11-12-2024 12:53:59 AM
* ఎన్ని ఇబ్బందులొచ్చినా ప్రజావాణిని కొనసాగిస్తాం
* ప్రజాభవన్ ప్రెస్‌మీట్‌లో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క
హైదరాబాద్, డిసెంబర్ 10( విజయక్రాంతి): పట్టాలున్న పోడు రైతులు సజావుగా సాగు చేసుకునేందు సోలార్ పవర్ అందేలా చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. ఈమేరకు అవసరమైన చర్యలు చేపట్టాలని గిరిజన సంక్షేమ శాఖను ఆదేశించారు. హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ప్రజావాణిని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్‌ఎస్ సర్కార్ అటవీ హక్కుల చట్టాన్ని నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. పోడు రైతుల సమస్యలను ఏమాత్రం పట్టించుకోలేదన్నారు.
వారి పాలనలో రాష్ట్రం 70 సంవత్సరాలు వెనక్కి వెళ్లిందని అభిప్రాయపడ్డారు. దేశప్రజలకు నిజమైన ప్రజాస్వా మ్య పాలన అందించాలని ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ కోరుకుంటున్నారని, ఆయ న ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రంలో పాలన సాగిస్తున్నామని తెలిపారు. ఇందిరమ్మ రాజ్యం వస్తే తప్ప తమ ఆకాంక్షలు నెరవేరవని భావించిన ప్రజలు కాంగ్రెస్‌కు అధికారం కట్టబెట్టారని, వారికి మెరుగైన సేవలందించడమే తమ ధ్యేయమన్నారు. అనంతరం డిప్యూటీ సీఎం ప్రజావాణి ద్వారా లబ్ధిపొందిన వారితో స్వయంగా మాట్లాడారు. సమావేశంలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ప్రజాపాలన ప్రత్యేక అధికారి దివ్య పాల్గొన్నారు.