22-03-2025 04:48:16 PM
సిఐటియు నాయకులు రమేష్ గౌడ్ డిమాండ్...
మునిపల్లి: గ్రామపంచాయతీ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈనెల 25న చలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని సిఐటియు జిల్లా నాయకుడు రమేష్ గౌడ్ అన్నారు. శనివారం మునిపల్లి ఎంపీడీవో కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ చంద్రకళకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా నాయకుడు రమేష్ గౌడ్ మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ వర్కర్ల సమస్యల పరిష్కారం కోసం అనేకసార్లు అధికారులకు వినతి పత్రం ఇచ్చినా.. సమస్యలను పరిష్కరించకపోవడంతో చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపడుతున్నామని ఆయన తెలిపారు.
గ్రామపంచాయతీ వర్కర్లకు జీవో నెంబర్ 51 మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయాలని పాత కేటగిరి విధానాన్ని కొనసాగించాలని, వేతన బకాయిలను వెంటనే చెల్లించాలని, పంచాయతీ సిబ్బందిని రెండో పిఆర్సి పరిధిలోకి తీసుకురావాలని, కాంగ్రెస్ పార్టీ గ్రామపంచాయతీ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. డిమాండ్ల సాధన కోసం హైదరాబాదులోని ఇందిరాపార్కు వద్ద జరిగే మహాధర్నాలు గ్రామపంచాయతీ వర్కర్లంతా పాల్గొని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ వర్కర్ల యూనియన్ మండల కార్యదర్శి రవి, ఉపాధ్యక్షులు విటల్ గౌడ్, నాయకులు శ్రీనివాస్, దశరథ్, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.