పెండింగ్ సమస్యలు తీర్చేందుకు అధికారాల వికేంద్రీకరణ.. ఆదేశాలు జారీ
హైదరాబాద్, నవంబర్ 28 (విజయక్రాంతి): రాష్ర్టవ్యాప్తంగా ధరణిపై వచ్చిన దరఖాస్తులు సుమారు లక్షకు పైగా పెండింగ్‌లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ధరణి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కీలక అడుగువేసింది. పెండింగ్ దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకు ప్రభు త్వం అధికారాలను వికేంద్రీకరిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.
ఆర్డీవో, అదనపు కలెక్టర్లు(రెవెన్యూ)కు మరిన్ని బాధ్యతలను, అధికారాలను కట్టబెట్టారు. ధరణి కమిటీ సిఫారసుల మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సీసీఎల్‌ఏ నవీన్ మిట్టల్ సర్క్యులర్ జారీచేశారు. మూడు రోజుల క్రితమే అధికారులకు ఆప్షన్లు ఇచ్చారు.
అయితే ఎలాంటి సర్క్యులర్ లేకుండానే అధికారాలను బదలాయించారంటూ పలువురు ప్రశ్నించడంతో 26వ తేదీన జారీచేసినట్లుగా సర్క్యులర్‌ని ఇచ్చారు. గతంలోనూ ప్రతి దరఖాస్తును ఎన్ని రోజుల్లో పరిష్కరించాలో స్పష్టం చేసినప్పటికీ అమలుకు నోచుకోవడం లేదు.
నెలలు, ఏండ్ల తరబడి దరఖాస్తుదారులను ఆఫీసుల చుట్టూ తిప్పించుకుంటూనే ఉన్నారు. దరఖాస్తు చేసుకుని చాలా కాలమైందని, తిరిగి దరఖాస్తు చేసుకోమని చెప్పడం పరిపాటైంది. మరోవైపు ధరణి కోసం పెద్దఎత్తున డబ్బులు ప్రభుత్వానికి చెల్లించి స్లాట్ బుక్ చేసుకున్న వారు అధికారుల తీరుతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.
ఇవీ అదనపు బాధ్యతలు
ఆర్డీవో స్థాయి:
* టీఎం 4- అసైన్డ్ భూముల విరాసత్. పాసు బుక్ లేనప్పుడు
* టీఎం 27- పెండింగ్ నాలా అప్లికేషన్లు
* టీఎం 33- డిజిటల్ సంతకం
* జీఎల్‌ఎం- డిజిటల్ సిగ్నేచర్
అదనపు కలెక్టర్ స్థాయిలో..
* టీఎం 3- మ్యుటేషన్ దరఖాస్తులు
* టీఎం 24- కోర్టు కేసుల ద్వారా పట్టాదారు పాసు పుస్తకాల జారీ
* టీఎం 31- పాసు పుస్తకాల జారీ. ఇల్లు, ఇంటి స్థలం అని ఉన్నచోట నాలా కన్వర్షన్ చేయడం
* టీఎం 33- పాసు బుక్ తప్పొప్పుల సవరణ. పేరు తప్పు పడినా సవరించడం
* ఆర్డీవోకు పంపే అప్లికేషన్లను తహశీల్దార్లు క్షుణ్ణంగాపరిశీలించాలి. ఆర్డీవో కూడా పరిశీలించిన అనంతరం అదనపు కలెక్టర్‌కు అప్‌లోడ్ చేయాలి. వీరిద్దరి సిఫారసుల మేరకు అదనపు కలెక్టర్ అప్రూవ్ లేదా రిజెక్ట్ చేయాలి. తిరస్కరిస్తే అందుకు సరైన కారణాలు వెల్లడించాలి. అప్లికేషన్ల పరిష్కారానికి గడువు ఈ ఏడాది ఫిబ్రవరి 28న జారీచేసిన సర్క్యులర్ ప్రకారంగా గడువు ఉండనుంది.