29-03-2025 12:00:36 AM
టిప్పర్ల రాకపోకలతో భయాందోళనకు గురవుతున్న వాహనాదారులు
సిద్దిపేట, మార్చి 28 ( విజయక్రాంతి): ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా మట్టిని తరలిస్తున్నారు. సిద్దిపేట రూరల్ మండలంలోని ఇర్కోడ్ గ్రామ శివారు భూములలో ఈ వ్యవహారం నాలుగు, ఐదు రోజులుగా కొనసాగుతుంది. టిప్పర్ల రాకపోకలతో ఇర్కోడ్ గ్రామ ప్రజలు, రైతులు, రోడ్డుపై వెళ్తున్న వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు.
మైనింగ్, రెవెన్యూ శాఖల నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా మట్టి తవ్వకాలు చేయడం చట్టవిరుద్ధం అయినప్పటికీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నరు. ప్రభుత్వ నిబం ధనలు బేఖాతరు చేస్తూ, అక్రమ సంపాదనకు అలవాటు పడిన కొంతమంది వ్యాపారస్తులు యదేచ్చగా ఎర్రమట్టిని ప్రైవేటు వెంచర్లకు, ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు.
మండలంలో జరుగుతున్న మట్టి దందా పై మైనింగ్, పోలీస్, రెవెన్యూ విభాగాల అధికారులు ఆరా తీస్తున్నట్టుగా పైకి చెబుతున్నా, లోలోన మాత్రం వీరి అనుమతులతోనే యదేచ్ఛగా ఈ దందా సాగి స్తున్నట్లు తెలుస్తోంది. లేకపోతే అడ్డు అదుపు లేకుండా, విచ్చలవిడిగా టన్నుల కొద్ది మట్టిని వ్యాపారాలు ఎలా తరలిస్తున్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి అక్రమ మట్టి దందాపై సంబంధిత విభాగాల అధికారులు అందరూ దృష్టి సారించి కట్టడి చేయాలని, లేకపోతే చెరువులు, గుట్టలు, లూటీ అవుతాయని పలువురు అంటున్నారు.