calender_icon.png 8 April, 2025 | 7:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎఫ్టీఎల్ నిర్ధారణతో సమస్యలకు పరిష్కారం

08-04-2025 01:13:27 AM

చెరువుల్లో మట్టి నింపడంతో.. మారిపోతున్న ఎఫ్టీఎల్ పరిధి

నిర్ధారణకు ‘లేక్ ఎన్యుమరేషన్ యాప్’

హైడ్రా కమిషనర్ ఏవీ.రంగనాథ్

హైడ్రా ప్రజావాణికి 57ఫిర్యాదులు

హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 7(విజయక్రాంతి) : నగరంలోని చెరువుల్లో మట్టి నింపడంతో ఎఫ్టీఎల్ పరిధులు మారిపోతున్నాయని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. సోమవారం హైడ్రా ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. మొత్తం 57 ఫిర్యాదు లు వచ్చాయి. వీటిలో కాలనీల రహదారులకు ఇబ్బందులు కలిగించడం, పాత లేఔట్ల హద్దులను పట్టించుకోకుండా కబ్జాలు చేయ డం, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలను ప్లాట్లుగా చేసి అమ్మేయడం వంటి  ఫిర్యాదులు వచ్చాయి. వాటిని ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలోని చెరువుల ఎఫ్టీఎల్ నిర్ధారణ పూర్తుతై చాలా సమస్యలకు పరిష్కారం చూపినట్లువుతుందన్నారు.

వీలైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేయా లని అధికారులకు దిశానిర్ధేశం చేశారు. ఎఫ్టీఎల్ నిర్ధారణ కోసం రూపొందిస్తున్న ‘లేక్ ఎన్యుమరేషన్’ అనే యాప్‌లో ప్రజల అభ్యంతరాలు తెలిపేందుకు ప్రత్యేక కాలమ్‌ను పెట్టాలని సూచించారు. గ్రామ, రెవెన్యూ, హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ, ఇరిగేషన్, సర్వే ఆఫ్ ఇండియా రికార్డులతో పాటు ఎన్‌ఆర్‌ఎస్‌సీ శాటిలైట్ ఇమేజీలతో ఎఫ్‌టీఎల్ నిర్ధారణ జరుగుతోందని తెలిపారు. అపోహలకు ఆస్కారం లేకుండా నిఫుణుల కమిటీ వేసి జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. 

ఫిర్యాదులు ఇలా.. 

మేడ్చల్ జిల్లా గాజులరామారంలోని సర్వే నంబర్161లో ఉన్న పార్క్ స్థలంతో పాటు పక్కనే ఉన్న ప్రబుత్వ స్థలం కబ్జా అయిందని స్థానికులు ఫిర్యాదు చేశారు. కాప్రా చెరువు ఎఫ్‌టీఎల్ నిర్ధారణ అయిందని, ఫెన్సింగ్‌ను తొలగించి పలువురు చెరువులో కబ్జా చేస్తున్నారని స్థానికులు ఫిర్యాదు చేశారు. దుండిగల్ మున్సిపాలిటీలోని మల్లంపేటలో హైరైజ్ పీవీఆర్ మెడోస్ వాళ్లు ఇతర కాలనీలకు వెళ్లే మార్గాలను మూసేశారని మల్లంపేట నివాసితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. పటాన్‌చెరువులో తిమ్మక్క చెరువుకు నీరందించే పెద్ద వాగును, 30మీటర్ల వెడల్పుగల వాగుకు తోడు ఇరువైపులా ఉండాల్సిన 9మీటర్ల బఫర్‌జోన్‌ను  ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ కబ్జా చేసిందని, స్థానికులు ఫిర్యాదు చేశారు. ఉప్పల్, ఫిర్జాదిగూడ మున్సిపాలిటీ పర్వతిపురిలో 3ఎకరాల స్మశానం భూమిని తమదంటూ పట్టాలు సృష్టించి కబ్జా చేస్తున్నారని ఫిర్యాదు అందింది.