29-04-2025 12:00:00 AM
సంగారెడ్డి, ఏప్రిల్ 28(విజయక్రాంతి) : పర్యావరణ కాలుష్యానికి కారణమయ్యే కర్భన ఉద్గారాలను తగ్గిస్తూ..రైతుల ఆదాయాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యే క చర్యలు తీసుకుంటుంది. దీంట్లో భాగంగా ప్రధానమంత్రి కిసాన్ ఉర్జా సురక్షా ఏవం ఉత్థాన్ మహాభియాన్ (పీఎం కుసుమ్) పథకం అమలుకు శ్రీకారం చుట్టింది.
ఈ పథకం కింద సంగారెడ్డి జిల్లాలో ప్రస్తుతం ఉన్న విద్యుత్ సబ్ స్టేషన్ల పరిధిలోని వ్యవసాయ భూముల్లో సోలార్ ప్లాంట్ల ఏర్పా టుకు తెలంగాణ రెడ్కో సంస్థ ద్వారా దరఖాస్తులు ఆహ్వానించింది. అర్హులైన రైతులు 500 కిలోవాట్ల నుంచి 1 మెగావాట్ విద్యు త్ ఉత్పత్తికి సంబంధించి ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ (ఈఎండీ) రూ.లక్ష చొప్పున చెల్లించాల్సి ఉంది. ఈఎండీ చెల్లించేందుకు ఈనెల 30 వరకు మాత్రమే గడువు ఉంది.
జిల్లాలో 110 మంది దరఖాస్తు...
సౌర విద్యుత్ ఉత్పత్తి యూనిట్ల ఏర్పాటు కు సంగారెడ్డి జిల్లా నుంచి 110 మంది రైతు లు ఆర్జీలు పెట్టుకున్నారు. వారిలో ఇప్పటికే 33 మంది రైతులు ఈఎండీ చెల్లించారు. వీరికి టీజీ రెడ్కో అధికారులు 33 మందికి లెటర్ ఆఫ్ అవార్డు (ఎల్‌ఓ) అందజేశారు.
దీర్ఘకాలిక ఆదాయ వనరు..
వ్యవసాయ, వ్యవసాయేతర భూముల్లో 500 కిలోవాట్ల నుంచి 2 మెగావాట్ల సామర్థ్యం గల సోలార్ ప్లాంట్లను రైతులు ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ ప్లాంట్ల నుంచి ఉత్పత్తి అయ్యే ఒక్కో యూనిట్ విద్యుత్ను రూ.3.15 చొప్పున విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లకు విక్రయించడం ద్వారా వారు స్థిరమైన ఆదాయాన్ని పొందవచ్చు.
డిస్కంలతో ఒప్పందం 25 ఏళ్ళ పాటు కొనసాగుతుండడంతో ఇది దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వాన్ని అందించనుంది. రైతులు సాగు యోగ్యంకాని భూముల్లో సౌర ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఆయా భూములు ఆదాయ వనరులుగా మారుతాయి. ఇది గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి మరింత దోహదపడుతుందని అధికారులు అంటున్నారు.
సబ్స్టేషన్కు ఐదు కిలోమీటర్ల దూరం..
వ్యక్తిగత యూనిట్లకు దరఖాస్తు చేసుకున్న రైతుల భూములను ఇప్పటికే టీజీ రెడ్కో అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. విద్యుత్ ఉప కేంద్రానికి 5 కిలోమీటర్లలోపు దూరం కలిగిన భూములకు సంబంధించిన దరఖాస్తులకు ఆమోదం లభించనుంది.
మూడున్నర ఎకరాల పట్టా భూమి లేదా పోడు భూమి కలిగిన రైతులను అధికారులు అర్హులుగా గుర్తిస్తున్నారు. సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు అనుకూలతలు కలిగి, నిబంధనల ప్రకారం ఉన్న స్థలాలకు సంబంధించిన ఆర్జీలకు అధికారులు ఈనెల 30 వరకు ఈఎండీ చెల్లించే అవకాశం కల్పించారు. ఈ నేపథ్యంలో దరఖాస్తుదారుల సంఖ్య పెరగవచ్చని చెబుతున్నారు.
సద్వినియోగం చేసుకోవాలి...
వ్యవసాయ, వ్యవసాయేతర భూముల్లో సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు ఆసక్తిగల రైతులు ముందుకు రావాలి. నిబంధనల ప్రకారం ఈఎండీ చెల్లించిన దరఖాస్తుదారులు డిస్కంలతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం (పీపీఏ) చేసుకోవాల్సి ఉంటుంది. రైతుల అభీష్టం మేరకు ప్లాంట్లు నెలకొల్పేలా సన్నాహాలు చేస్తున్నాం. మొత్తం ప్రాజెక్టు విలువ రూ.4 కోట్లు ఉంటుందని, అందులో రూ.2 కోట్లు బ్యాంకులు కూడా రుణాలు అందిస్తాయి. అవగాహన లేకపోవడం వల్ల రైతులు ముందుకురావడంలేదు.
శ్రీనివాసరావు, మేనేజర్,
టీజీ రెడ్కో, సంగారెడ్డి