calender_icon.png 19 November, 2024 | 8:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

4 వారాల్లోగా తేల్చండి

10-09-2024 02:09:54 AM

విచారణ షెడ్యూల్ వెల్లడించండి

  1. ఫిరాయింపు పిటిషన్ ఫైళ్లు తక్షణం స్పీకర్ ముందుంచాలి
  2. స్పీకర్ కార్యాలయ కార్యదర్శికి ఉత్తర్వులు జారీ
  3. లేకుంటే పిటిషన్లపై సుమోటోగా విచారించి ఆదేశాలిస్తామని వెల్లడి
  4. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై హైకోర్టు తీర్పు

హైదరాబాద్, సెప్టెంబర్ 9 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై దాఖలు చేసిన అనర్హత పిటిషన్లపై నాలుగు వారాల్లో విచారణ షెడ్యూల్‌ను రూపొందించాలని హైకోర్టు సోమవారం 51 పేజీల తీర్పు వెల్లడించింది. పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన ఈ పిటిషన్లను తక్షణం స్పీకర్ ముందుంచాలని స్పీకర్ కార్యాలయ కార్యదర్శికి సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. అనర్హత పిటిషన్లపై ఇరుపక్షాలకు అవకాశం ఇచ్చి డాక్యుమెంట్ల సమర్పణ, ప్లీడింగ్, వాదనలు తదితరాలకు షెడ్యూలు నిర్ణయించి, దాన్ని హైకోర్టు జ్యుడిషియల్ రిజిస్ట్రార్‌కు సమర్పించాలని ఆదేశించింది. ఒకవేళ అలా చేయని పక్షంలో సుమోటోగా ఈ పిటిషన్‌లో తిరిగి ఆదేశాలు జారీచేయాల్సి ఉంటుందని వెల్లడించింది. పిటిషన్లపై విచార ణను మూసివేసింది.

బీఆర్‌ఎస్ తరఫున ఎన్నికై కాంగ్రెస్‌లో చేరిన కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావుపై అనర్హత వేటు వేయాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, కేపీ వివేకానందతోపాటు బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లపై సుదీర్ఘ వాదననలు విన్న జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి గత నెల 10న తీర్పు రిజర్వు చేసి సోమవారం వెల్లడించారు. రాజ్యాంగంలోని అధికరణ 226 ప్రకారం కోర్టు విచక్షణాధికారం విస్తృతమని, కోర్టు జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితుల్లో సాంకేతికత తదితర కారణాలతో పిటిషన్‌ను కొట్టివేయడం వల్ల న్యాయం చేసి నట్టు కాదన్నారు. ప్రతి రాజ్యాంగ వ్యవస్థ ప్రజాస్వామ్యం, రాజ్యాంగ ప్రమాణాలకు కట్టుబడి ఉండాలని పేర్కొన్నారు.

ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడం, నిష్క్రియాపరత్వంపై న్యాయసమీక్ష చేయడానికి ఎంతకాలం వేచి ఉండాలన్నది ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుందని పేర్కొన్నారు. అయిదేళ్లలో సభ గడువు ముగిసే దాకా వేచి ఉండాలని చెప్పజాలరని.. సభ కాలపరిమితి ముగిసేదాకా స్పీకర్ మౌనంగా ఉన్నా కోర్టులు మౌనంగానే ఉండాలా? అని ప్రశ్నించారు. ఒకవేళ ఇలా మౌనంగా ఉంటే ఈ చర్య రాజ్యాంగ ఆదేశాలకు, ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధమని అన్నారు.

స్పీకర్ రాజ్యాంగ హోదా, స్పీకర్ కార్యాలయం గౌరవ హోదాను దృష్టిలో ఉంచుకుని స్పీకర్ కార్యాలయానికి కోర్టు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. కేశం మెగాచంద్ర సింగ్ కేసులోని వాస్తవాలు ఈ కేసుకు వర్తించేలా ఉన్నాయని, అనర్హత పిటిషన్లపై స్పీకర్ స్పందించనపుడు నిర్ణయం తీసుకోవాల్సిందిగా స్పీకర్‌కు ఆదేశాలు జారీ చేయవచ్చా? లేదా? అన్నదే ఈ తీర్పు సారాంశమని, సహేతుకమైన సమయంలో నిర్ణయం తీసుకోవడం అన్న అంశం న్యాయ సమీక్షలకు లోబడి ఉంటుందని పేర్కొన్నారు. 

జాప్యం జరిగితే ప్రజాస్వామ్యానికి మచ్చ

పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. ఎమ్మెల్యేగా బీఆర్‌ఎస్ తరఫు న ఎన్నికైన దానం నాగేందర్ రాజీనామా చేయకుండానే మరోపార్టీ తరఫున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారని, అంతేగాకుండా మూడింట రెండొంతుల బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు తన వెంట వస్తారని ప్రకటించారని, అందువల్ల జాప్యం జరిగితే ప్రజాస్వామ్యానికి మోసం జరుగుతుందని, ప్రజలకు ప్రజాస్వామ్యంపై విశ్వాసం సన్నగిల్లుతుందని అన్నారు. ఈ సమయంలో కోర్టులు జోక్యం చేసుకోని పక్షంలో ప్రజాస్వామ్యానికి మచ్చ ఏర్పడుతుందన్నారు. అంతేగా కుండా ఇది గుర్రాల వ్యాపారంలా మారుతుందని ఆందోళన వ్యక్తంచేశారు.

అడ్వొకేట్ జనరల్ వాదనలు వినిపిస్తూ కోర్టులు స్పీకర్‌కు ఉత్తర్వులు ఇవ్వజాలవని అన్నారు. స్పీకర్ నిర్ణయం తీసుకునేదాకా వేచి చూడాలన్నారు. సంపత్‌కుమార్, కేశం మెగాచంద్ర సింగ్ కేసుల్లో సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం తీర్పు వెలువరించేదాకా ముందుకెళ్లరాదన్న ఏజీ వాదనలనతో విభేదించారు. అన్ని పక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి ప్రతి కేసులోనూ భిన్నమైన వాస్తవాలున్నాయని, ప్రత్యేక పరిస్థితులు ఎదురైన నేపథ్యంలో ఈ అంశాన్ని ఇలా వదిలివేయరాదన్నది ఈ కోర్టు అభిప్రాయమని పేర్కొన్నారు. ఈ కోర్టు పిటిషన్‌లో పిటిషనర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందిపైనే ఆధారపడి ఉంటుంది గానీ అసెంబ్లీ కాలపరిమితికా దని చెప్పారు.

ప్రత్యేక పరిస్థితుల్లో బాధితుల పక్షం నుంచి పరిశీలిస్తూ విషయం తీవ్రతను అర్థం చేసుకోవడానికి కోర్టు ప్రయత్నిస్తుందని స్పష్టంచేశారు. ఇక్కడ కేశం మెగాచంద్రసింగ్ కేసులో నిర్దిష్ట గడువులోగా అనర్హత పిటిషన్లపై తేల్చాలంటూ సుప్రీం తీర్పుతో ఈ కోర్టు విభేదించజాలదని తేల్చిచెప్పారు. కిహోటో హోలో హాన్ కేసును ప్రస్తావిస్తూ ఏజీతో సహా న్యాయవాదులు వాదనతో ఏకీభవిస్తే అసెంబ్లీ కాలపరి మితి ముగిసేదాకా స్పీకర్ నిర్ణయం తీసుకోవడానికి నిరాకరిస్తే పార్టీలకు మరో ప్రత్యామ్నా యం ఉండదని అన్నారు. ఏప్రిల్, జూలైల్లో పిటిషన్లు దాఖలై ఆగస్టులో వాదనలు ముగిశాయని, అయితే అనర్హత పిటిషన్లు ఏ దశలో ఉన్నాయో ఎలాంటి సమాచారం లేదన్నారు.

ఈ పరిస్థితుల్లో పిటిషనర్లు ఉపశమనానికి అర్హులేనని కోర్టు అబిప్రాయపడుతోందంటూ తేల్చారు. అందువల్ల అనర్హత పిటిషన్లపై స్పీకర్ విచారణ షెడ్యూల్‌ను నాలుగు వారాల్లో రూపొందించడానికిగాను అనర్హత పిటిషన్లను తక్షణం స్పీకర్ ముందుంచాలని స్పీకర్ కార్యదర్శికి ఆదేశాలు ఇస్తూ పిటిషన్లపై విచారణను ముగించారు. నాలుగు వారాల్లో షెడ్యూల్‌ను సమర్పించని పక్షంలో సుమోటోగా విచారణ చేపట్టాల్సి ఉంటుందని హెచ్చరించారు.