28-03-2025 01:36:28 AM
జనగామ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్
జనగామ, మార్చి 27(విజయక్రాంతి): సోలార్ వినియోగంతో మానవాళికి పచ్చని భవిష్యత్తు ఉంటుందని జనగామ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. గురువారం జనగామ మండలంలోని ఓబుల్ కేశ్వాపూర్ గ్రామంలో గల జడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో యూత్ ఆఫ్ ఇండియా ఎన్జీవోస్ సంస్థ ఆధ్వర్యంలో మైక్రో - గ్రిడ్ సోలార్ ప్రాజెక్టు ప్రారంభోత్సవాత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. యూత్ ఆఫ్ ఇండియా ఎన్జీవోస్ సంస్థ సహకారం, సేల్స్ ఫోర్స్ సాఫ్ట్ వేర్ కంపెనీ చేయూతతో రూ.కోటి 60 లక్షలతో ఓబుల్‌కేశ్వాపూర్‌లో వంద ఇళ్లకు సోలార్ ప్యానెల్ లు, వంద సోలార్ స్ట్రీట్ లైట్లు, పాఠశాలలో పది సోలార్ ప్యానెళ్లను అమర్చినట్లు తెలిపారు. గతేడాది ఎర్రగొల్లపహాడ్ గ్రామంలోనూ ఈ ప్రాజెక్టును ప్రారంభించారని గుర్తు చేశారు.
పీఎం సూర్య ఘర్ పథకం కింద గృహాలకు సోలార్ కనెక్షన్ తీసుకోవచ్చని, ఇందుకోసం బ్యాంకు రుణ సదుపాయం, రాయితీ కూడా లభిస్తుందని తెలిపారు. అనంతరం 9వ తరగతి విద్యార్థులు రూపొందించిన సౌర శక్తి ప్రాజెక్టు నమూనాను కలెక్టర్ వీక్షించి విద్యార్థులను అభినందించారు.
అంతకుముందు యూత్ ఆఫ్ ఇండియా ఎన్జీవోస్ సంస్థ సహకారంతో సేల్స్ ఫోర్స్ సాఫ్ట్ వేర్ కంపెనీ చేయూతతో ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డీఈఓ రమేష్, పాఠశాల హెచ్‌ఎం వీరాంజని, యూత్ ఆఫ్ ఇండియా ఎన్జీవోస్ సంస్థ సభ్యులు శైలేష్, సాయి, రాజు, చంద్రశేఖర్, సేల్స్ ఫోర్స్ సాఫ్ట్ వేర్ కంపెనీ సభ్యులు సంకేత్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.