భద్రాద్రి కొత్తగూడెం,(విజయశాంతి): గిరిజన గ్రామాలలో గిరిజన రైతుల సౌకర్యార్థం పీఎం కుసుమ్ పథకాన్ని స్వయం సహాయక సంఘాల మహిళలను భాగస్వామ్యం చేస్తూ, ప్రభుత్వం సోలార్ విద్యుత్ యూనిట్లను నెలకొల్పడానికి పంట పొలాలను గుర్తించి, వారికి ఆర్థికంగా వెసులుబాటు కల్పించాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ అన్నారు. గురువారం ఐటిడిఏ సమావేశం మందిరంలో ఫారెస్ట్, కరెంట్, వ్యవసాయ, రెవెన్యూ అధికారులు,ఐకెపి సిబ్బంది సమన్వయంగా సబ్ స్టేషన్ కు మూడు కిలోమీటర్ల పరిధిలో ఉన్న, పోడు భూములకు సంబంధించిన గిరిజన రైతుల భూములను గుర్తించి సోలార్ విద్యుత్ యూనిట్ల కోసం సర్వే చేసి ప్రతిపాదనలు అందజేయాలని ఆయన పది కోరను ఆదేశించారు.
ఏజెన్సీ ఏరియా పరిధిలోని ఇందిరా మహిళా శక్తి పథకం కింద స్వయం సహాయక మహిళా గ్రూపులకు సోలార్ విద్యుత్ యూనిట్లను అనువైన ప్రదేశాలలో మెగా వాట్ విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి మహిళలకు 90% బ్యాంకు రుణం లభిస్తుందని, 10 శాతం లబ్ధిదారుల వాటా ఉంటుందన్నారు. మెగా వాట్ ప్లాంట్ నుంచి ఏడాదికి సగటున 15 లక్షల యూనిట్లు విద్యుత్ ఉత్పత్తి అవుతుందని, సంవత్సరానికి 45 లక్షల రూపాయలు ఆదాయం వస్తుందన్నారు. ప్లాంట్ నిర్వహణ బ్యాంకు రుణం వడ్డీలు కలిపి సుమారు రూ 20 లక్షలు ఖర్చులు పోను ,రూ25 లక్షలు మిగులుతాయని ఆయన అన్నారు. ఈ మెగా విద్యుత్ ప్లాంట్ల వలన పర్యావరణ పరిరక్షణతో పాటు గిరిజన గ్రామాలలో విద్యుత్ సౌకర్యం గిరిజన రైతుల పంట పొలాలకు సరిపడా విద్యుత్ అందించి రెండు పంటలు పండించడానికి దోహదపడవచ్చని అన్నారు.
సంబంధిత అధికారులు మీ పరిధిలోని గిరిజన గ్రామాలలో పోడు పట్టాలు అందించిన గిరిజన రైతుల కుటుంబాలలోని మహిళా సభ్యులు స్వయం సహాయక బృందాలలో గనక ఉంటే కనీసం నాలుగు ఎకరాల పొలం ఉంటే తప్పనిసరిగా మెగా సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు కృషి చేయాలని అన్నారు. మహిళా సభ్యులకు సొంత పొలాలు ఉండాలని ఫారెస్ట్ వివాదాలు ఉన్న పొలాల జోలికి వెళ్లొద్దన్నారు. అవసరమైతే సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు అనువైన భూమిని లీజుకు అయిన తీసుకొని ఏర్పాటు చేయాలని అన్నారు. సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు వల్ల ఆ గ్రామాలలోని నిరుద్యోగులైన యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించవచ్చన్నారు. మారుమూల గిరిజన గ్రామాలలో విద్యుత్ సౌకర్యం కల్పించడానికి ఈ మెగా విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు ఎంతో ప్రాముఖ్యమని దీని వలన ఫారెస్ట్ వారికి ఎటువంటి అడ్డంకులు ఉండవని అన్నారు.
అలాగే కొన్ని గిరిజన గ్రామాలలోని ముఖ్యంగా దమ్మపేట మండలంలోని గండుగులపల్లి గ్రామంలో కొండ రెడ్ల గిరిజనులకు పౌడర్ పట్టాలు అందడం లేదని దరఖాస్తులు వస్తున్నాయని, 2005 ముందు ఉన్న వారిని గుర్తించి వారికి పౌడర్ పట్టాలు అందించడానికి ఫారెస్ట్ అధికారులు సహకరించాలని అన్నారు. శుక్రవారం నాడు ఎఫ్ ఆర్ ఓ లు మీ దగ్గరలో ఉన్న సబ్ స్టేషన్ల దగ్గర బీట్ ఆఫీసర్లను పంపించి మారుమూల గిరిజన గ్రామాలలో పోడుకు సంబంధించిన గ్రామాల యొక్క వివరాలు సేకరించి ఆ గ్రామాలలో కరెంట్ సౌకర్యం కల్పించే విధంగా వెసులుబాటు కల్పించాలని అందుకు సంబంధించిన ప్రతిపాదనలు సేకరించాలన్నారు.