02-02-2025 01:39:07 AM
నిర్మలమ్మ పద్దులో ప్రత్యేక కేటాయింపులకు నోచుకోని రాష్ట్రం
హైదరాబాద్, ఫిబ్రవరి 1(విజయక్రాంతి): బడ్జెట్ (2025-26)లో తెలంగాణ నోట్లో కేంద్రం మట్టి కొట్టింది. రాబో యే ఐదేళ్లలో సబ్‌కా వికాస్ కలను సాకారం చేసుకునే లక్ష్యంతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అయితే సబ్‌కా వికాస్ కలను సాకారం చేయడంలో కీలక పాత్ర పోషించే తెలంగాణ రాష్ట్రానికి ఆ పద్దులో ఎలాంటి ప్రాధాన్యత దక్కలేదు.
మూసీ రివర్‌ఫ్రంట్‌కు రూ.14,100కోట్లు, ఆర్‌ఆర్‌ఆర్ రూ. 34,367 కోట్లు, మెట్రో రెండోఫేజ్ రూ. 24,269 కోట్లు, గోదావరి నదుల అనుసంధానం కోసం రూ. 7,400 కోట్లు, హైదరాబాద్, వరంగల్ నగరాల సీవరేజీ మాస్టర్ ప్లాన్ల కోసం వరుసగా రూ. 1 7,212, రూ. 4,170 కోట్లతో పాటు ఫ్యూచర్ సిటీ సహా పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మొత్తం రూ. 1.63లక్షలతో చేపడు తున్నామని, ఈ ప్రాజెక్టులకు కేంద్రం కనీసం రూ. 40వేల కోట్లకు తగ్గకుండా ఈ బడ్జెట్‌లో ఇతోధికంగా నిధులు కేటాయించాలని రేవంత్ రెడ్డి సర్కారు ప్రతిపాదనలు పంపింది.
నిర్మాలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తుల ఊసేలేదు. గంటకుపైగా సాగిన నిర్మలమ్మ బడ్జెట్ ప్రసంగంలో తెలంగాణ పేరును ప్రస్తావించకపోవడం గమనార్హం.
రూ. 10వేల కోట్లకు ఎవరికి?
రేవంత్ రెడ్డి సర్కారు 70 శాతం తెలంగాణను అర్బనైజ్ చేసేందుకు ఆర్‌ఆర్‌ఆర్‌ను నిర్మించబోతోంది. ఈ క్రమంలో కేంద్రానికి పంపిన ప్రతిపాదనల్లో దాదాపు రూ.1లక్ష కోట్లను ఖర్చు చేయాల్సిన అర్బన్ ప్రాజెక్టులే ఉన్నాయి. అయితే ఈ బడ్జెట్‌లో కేంద్రం లక్ష కోట్లతో పట్టణాల అభివృద్ధి కోసం అర్బన్ చాలెంజ్ ఫండ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది.
2025-26 బడ్జెట్‌లో పట్టణాల అభివృద్ధి కోసం రూ. 10వేల కోట్లును కేటాయించింది. ఇందులో తెలంగాణ వాటాపై తేల్చలేదు. ఒకవేళ కేటాయించినా.. రాష్ట్రానికి అత్తెసరు నిధులే వస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. కొత్త వినాశ్రయాలు ఏర్పాటుకు నిధులు ఇవ్వాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కోరింది. సాగునీటి ప్రాజెక్టులకు సహకరించాలని విజ్ఞప్తి చేసింది. గిరిజన యూనివర్సిటీకి మద్దతు అడిగింది.
ఉపాధిహామీ నిధుల విషయంలో వెసులుబాటును అడిగింది. హైదరాబాద్-శ్రీశైలం, హైదరాబాద్- విజయవాడ, వరంగల్ బైపాస్ నిర్మాణం, పర్వత మాల ప్రాజెక్టులో భాగంగా యాదాద్రి, హనుమకొండ, నాగార్జుసాగర్‌కు ప్రాధాన్యం, గోదావరి, కృష్ణా నదులపై పది పాంటూన్ బ్రిడ్జిల నిర్మాణం కోసం అవసరమైన నిధులను రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఇందులో ఒక్క అంశాన్ని కూడా కేంద్రం పరిగణలోకి తీసుకోలేదు.
వీటి పరిష్కారం ఎన్నాళ్లకో..
వెనుకబడిన జిల్లాలకు కేంద్రం నుంచి రూ.1800కోట్లు రావాల్సి ఉంది. ఇవి చాలాకాలంగా పెడింగ్‌లో ఉన్నాయి. ఏపీ పునర్విభజన సమస్యలపై ఎలాంటి ప్రకటన చేయలేదు. ఉమ్మడి సంస్థల నిర్వహణ కోసం ఏపీ నుంచి తెలంగాణకు రూ. 408 కోట్లు రావాలి. పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీలో ప్రధానమైనది కాజీపేట ఇంటిగ్రేట్ కొచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు.
కేంద్రం ఈ ఫ్యాక్టరీని చాలాకాలంగా నాన్చుతోంది. ఈసారి కూడా దీనిపై యథావిధిగా ఎలాంటి ప్రకనట చేయలేదు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, ఐఐటీ, ఐఐఎం, నవోదయ, సైనిక్ స్కూల్స్‌ను కేటాయించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కోరింది. పోలవరం మాదిరిగానే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని అడిగింది. కానీ కేంద్రం కరుణించలేదు.
రాష్ట్రానికి ఆ నిధులే దిక్కు..
తెలంగాణకు కేంద్రం మొండిచేయి చూపిన నేపథ్యంలో సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ (సీఎస్‌ఎస్), 15వ ఆర్థిక సంఘం నిధులు, పన్నుల్లో వాటా.. ఇలా రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన నిధులు దిక్కయ్యాయని ప్రభుత్వం భావిస్తోంది. కేంద్రం నుంచి రాష్ట్రానికి ఎలాంటి కొర్రీలు లేకుండా వచ్చేది పన్నుల్లో వాటా మాత్రమే.
2024-25 బడ్జెట్‌లో కేంద్ర పన్నుల్లో వాటాను రూ. 29,890 కోట్లుగా రాష్ట్ర అంచనా వేసింది. తెలంగాణ అప్పులను రీస్ట్రక్చర్ అంశంతో పాటు సీఎస్‌ఎస్ నిధులు 14 వేల కోట్లు, ఆర్థిక సంఘం, ఉపాధి హామీ నిధుల వినియోగంలో వెసులుబాటు కల్పించాలని కేంద్రాన్ని కోరినా కనికరించలేదు.
ప్రోత్సాహం కరువు..
ఆర్థిక వృద్ధిలో ఎంఎస్‌ఎంఈలు కీలక పాత్ర పోషిస్తాయని బడ్జెట్ ప్రసంగంలో నిర్మలాసీతారామన్ ప్రకటించారు. అంతటి కీలకమైన ఎంఎస్‌ఎంఈలకు ఒకపాలసీని తీసుకొచ్చి.. వాటికి పెద్ద ఎత్తున సహకారాన్ని అందిస్తున్న తెలంగాణకు ఎలాంటి ప్రోత్సాహాన్ని బడ్జెట్‌లో ప్రకటించలేదు.
గ్లోబల్ స్థాయిలో గేమ్ చేంజర్‌గా మారిన ఏఐపై తెలంగాణ ప్రత్యేక దృష్టిని సారించింది. ప్రపంచ పెట్టుబడులను ఆకర్షించేందుకు ఏఐ సిటీని ఏర్పాటు చేయబోతోంది. నిపుణులను తయారు చేయాల్సిన స్కిల్ యూనినర్సిటీని ఏర్పాటు చేసింది.
హైదరాబాద్‌ను సెమీకండక్టర్ల పరిశ్రమలకు హబ్ మార్చేందుకు సెమీకండర్ మిషన్‌లో చేర్చాలని కేంద్రాన్ని కోరింది. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే టెక్నాలజీ పరంగా కీలక సంస్కరణలను తీసుకొస్తున్న తెలంగాణకు ఈ బడ్జెట్‌లో ఎలాంటి ప్రోత్సాహాకాలను ప్రకటించకపోవడం గమనార్హం.