calender_icon.png 11 January, 2025 | 4:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏకాంతం

15-07-2024 12:00:00 AM

కోరినప్పుడు వలచి వచ్చే ఏకాంతం

మట్టిలో దొరికిన అద్భుత వజ్రం, సంజీవని

ప్రశాంతతను అరిటాకులో వడ్డించే పరమాన్నం

సముద్రం పక్కన ఉన్నా అలల హోరు వినిపించని

కట్టిన ఇసుక గూడు కొట్టుకుపోతున్నా పట్టించుకోని

ప్రత్యేక ప్రపంచంలో సంచరించడం

ధ్యానంలో చక్కని విశ్రాంతిని అనుభవించినట్లు

ఏకాంతానికి అటూ ఇటూ ఎన్నో ఉంటాయి

ఊరిస్తాయి, లాలిస్తాయి, బెదిరిస్తాయి

హద్దుల్లో బందీ చేయడానికి యత్నిస్తాయి

వాటిని హద్దుల్లో ఉంచి కాపలాగా మారుస్తే

కొద్ది సమయంలో మోతాదు మించిన ఆనందం

మనసు చెవిలో జీవిలి తీసే అంతరాత్మ మాటలు

ఎవరిని వారు పుటం పెట్టుకోవడానికి పనికొస్తాయి

జనంలో మనం మంచిదే

వంట బాగుందని కక్కుర్తి పడి తినలేం

శబ్ద ప్రపంచం చెవులను చిల్లులు పెట్టకముందే

మనిషిని అల్లకల్లోలం చేయకముందే

సరైన విశ్రాంతినివ్వాలి సర్వస్వంగా భావించాలి

గాఢ నిద్రలో ఎవరిని ఎవరూ పట్టించుకోనట్లు

చివరి అంచుల్లోకి తీసుకెళ్లాలి ఏకాంతాన్ని

అది మనమేమిటో మనకు తెలియజేస్తది

ఏకాంతంలో నన్ను నేను అద్దంలో చూసుకుంటా

అప్పుడప్పుడు నగ్నంగా కూడా

శరీరంపై ముడతలు, మచ్చలు 

తెలియజేస్తాయి నేనేమిటో

నచ్చని ఏడుపు ముఖాన్ని వదిలేసి నవ్వుతా

ఏకాంతం అవ్వల్ దర్జాగా అనుభవిస్తేనే

మనల్ని మనం నిరూపించుకోవడానికి అవకాశం

ఈ కవిత రాయడానికి

కలాన్ని అందించింది ఏకాంతమే.

కొమురవెల్లి అంజయ్య

సెల్: 9848005676