జాతీయ రహదారిపై గురుకుల విద్యార్థుల ఆందోళన
అబ్దుల్లాపూర్‌మెట్, నవంబర్ 1: తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ హైదరాబాద్ జాతీయ రహదారిపై బాటసింగారంలోని బీసీ గురుకుల విద్యార్థులు శుక్రవారం ఆందోళన చేపట్టారు. హాస్టల్‌లో నాణ్యమైన ఆహారం పెట్టడంలేదని.. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన ఎవరూ స్పందించడం లేదని, చదువు సరిగా చెప్పడంలేదని విద్యార్థులు నినాదాలు చేశారు.
హాస్టల్‌లో కనీస సదుపాయాల లేవని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆందోళనతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. విద్యార్థుల ఆందోళనపై స్పందించిన ప్రిన్సిపాల్ నారాయణరెడ్డి మాట్లాడుతూ..విద్యార్థుల ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. హాస్టల్‌లో నాణ్యమైన ఆహారంతో పాటు పరిశుభ్రమైన వాతావరణం కల్పిస్తున్నామని పేర్కొన్నారు.
అయితే విద్యార్థుల ఆందోళనపై సమాచారం తెలుసుకున్న ఆర్‌సీవో హాస్టల్ వద్దకు వెళ్లి తనిఖీలు చేసినట్లు సమాచారం. విద్యార్థుల ఆందోళనకు మద్దతు తెలిపిన ఎస్‌ఎఫ్‌ఐ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు గుడెం శివకుమార్ మాట్లాడుతూ.. గురుకుల హాస్టల్‌లో నాణ్యమైన భోజనంతో పాటు మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలన్నారు.