- మందమర్రిలో పైలట్ ప్రాజెక్టుగా ఒక మెగావాట్ ప్లాంట్
- ఏడాదికి రూ.1.6 కోట్ల విలువైన సోలార్ ఎనర్జీ సద్వినియోగం
- ప్రయోగం సఫలమైతే మరో 2 మెగావాట్ల స్టోరేజ్ ప్లాంట్లు
- ప్లాంట్‌తో ఇప్పటికే నెలకు రూ.4 కోట్లు ఆదా
హైదరాబాద్, నవంబర్ 26 (విజయక్రాంతి): సౌర విద్యుత్తు విషయంలో సింగరే ణి సంస్థ వినూత్నమైన దిశగా అడుగులు వేసింది. పగటి పూట ఉత్పత్తయ్యే సౌర విద్యుత్తును వినియోగించిన తరువాత.. మిగిలే విద్యుత్తు వృథాగా పోనీయకుండా బ్యాటరీలలో నిలువచేసే కొత్త ప్రయోగాన్ని చేపట్టింది. సంబంధిత వివరాలను సింగరేణి సీఎండీ ఎన్ బలరామ్ వెల్లడించారు.
సింగరేణి తన గనులకు కావాల్సిన విద్యుత్తు అవ సరాల కోసం 28 మెగావాట్ల సౌర విద్యుత్తు ప్లాంట్‌ను మందమర్రిలో 2021లో ఏర్పా టు చేసిందని, సొంత అవసరాలకోసం ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్‌ను ‘ఇన్‌హౌజ్ క్యాప్టివ్ ప్లాంట్’ అని తెలిపారు. ఈ ప్లాంట్ ద్వారా ఉత్పత్తయ్యే విద్యుత్తును మందమర్రి, శ్రీరాంపూర్ ఏరియాల్లో ఉన్న మొత్తం 11 భూగర్భ గనులు, 4 ఓపెన్ కాస్ట్ గనులతోపాటు ఇతర పారిశ్రామిక అవసరాలకు వినియోగిస్తున్నారు.
ఈ 28 మెగావాట్ల సౌర విద్యుత్తు ప్లాంట్ ద్వారా సగటున రోజుకు ఒక లక్షా 34 వేల యూనిట్ల విద్యుదుత్పత్తి అవుతుంది. ఇందు లో ఒక లక్షా 14 వేల యూనిట్ల విద్యుత్తును సంస్థ వినియోగించుకుంటుంది. మధ్యా హ్నం కార్మికులకు భోజన విరామ సమ యం ఉండటం.. అలాగే యంత్రాలు కూడా విశ్రాంతిలో ఉండటంతో.. రోజూ 20 వేల యూనిట్ల విద్యుత్తు వినియోగించలేకపోతున్నది.
ఫలితంగా ఈ విద్యుత్తును స్థానిక సబ్ స్టేషన్ ద్వారా తెలంగాణ ఉత్తర విద్యుత్తు పంపిణీ సంస్థ (ఎన్‌పీడీసీఎల్)కు ఉచితంగా అందించాల్సి వస్తోంది. ఇన్‌హౌజ్ క్యాప్టివ్ పవర్ ప్లాంట్ ద్వారా ఈ మిగులు విద్యుత్తు రాష్ట్ర విద్యుత్తు శాఖ లైన్లలో కలుస్తుంది. కనుక దీనికి డిస్కంకూడా ఎటువంటి ఛార్జీలు చెల్లించకుండా ఉచిత విద్యుత్తుగా పరిగణిస్తూ వాడుకుంటున్నది.
ఆ 20 వేల యూనిట్ల సౌర విద్యుత్‌ను సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో సింగరేణి సౌర విద్యుత్తును నిలువ చేసి, అవసరం ఉన్నప్పుడు వినియోగించేలా బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టం (బీఈఎస్‌ఎస్) వినూత్న ప్రయోగానికి ఇక్కడే శ్రీకారం చుట్టింది. ఈ వ్యవస్థ ఏర్పాటు కోసం అనుభవం ఉన్న కంపెనీలను ఆహ్వానించారు. వీటిలో కాన్పూర్‌కు చెందిన మెస్సర్స్ మార్స్ ఇండియా యాంటేనాస్ అండ్ ఆర్‌ఎఫ్ సిస్టమ్స్ అనే ప్రైవేటు కంపెనీకి పైలట్ ప్రాజెక్టుగా ఒక మెగావాట్ సామర్థ్యంగల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ఏర్పాటు పనిని అప్పగించారు.
బీఈఎస్‌ఎస్‌కు రూ.2.5 కోట్లు
ఒక మెగావాటల్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టం (బీఈఎస్‌ఎస్)కు దాదాపు రూ. 2.5 కోట్లు ఖర్చు అవుతుండగా.. 3 మెగావాట్ల ప్లాంట్‌కు వ్యయం రూ. 7.5 కోట్లు అవుతుందని అంచనా వేశారు. ఇందులో నిల్వ ఉంచే విద్యుత్తును రాత్రిపూట సంస్థ అవసరాలమేరకు సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఈ ఖర్చు రెండు సంవత్సరాల్లోపే తీరనున్నది.
నెలకు రూ. 4 కోట్లు ఆదా..
మందమర్రి ఏరియాలో సింగరేణి సంస్థ సౌర విద్యుత్తు ప్లాంట్ ఏర్పాటు చేయకముందు.. శ్రీరాంపూర్, మందమర్రి ఏరియాల్లోని 15 గనుల అవసరాలకోసం నెలకు రూ.13 కోట్ల విలువైన విద్యుత్‌ను కొనుగోలు చేసేది. 2021 ఏప్రిల్ 17న మందమర్రి ఏరియాలో 28 మెగావాట్ల సౌర విద్యుత్తు ప్లాంట్‌ను ఏర్పాటు చేసిన తరువాత నెలకు కేవలం రూ.9 కోట్ల కరెంటు బిల్లు మాత్రమే చెల్లిస్తోంది.
సౌర విద్యుత్తు ప్లాంట్ వల్ల నెలకు రూ.4 కోట్ల వరకు విద్యుత్తు బిల్లును సింగరేణి ఆదా చేసింది. ఇప్పుడు బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్‌తో మరో రూ.4.8 కోట్లు ఆదా అయినట్టే.
రోజుకు రూ.13 లక్షల
విద్యుత్తు సద్వినియోగం
మందమర్రి ఏరియాలో ఏర్పాటు చేసిన 28 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాం ట్‌లోనే ఈ కొత్త ప్రయోగాన్ని చేపడుతున్నారు. ఒక మెగావాట్ నిలువ సామ ర్థ్యం ఉన్న బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ పద్ధతి వల్ల నెలకు రూ.13 లక్షల (ఏడాదికి రూ. 1.6 కోట్లు) విలువైన సౌర విద్యుత్ సద్వినియోగం అవుతుంది. పైలట్ ప్రాజెక్టు విజయవంతమైతే.. మరో 2 మెగావాట్ల సామర్థ్యంతో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ వ్యవస్థను కూడా ఇక్కడే ఏర్పాటు చేయనున్నారు.
దీనివల్ల నెలకు రూ.40 లక్షలు (ఏడాదికి రూ.4.8 కోట్లు) విలువైన సౌర విద్యుత్ సద్వినియోగం చేసుకోవచ్చని సీఎండీ బలరామ్ వెల్లడించారు. ఇది ఏర్పాటైతే మధ్యాహ్నం ఉత్పత్తి అవుతున్న సౌర విద్యుత్తులో ఒక మెగావాట్ సామర్థ్యం ఉన్న విద్యుత్తును బ్యటరీ ఎనర్జీ సిస్టంలో నిలువ ఉంచి.. రాత్రివేళ సింగరేణి అవసరాలకు వినియోగించుకోవచ్చు. ఈ విధంగా నెలకు రూ.1.3 లక్షల విలువైన సోలార్ విద్యుత్తును సద్వినియోగం చేసుకోవచ్చు.