత కవి పట్టమెట్ట సోమనాథ సోమాయాజి కవీశ్వరుడు స్పష్టంచేశాడు. ఈ మాటలనుబట్టి దోమకొండ సంస్థానం పండిత కవుల  కల్పవృక్షంగా భాసించినట్లు అర్థమవుతున్నది.

కామారెడ్ది ఆస్థాన కవి

ప్రస్తుతం తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో ఉన్న దోమకొండ నైజాం పాలనా కాలంలో ఒక గొప్ప సంస్థానంగా వెలిగింది. ఈ సంస్థానాధిపతులైన పాలకులు అత్యంత సమర్థులేగాక స్వయంగా గొప్ప విద్వాంసులు, కవులు కూడా. అంతేకాదు, వారు ఎందరెందరో కవి పండితులను పోషించి, విశేష గ్రంథాలు వెలుగు చూడటానికి కారణమయ్యారు.

బిక్కనవోలుగా నామాంకితమైన దోమకొండ సంస్థానాన్ని కామినేని కామారెడ్డి 16వ శతాబ్దపు ఉత్తరార్ధంలో పాలించారు. ఆయన సోదరుడే కామినేని మల్లారెడ్డి. ‘షట్చక్రవర్తి చరిత్ర’, ‘శివధర్మోత్తరము’ వంటి మహాగ్రంథాల రచయిత. పట్టమెట్ట సోమనాథ సోమాయాజి ఈ కామారెడ్డి ఆస్థాన కవియే. అంతేకాదు, కేవలం ఆయన కామారెడ్డి సతీర్థ్యుడు కూడా కావడం విశేషం.

కామినేని కామారెడ్డి గురువు లింగారాధ్యు డు. ఆయన పండితారాధ్యుల వారి వంశస్థుడు. ఆయన వద్దే అధ్యయనం చేసిన శిష్యులలో పట్టమెట్ట సోమనాథ సోమయాజి కూడా ఒకడు. తాను కామారెడ్డికి సతీర్థ్యుడనన్న సంగతిని ఆయన తన ‘సూత సహిత’లో స్పష్టపరిచారు. 

“.. అత్యాప్తుడు సతీర్థ్యుడైన కామారెడ్డి 

పట్టభద్రుని ధర్మపాటవంబు

తత్సభాసదులైన ధన్య విద్వాంసుల

సంతత సల్లాప సమ్మతంబు..

కారణంబులుగా నిరాఘాట చాటు

శుద్ధపద్ధతి దెనుగున సూత సంహి

తా చతుర్విద ఖండ సందర్భమెల్ల

గావ్య మొనరింతు లోక విఖ్యాతముగను”

అని చెప్పుకున్నాడాయన. దీనినిబట్టి కామారెడ్డికి తనకుగల విద్యా బాంధవ్యాన్ని సోమయాజి  నిరూపించుకున్నట్లయింది. 

గడియకు నూరు పద్యాలు

ఈ కవి.. గడియకు నూరు చొప్పున పద్యాలు చెప్పగల దిట్ట.  “అఖిల దిగ్దేశ రాజాస్థాన విఖ్యాత చాటుధారా చతురిమంబు” కలిగిన కవి. ఆయన రచనలైన ‘సూత సంహిత’ ఏడు ఆశ్వాసాల కావ్యం. ‘బ్రహ్మోత్తర ఖండము’ అయిదు ఆశ్వాసాల కావ్యం. ఈ రెండు పద్య కావ్యాలు సోమయాజి కవి ‘విశేషాంధ్రోక్తి’ని తెలుపుతున్నవే. దోమకొండకు కామారెడ్డి పాలకుడు కాగానే ఆయన ఆస్థాన కవియై పట్టమెట్ట సోమయాజి పలు గౌరవాలను అందుకున్నాడు. “మాకు సతీర్థ్యుడవనురక్తుడవా శ్రితుడవు” అని కామారెడ్డితోనే గొప్ప గౌరవాన్ని పొందాడు. అంతటి సమర్థుడైన కవీశ్వరుడు సోమయాజి.

వెల్లంపల్లి నుంచి దోమకొండకు!

పట్టమెట్ట సోమనాథ సోమయాజి జన్మస్థలం ‘రాజ మహేంద్ర దుర్గస్థలోభయగౌతమి మధ్య సీమ..” యైన వెల్లంపల్లి గ్రామం. లింగనారాధ్యుల వద్ద విద్యాధ్యయనం చేశాడు. కామారెడ్డికి కూడా ఆయనే గురువు. ఈ కారణంగా ఆయనకు అంత గొప్ప సంస్థానంలో ఆశ్రయం లభించింది. కామారెడ్డి పాలకుడు అయ్యేనాటికి ఈ సంస్థాన పాలకులు కుతుబ్ షాహీ రాజుల సామంతులు. కామారెడ్డి కూడా కులీ కుతుబ్ షా సామంతుడు. కామారెడ్డి సోదరుడైన కామినేని మల్లారెడ్డి తన ‘శివధర్మోత్తర’ కావ్యంలో అదే విషయాన్ని పేర్కొన్నాడు.

“భవ్యసులతాను మహమ్మదు పాదుషా హ

లబ్ధ భూషణలలిత పల్యంకికాంక

పత్ర చామర సామ్రాజ్యభరిత విభవ

రమ్యగుణ శాలి శ్రీకామరెడ్డి మౌళి”

అన్న పద్యం ద్వారా అది వ్యక్తమవుతున్నది. 

ఎందరో కవులకు ఆదరణ

కామారెడ్డి పాలనా బాధ్యతలను చేపట్టగానే తన సతీర్థ్యుడు, విశేష ప్రతిభా సమన్వితుడు అయిన సోమనాథ సోమయాజిని తన ఆస్థాన కవిని చేసి గౌరవించాడు. సోమయాజి కవి రచించిన ‘సూత సంహిత’కు ప్రేరకుడయ్యాడు. ఆయన ఆస్థానంలో ఎంతోమంది పండిత కవి సముచిత గౌరవాదరాలు పొందినట్లు సోమనాథ సోమయాజి తన ‘బ్రహ్మోత్తర ఖండము’లోని కృత్యవతారికలో పేర్కొన్నాడు.

కలరు బిక్కనవోలి శ్రీకామరెడ్డి

భూమి విభునాశ్రయించిన బుధులు నిజము..” 

అంటూ ప్రశంసించాడు. ఇది దోమకొండ సంస్థాన పాలకుల సాహితీ ప్రియత్వాన్ని చాటుతున్నది. 

పాలకులు కూడా 

పండితులు కావడం వల్లే!

దోమకొండ పాలకులలోని ఇంతటి సాహిత్య ప్రియత్వమే పట్టమెట్ట సోమనాథ సోమయాజిని ఆకర్షించింది. ఆయనను రాజమహేంద్రవరం నుంచి దోమకొండకు తీసుకొని వచ్చింది. పాలకులు కూడా స్వయంగా పండితులు కావడం వల్లే ఇలాంటివి సుసాధ్యమవుతాయి. 

కామారెడ్డి సోదరులలో ఒకడైన కామినేని ఎల్లారెడ్డి కూడా సోమయాజి రచన ప్రేరకులలో ఒకడు. ఆయన కూడా స్వయంగా కవి. ‘వాసిష్ఠము’, ‘లింగ పురాణము’ వంటి రచనలను కామినేని ఎల్లారెడ్డి చేసినట్లు తెలుస్తున్నది. కానీ, ఈ రచనలు ఇప్పటికీ సాహితీ లోకానికి లభ్యం కావడం లేదు. సాహిత్యపు విలువ తెలిసినవాడు గనుక ‘బ్రహ్మోత్తర ఖండము’ రచనకు సోమనాథ సోమయాజి కవికి కామారెడ్డి ప్రేరకుడై నిలిచాడు. ఈ ఇరువురు సోదరుల ప్రేరణతో తాను రచించిన ‘సూత సంహిత’ను శ్రీ సిద్ధరామేశ్వర స్వామి (ప్రస్తుత బిక్కనూరు సమీపంలోని)కి అంకితమిచ్చి తరించినాడు. ఆయన రచించిన రెండు కృతులకు ‘స్కాంద పురాణమే’ మూలం.

కవిత్వంలో అటు ప్రియత్వం, ఇటు ధర్మం

కవితా రచనల్లో పట్టమెట్ట సోమనాథ సోమయాజి కవికి కొన్ని ప్రత్యేకమైన ఆలోచనలు వున్నాయి. ముఖ్యంగా కవిత్వ శైలి గాంగఝరీ సదృశంగా ఉండాలన్నది ఆయన భావన. కవిత్వ ప్రియత్వాన్ని, కవిత్వ ధర్మాన్ని ఒక ప్రత్యేకమైన సీసపద్యం ద్వారా వెలిబుచ్చాడు.

ఇది సోమయాజి కవిత్వాన్ని గురించి గొప్పగా తెలియజేస్తుంది. అంతేకాక, ‘కవిత్వమనేది ఎవరు రాసినా, ప్రతి కవికి ఉపయోగపడే ఒక కవిత్వ ధర్మంగా నిలిచే విధంగా’ ఈ గ్రంథరచన చేశాడు. ఇందుకు నిదర్శనంగా నిలిచే పద్యాన్ని కూడా ఆయన పొందుపరిచాడు.

సోమనాథ సోమయాజి కవి ‘బ్రహ్మోత్తర ఖండము’ కాని, ‘సూత సంహిత’ కాని రెండూ మూలానుసారమైన అనువాదాలే. అయినప్పటికినీ కవిత్వ శైలి విషయంలో ప్రత్యేకతను పాటించాడు.

“సర్వజ్ఞ మౌళి భూషణమైన శబ్ద శా

సనుబహుముఖ రసజ్ఞతను దలచి

యోగ్య శ్రుతిహిత ప్రయోగుడౌ సోమయా

జులరీతి వృత్తి సంశుద్ధి నొంది

నిర్దోష సుసమాధి నియతోక్తియగు శంభు

దాసు ప్రసాద పాత్రత నుతించి

నిస్తులౌజః కాంతినిధులైన సోమ

భాస్కరుల శబ్దగుణ ప్రసక్తి బొగడి

రుచిరపద సిద్ధ ధారానిరూఢ మహిమ

దగిన శ్రీనాథు నచ్యుతత్వము గ్రహించి

తత్కవిత్వ కథాసుధా ధాన సంత

తావధానైక చిత్తుండనై కడంగి-”

అంటూ చెప్పిన పద్యం పూర్వకవి స్తుతి నెపంతోనే సాగింది. 

పూర్వకవుల అడుగుజాడల్లో!

కవిత్వ తత్వాన్ని, కవిత్వ పరిపక్వతను, కవిత్వ ధర్మాన్ని భంగ్యంతరంగా చెప్పడం ద్వారా కవులకు మార్గదర్శనం చేశాడు సోమనాథ సోమయాజి. తెలుగు సాహితీ విహాయసంలో శాశ్వత తారలై వెలుగుతున్న మన పూర్వకవుల ప్రతిభా విశేషాలను పొందు పరిచిన పద్యం ఎంతో గొప్పగా ఉంది. నన్నయ పద్యశైలిలోని గంగాఝరీ సదృశమైన విధానం, తిక్కన సోమయాజి కవిత్వంలోని ప్రయోగ దక్షత, ఎఱ్ఱనలోని ‘నిర్దోష సుసమాధి నియతోక్తి’, నాచన సోమన, భాస్కరుని వంటి మహాకవులలోని సాటిలేని ఓజస్సు, శ్రీనాథునివంటి మహాకవి పదప్రయోగ దక్షతవల్ల కలిగిన ధారానిరూఢత కవిత్వాన్ని వెలిగించడమేగాక, దానికి గొప్ప రసజ్ఞతను, గొప్పనైన వృత్తి సంసిద్ధిని, సుప్రసాద పాత్రతను, విశేష శబ్ద గుణాధిక్యాన్ని, ధారాశుద్ధిని కలిగిస్తాయనీ చెప్పాడు. ఇది పూర్వకవుల ప్రతిభా విశేషాలను తెలుపుతున్నది. అంతేకాక, ఎవరు కవిత్వం రాసినా ఈ విధమైన లక్షణాలను తమ కవిత్వంలో పొందుపరిస్తే ఆ కవిత్వం కలకాలం మనగలుగుతుందన్న భావాన్ని సైతం బోధిస్తూ ఉంది. 

సోమయాజి కవిత్వాన్ని గురించి ప్రముఖ సాహిత్య చరిత్రకారులు చాగంటి శేషయ్య, శ్రీనాథుని కవితా విన్యాసం వంటి చతురతను చూపిన కవిగా ఆయన్ను అభివర్ణించారు. పైన పేర్కొన్న ఒక్క పద్యం చాలు కవి ప్రతిభను తెలుసుకోవడానికి! 

దోమకొండ సంస్థాన పాలకుల కీర్తిని పదికాలాలపాటు పదిలంగా నిలబెట్ట కలిగే స్థాయిలో తన కావ్యాలను అందించిన పట్టమెట్ట సోమనాథ కవి నిజంగా మిక్కిలి గౌరవింపదగిన వాడు. ‘తెలుగు సాహిత్య లోకం ఎల్లప్పుడు మరిచిపోని రీతిలో కావ్య నిర్మాణం చేసి సహృదయుల మెప్పును అందుకున్న కవిగా’ ఆచార్య ఎస్.వి.రామారావు చెప్పిన మాటలు సంపూర్ణ సత్యాలు.

సోమయాగం నిర్వహించిన రెండో తెలుగు కవి

పట్టమట్ట సోమనాథ సోమయాజి కవి సోమయాగం నిర్వహించి సోమయాజి అయ్యాడు. సోమనాథ కవి సోమయాజిగా అయిన తెలుగు కవుల్లో రెండవ వాడని ఆరుద్ర పేర్కొన్నారు. తిక్కన తర్వాత తెలుగు సాహిత్యంలో మళ్లీ ఈయనే సోమయాజి అని ఆరుద్ర చెబుతూనే ఈ కవిని గురించి, “వ్యాకరణం బాగా చదువుకున్నాడు.

తర్క వేదాంత ధర్మశాస్త్ర క్రమాలు బాగా తెలిసిన వాడు” అన్న మాటలు కూడా సోమనాథ సోమయాజి కవి ప్రతిభా వైశాల్యానికి దర్పణం పట్టే విధంగా ఉన్నాయి. ఇటువంటి మహా కవులను మనం సమాదరించడం వల్ల స్వయంగా కవులైన దోమకొండ సంస్థాన పాలకుల కీర్తి పతాకం సాహిత్యాకాశంలో చిరస్థాయిగా రెపరెపలాడింది.

గన్నమరాజు గిరిజా మనోహరబాబు

9949013448