దేశ రక్షణ కోసం ఎలాగైతే సైనికులు శ్రమిస్తారో అదే విధంగా రైలు పట్టాలను సురక్షితంగా కాపాడే ‘చాబీదార్స్’ (కీమ్యాన్‌లు) పాత్రకూడా ఎంతో విలువైంది. వీరు రోజుకు కనీసం ఎనిమిది గంటలు బాహ్య ప్రదేశాలలో, అదికూడా అననుకూల వాతావరణంలో సంక్లిష్ట పద్ధతిలో విధులు నిర్వహిస్తుంటారు. వీపుపై పట్టాలకు మరమ్మతు పరికరాలను మోయాల్సి ఉంటుంది. భోజనం, మంచినీళ్లనూ వెంట తీసుకెళతారు. దాదాపు పది కిలోల బరువుగల సంచితో వీరు గస్తీ నిర్వహిస్తారు. తమ వెంట ఎప్పుడూ రెండు ఎరుపు రంగుల జెండాలు, మరొక ఆకుపచ్చ జెండాను కలిగి ఉంటారు. రైల్వే ట్రాక్స్‌ను తనిఖీ చేస్తూ వాటి తీరుతెన్నులు, పరిస్థితులనుబట్టి రైళ్ల రాకపోకలను నియంత్రించ వలసి వస్తుంది కూడా.
పట్టాలకు అమర్చే ఎలాస్టిక్ రైల్ క్లిప్స్, లైనర్స్ ఫిష్ ప్లేట్స్ వదులుగా ఉండకుండా చూసుకోవడం వీరి విధి. లేకపోతే, రైలు పట్టాలు తప్పడం ఖాయం. అంతటి తీవ్ర ప్రమాదాలు జరక్కుండా కాపాడతారు కాబట్టే, వీరిని ‘రైల్వే సైనికులు’గా ప్రజలు వ్యవహరిస్తారు. పట్టాలు వదులు లేకుండా, గట్టిగా అమర్చడమే వీరి ప్రధాన విధి. పట్టాలకు సోకే ఇనుప చిలుమును తినడానికి వచ్చే విషసర్పాలు, పురుగు పుట్రా, కీటకాలు సంచరిస్తున్నా విధులను మాత్రం క్రమం తప్పక, భయపడక నిర్వహించాలి. ఎండలు, వానలు, చలి.. కాలం ఏదైనా జంకకుండా డ్యూటీ చేయాల్సి వుంటుంది. ఎక్కడైనా పట్టాలకు పగుళ్లు ఏర్పడినా, విరిగినా ప్రమాద సూచనలు కనిపించినా వెంటనే అప్రమత్తమవుతారు. ఎరుపురంగు జెండాలను రైలుకు ఎదురుగా పట్టాలమధ్యలో ఏర్పాటు చేసుకొని మరమ్మతులు నిర్వహిస్తారు. ఎగువ, దిగువ రైలు మార్గాలను మూడు గంటల చొప్పున పెట్రోలింగ్ చేస్తారు. పట్టాలు వదులైతే ఎప్పటి కప్పుడు లింకు బోల్ట్స్, తదితర పరికరాలతో గట్టిగా బిగిస్తుంటారు.
ఫలితంగా రైళ్లు సురక్షితంగా పట్టాలపై పరుగులు తీసి ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తాయి. ఈ రకమైన నిరంతర ప్రయాణ విధుల కారణంగా, కుటుంబసభ్యులతో గడపడం కష్టమవుతుందని వారు వాపోతున్నారు. ఎక్కువ దూరం కాలి నడకన పని చేయడం వల్ల శారీరక శ్రమ అధికమవుతున్నది. తమ (కీమ్యాన్‌ల) బీట్ నిడివిని తగ్గించాల్సిందిగా వారు కోరుతున్నారు. విధి నిర్వహణ దూరాన్ని 8 నుంచి 6 కి.మీ.కు తగ్గించాలని రైల్వే బోర్డుకు, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. కీమ్యాన్స్‌ది 6 గంటల నిరంతరాయ నడక, విశ్రాంత సమయం కూడా పట్టాల పక్కనే, మొత్తం 8 గంటల పని బహిరంగ ప్రదేశంలోనే సాగిస్తారు. రిటైరైన తర్వాత వయసు సహకరించక తీవ్ర అనారోగ్యం బారిన పడుతున్నారు. కనుక, పని గంటలను ఆరోగ్య ప్రమాణాలకు అనుగుణంగా నిర్ణయించాలని, వేతనాలను పెరుగుతున్న సామాజిక అవసరాలకు తగ్గట్టుగా పెంచాలనీ వారు కోరుతున్నారు.
దండంరాజు రాంచందర్ రావు, హైదరాబాద్