calender_icon.png 24 January, 2025 | 12:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాండవుల చెరువు నోట్లో మట్టి

26-08-2024 04:08:55 AM

  1. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లను చదును చేసిన రియల్టర్లు 
  2. సగానికి తగ్గిపోయిన విస్తీర్ణం 
  3. మినీట్యాంక్ బండ్ అందాలు ఆవిరి 
  4. చోద్యం చూస్తున్న మున్సిపల్ అధికారులు, పాలకవర్గం

గజ్వేల్, ఆగస్టు 25: సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని పాండవుల చెరువు ప్రజల జీవనానికి, రైతుల పంటలకు జీవనాధారంగా ఉండేది. ప్రస్తుతం దానిపై కన్నేసిన రియల్టర్లు, కబ్జాదారులు ఎఫ్‌టీ ఎల్, బఫర్ జోన్లనను మట్టితో చదును చేశారు. ప్రజలకు తాగునీటిని అందించి, చేపల పెంపకంతో మత్స్యకారులకు ఉపాధి కల్పించిన చెరువు విస్తీర్ణం సగానికి తగ్గింది. చెరువు భూముల్లో వెంచర్లు, ప్లాట్లు పుట్టుకొస్తున్నాయి. అయినా మున్సిపల్ అధికారులు గానీ, పాలకవర్గంగానీ, రెవెన్యూ అధికారులుగానీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. 

14 పెద్దచెరువుల్లో ఒకటి

గజ్వేల్ మండలంలో ఉన్న 14 పెద్దచెరువుల్లో గజ్వేల్ పాండవుల చెరువు ఒకటి. 49.22ఎకరాల విస్తీర్ణంలో చెరువు ఉండగా.. శిఖం భూమి, ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్‌తో కలిపి 104.22 ఎకరాల విస్తీర్ణం ఉండేది. ఇదంతా 30సంవత్సరాల క్రితం మాట. ఇప్పుడు చెరువు పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం చెరువులో నీరున్న ప్రాంతం 20ఎకరాలే. 

నిండుకుండ నుంచి నెలవంకలా..

గజ్వేల్ పాండవుల చెరువుపై కన్నేసిన రియల్టర్లు సంవత్సరాలుగా ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లను ఆక్రమించి మట్టితో చదును చేశారు. పలు నిర్మాణాలు చేపట్టడమే కాకుండా, కొం దరు ఎఫ్‌టీఎల్, శిఖం భూముల్లో వెంచర్లు ఏర్పాటు చేస్తూ విక్రయిస్తున్నారు. దీంతో నిం డుకుండలా ఉన్న చెరువు ఆకారం ప్రస్తుతం నెలవంకలా మారింది.

గత పాలకవర్గం గజ్వే ల్ పాండవుల చెరువు భూములను సర్వే చేయించడంతో పాటు హద్దులు కూడా పా తింది. అవి ప్రస్తుతం కనబడటం లేదు. మాజీ సీఎం, ప్రస్తుత గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ పట్టణ ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేందుకు రూ.6కోట్లతో పాండవుల చెరువును మినీట్యాంక్ బండ్‌గా అభివృద్ధి చేశారు. కానీ చెరువులో నీటి నిల్వకు భూమి లేక జీవకళ తప్పుతున్నది. 

ప్లాట్ల అమ్మకాలు.. ఇండ్ల నిర్మాణాలు

పాండవుల చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్‌లలోని భూముల్లో యథేచ్ఛగా వెంచర్లు చేసి ప్లాట్ల అమ్మకాలు, కొనుగోళ్లు చేస్తున్నారు. మరొకరైతే మత్తడిలోనే టీకొట్టు నిర్వహిస్తున్నారు. ఇటీవల గజ్వేల్ అంతర్గత మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టిన కాంట్రాక్ట్ కంపెనీ పనులకు అనుకూలంగా చెరువు ఎఫ్‌టీఎల్‌లో మట్టిపోసి చదును చేసింది. చెరువు నీటిని పనులకు వినియోగించుకుంది. పనులు పూర్తయి వారు వెళ్లిపోయి నా చెరువులో చదును చేసిన మట్టి అలాగే ఉండిపోయింది. ఇంత జరుగుతున్నా మున్సిపల్ అధికారులు, పాలకవర్గం పట్టించుకోకపోవడం గమనార్హం.