calender_icon.png 20 January, 2025 | 10:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆలయ భూముల్లో సోలార్‌ప్లాంట్

03-07-2024 12:27:18 AM

బోనాలకు నిధులు విడుదల చేయండి

అధికారులకు మంత్రి కొండా సురేఖ ఆదేశం

హైదరాబాద్, జూలై 2 (విజయక్రాంతి): దేవాదాయ భూముల పరిరక్షణ, దేవాదాయ శాఖకు ఆదాయమే లక్ష్యంగా దేవాదాయ శాఖ భూముల్లో సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రణాళికను రూపొందించాలని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. ఆదాయం లేని, శిథిలావస్థకు చేరుకున్న దేవాలయాల పురోగతికి కామన్ గుడ్ ఫండ్ నిధులు వెచ్చించి, సీజీఎఫ్ నిధులకు సార్థకత చేకూర్చాలని సూచించారు. బోనాల నేపథ్యంలో దేవాలయాలను అలంకరించి, భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పారు. బోనాల జాతర నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డితో కలిసి బోనాల పోస్టర్, క్యాలెండర్‌ను ఆవిష్కరించనున్నట్లు తెలిపారు.

మంగళవారం సచివాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో దేవాదాయ భూముల్లో సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు, ఉత్సవాలకు నిధుల మంజూరు, కామన్ గుడ్ ఫండ్ (సీజీఎఫ్) నిధులు తదితర అంశాలపై మంత్రి సమీక్షించారు. సందర్భంగా కొండా సురేఖ మాట్లాడుతూ.. తెలంగాణ పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (టీజీ రెడ్కో) సహకారంతో తెలంగాణలో సాగు చేయని, ఆర్థికంగా ఉపయుక్తంగా లేని భూముల్లో సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు విధివిధానాలను రూపొందించాలని ఆదేశించారు. ఆలయాల ఉపరితలాలపై సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు పరిశీలించాలని సూచించారు.

ప్రాథమికంగా భద్రకాళి దేవాలయం, యాదగిరి గుట్ట దేవాలయాలపై ఎన్టీపీసీ ఆధ్వర్యంలో రూఫ్ టాప్ సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటు దిశగా కార్యాచరణను వేగవంతం చేయాలని ఆదేశించారు. దేవాలయాల అభివృద్ధిలో పాలుపంచుకోవాలనే దాతలు సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు సహకారం అందించే దిశగా ప్రోత్సహించాలని పేర్కొన్నారు. గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద సీజీఎఫ్‌కు రూ.150 కోట్ల నిధులను కేటాయించాలని సీఎంను కోరతామని తెలిపారు. ఖర్చు విషయంలో కచ్చితత్వం కోసం ‘హెడ్ ఆఫ్ అకౌంట్’ను సృష్టించాలని అధికారులను ఆదేశించారు. బోనాల ఉత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో దేవాలయాలకు నిధుల విడుదల ప్రారంభించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఉత్సవాల్లో అమ్మవారి వృత్తాంతాన్ని తెలిపే లేజర్ షోలు ప్రదర్శించనున్నట్టు తెలిపారు.