calender_icon.png 19 April, 2025 | 6:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూ భారతితో భూ సమస్యల పరిష్కారం

16-04-2025 04:36:54 PM

కలెక్టర్ వెంకటేష్ దోత్రే..

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): భూ భారతి పోర్టల్ ద్వారా భూ సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే(District Collector Venkatesh Dhotre) అన్నారు. బుధవారం కలెక్టరేట్ లో ఎస్పీ డివి శ్రీనివాసరావు, అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, డేవిడ్ లతో కలిసి పలు అంశాలపై ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భూభారతి పోర్టల్ ద్వారా అనేక రకాల భూమి సమస్యల పరిష్కారానికి అవకాశం ఉందన్నారు. గతంలో సమస్యలు ఉంటే ఆపిల్ చేసుకునే అవకాశం ఉండేది కాదని ప్రస్తుతం అది అందుబాటులోకి వచ్చిందన్నారు. భూభారతిపై ప్రజలలో అవగాహన కల్పించేందుకు ఈనెల 30 వరకు సదస్సులు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

గతంలో భూమి సమస్యలు ఉంటే సివిల్ కోర్టు కు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేదన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పేద ప్రజలకు అందజేస్తున్న సన్న బియ్యం పంపిణీ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. బియ్యం పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. నకిలీ పత్తి విత్తనాలను అరికట్టేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు. రైతులు లూస్ విత్తనాలు కొనుగోలు చేయవద్దని కోరారు. నకిలీ సీడ్స్ అరి కట్టెందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని  త్వరలోనే డీలర్లు, సంబంధిత అధికారులతో సమీక్షించి క్షేత్రస్థాయిలో వాటి నివారణకు కృషి చేస్తామన్నారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరు కు సంబంధించి ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకోవడం జరిగిందన్నారు.

లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉంటుందని తెలిపారు. నియోజకవర్గానికి 35 వందల ఇండ్లు మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. ఇప్పటికే ప్రతి మండల కేంద్రంలో ఇందిరమ్మ మోడల్ ఇల్లు నిర్మాణం చేపట్టడం జరుగుతుందని వివరించారు. వేసవికాలం దుష్ట తాగునీటి సమస్య లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. గత ఏడాది తో పోలిస్తే ఈ ఏడాది సమస్య తగ్గిందన్నారు. తాగునీటి సమస్య ఉన్న ఆవాసలకు ప్రత్యేకంగా నీటి సరఫరాను చేయడం జరుగుతుందని తెలిపారు.

విద్యుత్ సమస్య లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఏజెన్సీ గ్రామాలలో ఐటీడీఏ ద్వారా సెంటెక్స్ ట్యాంకులను ఏర్పాటు చేసి నీరు అందించడం జరుగుతుందన్నారు. ఆర్డబ్ల్యూఎస్, మిషన్ భగీరథ ద్వారా నీటి సరఫరా కాని గ్రామాలకు ట్రాక్టర్ల ద్వారా ప్రజలకు నీరు అందించడం జరుగుతుందన్నారు. ఎండలు తీవ్రతరం అవుతుండడంతో భూగర్భ జలాలు అడుగంటుతున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. తాగునీటి సమస్య లేకుండా జిల్లాలో చర్యలు తీసుకునేందుకు సీఎం కోటి రూపాయల నిధులను కేటాయించారని వాటిని తాగునీటి వినియోగానికి ఖర్చు చేయడం జరుగుతుందని తెలిపారు.

ఎస్పీ మాట్లాడుతూ... జిల్లాలో నకిలీ పత్తి విత్తనాల రవణపై ప్రత్యేకంగా నిఘ పెట్టడం జరిగిందన్నారు. జిల్లాలో మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలు హుడికిలి, గూడెం, వెంకట్రావుపేట్, వాంకిడి ప్రాంతాలలో చెక్పోస్టులు ఏర్పాటు చేసి పర్యవేక్షించడం జరుగుతుందన్నారు. 12.75 లక్షల రూపాయల విలువచేసే 345 కేజీల నకిలీ పత్తి విత్తనాలను పట్టుకోవడం జరిగిందని తెలిపారు. అసాంఘిక కార్యక్రమాలు చేపట్టే వారిపై పిడి యాక్ట్ నమోదు చేయడం జరుగుతుందన్నారు. గతంలో నకిలీ విత్తనాలు సరఫరా చేసిన వారిపై నిఘా పెంచడం జరిగిందని తెలిపారు. నకిలీ పత్తి విత్తనాలు అమ్మినట్లుగా తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని వారి వివరాలను గోప్యంగా ఉంచడం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా పౌర సంబంధాల అధికారి వై.సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.