25-02-2025 11:30:00 PM
సీఎం రేవంత్‌కు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ లేఖ...
హైదరాబాద్ (విజయక్రాంతి): రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ మంగళవారం సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. గత పదేండ్లలో వివిధ కారణాలతో 500 మందికి పైగా జర్నలిస్టులు మృతి చెందారని, వారి కుటుంబాల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని లేఖలో పేర్కొన్నారు. ఈ ఏడాది జనవరిలో సంగారెడ్డిలో జరిగిన సీపీఎం రాష్ట్ర మహాసభల్లో జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా తీర్మానం చేశామన్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమైన అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఇండ్ల స్థలాలు, అక్రిడిటేషన్లు, హెల్త్ కార్డులు, మహిళా జర్నలిస్టులకు భద్రత, వేజ్‌బోర్డు ఏర్పాటు, జర్నలిస్టుల భద్రత కోసం ప్రత్యేక రక్షణ చట్టం, పెన్షన్ పథకం, మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ. 20 లక్షల ఎక్స్‌గ్రేషియా, జర్నలిస్ట్ బీమా సౌకర్యం కల్పించాలని కోరినట్లు వెల్లడించారు. మీడియాలో నెలకొన్న పరిస్థితులను సమగ్రంగా అధ్యయనం చేసేందుకు సీనియర్ ఉన్నతాధికారులు, మేధావులు, జర్నలిస్టులతో సంయుక్తంగా మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.