- రెండు మెగావాట్ల వరకు ఉత్పత్తికి అనుమతులు
- ఉత్పత్తయిన విద్యుత్‌ను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది
- డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
హైదరాబాద్, డిసెంబర్ 24 (విజయక్రాంతి): రాష్ర్టంలో ప్రధానమంత్రి కుసుమ్ కాంపోనెంట్ పథకం ద్వారా రైతుల పొలాల్లో సోలార్ విద్యుదుత్పత్తికి ఆదేశాలు జారీచేసినట్టు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఈ మేరకు మంగళవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో భట్టి పలు విషయాలను వెల్లడించారు.
పీఎం ద్వారా రైతుల పొలాల్లో సోలార్ విద్యుత్తును ఉత్పత్తి చేసి, వారికి అదనపు ఆదాయ మార్గాలను సృష్టించడాన్ని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. దీని కింద 0.5 మెగావాట్ల నుంచి రెండు మెగావాట్ల వరకు సామర్థ్యం గల సోలార్ విద్యుత్ ప్లాంట్లను బీడు భూముల్లో ఏర్పాటు చేయనున్నట్టు వివరించారు.
ఈ విధంగా కాలుష్య రహిత విద్యుత్‌ను ఉత్పత్తి చేయడంతోపాటు రైతులకు అదనపు ఆదాయాన్ని సమకూర్చే ప్రయత్నం చేస్తున్నట్టు వివరించారు. రైతులు తమ భూమిని సోలార్ విద్యుత్ ప్లాంట్ అభివృద్ధి కోసం డెవలపర్లకు లీజుకు ఇచ్చే అవకాశం ఉందని, అలాంటి భూమి యజమానికి, డెవలపర్లకు మధ్య డిస్కమ్‌ల ద్వారా ఒప్పందం మేరకు లీజు మొత్తం అందిస్తామని తెలిపారు.
రైతులు, రైతుబృందాలు, సహకార సంఘాలు, పంచాయతీలు, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజర్లు, వాటర్ యూజర్ అసోసియేషన్లు సైతం ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.
ఈ పథకం కోసం దరఖాస్తులను టీజీరెడ్కో ద్వారా ఆన్‌లైన్‌లో సమర్పించాలని, లిస్టులో పేర్కొన్న సమీప సబ్ స్టేషన్ ను ఎంపిక చేసుకుని అక్కడ సోలార్ విద్యుత్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపారు. డిస్కం ఉత్పత్తి చేసిన సోలార్ విద్యుత్తును రూ.3.13/కిలో వాట్ గంట ధర వద్ద 25 ఏళ్లపాటు కొనుగోలు చేస్తుందని తెలిపారు.