calender_icon.png 28 October, 2024 | 1:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మా సమస్యలు పరిష్కరించండి!

27-10-2024 12:00:00 AM

  1. డిప్యూటీ సీఎంతో తెలంగాణ ఉద్యోగ జేఏసీ నేతల భేటీ
  2. డీఏలు, పెండింగ్ బిల్లులు పరిష్కరించాలని విజ్ఞప్తి
  3. ఒక్కొక్కటిగా పరిష్కరిస్తాం, సమయమివ్వండి: డిప్యూటీ సీఎం భట్టి

హైదరాబాద్, అక్టోబర్ 26 (విజయక్రాం తి): డీఏలతోపాటు ఉద్యోగ, ఉపాధ్యాయ పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను తెలంగాణ ఉద్యోగ జేఏసీ నేతలు కోరారు. మొత్తం 5 పెండింగ్ డీఏలున్నాయని, వాటిలో రెండు డీఏలపై క్యాబినెట్ సమావేశంలో సానుకూల నిర్ణయం తీసుకోవాలని భట్టి విక్రమార్కను కోరారు.

తెలంగాణ ఉద్యోగు ల జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాస్‌రావు ఆధ్వర్యంలో పలువురు నేతలు డిప్యూటీ సీఎంతో శనివారం ప్రజాభవన్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డీఏలు, పెండింగ్ బిల్లులు, ఉద్యోగుల ఆర్థికేతర సమస్యలను భట్టి విక్రమార్క దృష్టికి వారు తీసుకెళ్లారు.

సమ స్యలపై డిప్యూటీ సీఎం స్పందిస్తూ రాష్ట్ర ఉద్యోగులకు ప్రభుత్వం అండగా ఉంటుంద ని.. డీఏలు, ఇతర సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కారం చేస్తామని తెలిపారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలు వినడానికి, చర్చించడానికి సీఎం రేవంత్ రెడ్డితోపాటు, మిగతా మంత్రులందరూ ఎప్పటికీ ఉద్యోగులకు అందుబాటులో ఉంటారన్నారు.

కుల గణన విషయంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు సహకరించి త్వరితగతిన పనులు పూర్తి చేయాలని కోరారు. పెండింగ్ బిల్లుల సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని జేఏసీ నేతలతో హామీ ఇచ్చినట్లు తెలిసింది. కాగా డీఏల విడుదలతో ప్రభుత్వంపై ఎంత భారం పడుతుందో ఆర్థికశాఖను డిప్యూటీ సీఎం వివరాలు అడిగినట్లు తెలిసింది.

డీఏలు విడుదల చేసేందుకు నెలకు రూ.229 కోట్లు, ఏడాదికి రూ.2 వేల 7 వందల 49 కోట్లు భారం పడుతుందని వివరించినట్లు తెలిసిం ది. డిప్యూటీ సీఎంను కలిసిన వారిలో జేఏసీ డిప్యూటీ సెక్రటరీ జనరల్ ఎస్‌ఎం హుస్సేని ముజీబ్, ఏ సత్యనారాయణ, కో చైర్మన్ జీ జ్ఞానేశ్వర్, నేతలు దేవరకొండ సైదులు, టీఆర్టీఎఫ్ అధ్యక్షుడు కటకం రమేశ్, జేఏసీ నాయకులు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.