03-05-2024 01:04:01 AM
ఇన్‌సర్వీస్ టీచర్లకు మినహాయింపునివ్వాలి
ఎన్‌సీటీఈకి పీఆర్టీయూ నేతల వినతి
టెట్ షెడ్యూల్ మార్చాలని ప్రభుత్వానికి ఈసీ ఆదేశం
హైదరాబాద్, మే 2 (విజయక్రాంతి): ఉపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియకు అడ్డంకిగా మారిన టెట్ (ఉపాధ్యాయ అర్హత పరీక్ష) అర్హత సమస్యకు త్వరలోనే పరిష్కారం లభించనుందని ఎమ్మెల్సీ కూర రఘోత్తమ్‌రెడ్డి, పీఆర్టీయూ టీఎస్ అధ్యక్ష, కార్యదర్శులు పింగలి శ్రీపాల్‌రెడ్డి, బీరెల్లి కమలాకర్‌రావు తెలిపారు. టెట్ నుండి ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాలని ఢిల్లీలోని నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ మెంబర్ సెక్రటరీ కేసంగ్ వైషెర్పను గురువారం కలిసి ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలు అంశాలను ఆమె దృష్టికి తీసుకెళ్లారు. ఎస్జీటీ (సెకండరీ గ్రేడ్ టీచర్) నుంచి పీఎస్‌హెచ్‌ఎం, స్కూల్ అసిస్టెంట్ నుంచి జీహెచ్‌ఎంగా పదోన్నతి పొందేందుకు టెట్ ఉత్తీర్ణత అవసరం లేదని వారు పేర్కొన్నారు. ఎస్జీటీ నుంచి స్కూల్ అసిస్టెంట్‌గా పదోన్నతి పొందేందుకు టెట్ ఉత్తీర్ణత తప్పనిసరన్నారు. అయితే తెలంగాణ ప్రభుత్వం టీచర్లకు టెట్ నిర్వహించనందున టీచర్లకు పదోన్నతి కల్పిస్తూ టెట్ అర్హత పొందేందుకు 5 ఏళ్ల కాలపరిమితి ఇచ్చేలా తెలంగాణకు ఆదేశాలు జారీచేయాలని కోరడంతో దీనికి ఆమె స్పందిస్తూ త్వరలోనే తగు సూచనలు జారీ చేస్తామని కేసంగ్ హామీ ఇచ్చినట్లు పీఆర్టీయూ నేతలు తెలిపారు.
టెట్ షెడ్యూల్ మార్చండి..
వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక జరగనున్న నేపథ్యంలో టెట్ తేదీలను మార్చాలని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శికి ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధక్షుడు రావుల రామ్మోహన్‌రెడ్డితోపాటు తాండూర్‌కు చెందిన మరో అభ్యర్ధి డీ హరీశ్ టెట్ షెడ్యూల్ మార్చాలంటూ ఈసీకి ఈ నెల 29న వినతిపత్రాలు అందజేశారు. మే 27న పోలింగ్ రోజే టెట్ పరీక్ష ఉందని, అందువల్ల వాయిదా వేయాలని కోరారు. దీనిపై స్పందించిన ఈసీ ఈ మేరకు విద్యాశాఖను ఆదేశించింది. అభ్యర్థుల విజ్ఞప్తులకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.