‘మీరు మీ ఆలోచనలతో శాంతిని కోల్పోయినప్పుడు మీరు మాట్లాడతారు’ అంటాడు సుప్రసిద్ధ కవి ఖలీల్ జిబ్రాన్. అచ్చం నాగిళ్ళ రమేష్ కూడా అంతే. ఆ మాట కొస్తే మాట్లాడుతున్న వారు, తమ రాతలతో మాట్లాడుతున్న వారందరూ ఆలోచనలతో శాంతిని కోల్పోయిన వారే. ఆ మాట్లాడటం యెట్లుంటదంటే, ‘కొందరు మాట్లాడితే/ విత్తనం మట్టి ముసుగు దీసుకుని/ ప్రపంచానికి/ తనను తాను పరిచయం చేసుకున్నట్లు (‘మాట్లాడే దృశ్యాలు’) ఉంటది.
ఇది నాగిల్ల రమేష్‌కి అతికేటి మాట. తెలుగు సాహిత్యంలో తన ‘ఉద్దరాసి పూలచెట్టు’ కవితా సంకలనంతో తానే తన రచనలతో మాట్లాడి పరిచయం చేసుకున్నాడు. అక్కడే ‘మనుషులు మాట్లాడే మాటలన్నిటినీ తాను ఇష్టపడను’ అని కుండబద్దలు కొట్టినట్టు చెప్పాడు. ‘కొందరు మాట్లాడితే/ కరుకు కరుకు నోట్ల/ పైసల వాసనే/ కంపు గొడుతది’ అనిచ తాను ఏవైపు మాట్లాడతాడో స్పష్టతనిస్తాడు.
ఈ కవి ఉత్త పదాలను అల్లి కవిత్వపు బొ మ్మను జేసేటోడు కాదు. అందులో జీవాన్ని నింపుతాడు. ఆ బొమ్మకు పోసిన జీవంలో తన బతుకు మూలాలు వెతుకుతాడు. ‘ఆ మూలాల్లో తన ఆకలిని, కోల్పోయిన బాల్యాన్ని, గ్రామాలలో శ్రమజీవుల బతుకులను, రోజువారీ ఆకలిని తీర్చే ఆహారాన్ని, నేలమీది రాజ్యహింసను, కన్నీటి వానలవుతున్న తల్లుల దుఃఖాలను, తన ఎదుగుదలకు అడ్డమొచ్చే కులం, దానికి కారణమైన మనువాద భావజాలం, దాన్ని పారద్రోలడానికి అంబేద్కర్, పూలేలు ఇచ్చిన దృక్పథాన్ని స్వీకరించి రాజ్యాధికారం ఒక మార్పు సంకేతం’ అని మన ముందుంచుతాడు.
ఇవన్నీ చెప్పడంలో కవి ఉద్దేశం స్పష్టం. తాను అనుభవించిన, తన చుట్టూ ఉన్న వాస్తవికతను కవిత్వీకరించకుండా ఇంకేది రాసినా అది ప్లాస్టిక్ పూల మాదిరే. ఇట్లాంటి ధోరణి తెలుగు కవిత్వ లోకంలో కొత్త కాదు. కానీ, ఇది ఎక్కువగా సమాజపు చివరితలంపై నిలపడి బతుకును చూసినవాళ్ళ రాతల్లోనే ఎక్కువగా కనపడుతుంది. ఈ కవికి స్పష్టమైన సూపున్నది. కవితలో తానెంచుకున్న ప్రతి వస్తువూ సమాజం కావలుసుకుని విస్మరించిందే. వాటిని అసహ్యించుకుంటాడు.
ప్రపంచంలోని ఆలోచనాపరులంతా కవిత్వం రాయడం ఒక ఎత్తు ఐతే, తెలంగాణలోని బుద్ధిజీవుల కవిత్వం కాసింత ప్రత్యేకం. అందునా ఆదివాసీ, దళిత, మైనారిటీ, శూద్ర, వెనుకబడిన వర్గాల నుండి వచ్చిన కవిత్వం మరింత ప్రత్యేకం. ఏ మాత్రం సామాజిక స్పృహ ఉన్నవాళ్లయినా ఈ ప్రాంతంలో ఉద్యమాలను తలువకుండా కవిత్వం రాయలేరు. ఈ భూమిమీద ఎక్కడైనా బాధిత వర్గా లనుండి వచ్చిన వారు వారి ప్రాంతాలలో జ రిగిన విముక్తి పోరాటంలో ప్రత్యక్ష భాగస్వా మ్యం లేకున్నా ఆ ఉద్యమాలపట్ల సానుభూ తి, అణచివేతకు కారణమైన రాజ్యం పట్ల తిరస్కృతి, బిడ్డలను కోల్పోయిన తల్లుల భుజా లమీద పడి ఏకగొంతుగా దుఃఖించడం సా ధారణం. అట్టడుగు వర్గాల నుండి వచ్చే కవులకు ఆ దుఃఖాన్ని మోయడం సహజ స్వభావం.
1980, 90 దశకాలలో తెలంగాణ పల్లెల ను చూసిన వారికి, చరిత్ర చదువుకున్న వారికి ఈ విషయాలన్నీ కళ్ళముందట కదలాడుతై. నేటికీ ఎందరో అమరవీరుల స్తూపా లను చూస్తూ కన్నీటి నరకాన్ని అనుభవిస్తున్న తల్లుల గోసను చూసిన ఈ కవి, ‘కన్న పేగులను స్తూపాల్లో జూసుకుంటూ/ చేతులు పి సుక్కుంటున్న గుడ్డి దీపాలకు/ ప్రత్యక్ష నరకం’ అని చలిస్తాడు. నాగిల్ల రమేష్ స్పష్టమైన భావజాలంతోకూడిన తాత్విక దృక్పథ కవి.
తాను ఎదిగి వచ్చిన క్రమంలో తిన్న ఎదురుదెబ్బలు, తన జాతి అనుభవించిన అవమానాలు తరాలుగా ఈ వివక్షలకుగల కారణాలు అధ్యయనంతో, సమాజ గమనపు పరిశీలనతో అవగాహన చేసుకున్నోడు. వివక్షకు, అణచివేతకు మూలాలెక్కడున్నవో వాటి ని పారద్రోలడానికి మార్గమేదో స్పష్టంగా యెరిగినోడు. ‘కత్తుల వంతెనపై’ ఆన్న ఒక్క కవిత చాలు, ఈ కవి ఆలోచనా దృక్పథాన్ని, అంబేద్కర్ తాత్వికతను తాను ఎట్లా ఆవాహన చేసుకున్నది అర్థమైతది.
‘నల్లకొడిసె వన్నేకాడు’ కవితా సంపుటి ఓ మిక్స్ ఫ్రూట్ సలాడ్. ఒక్కో పండు ఒక్కో రుచిని ఇచ్చినట్టు కవితలోని వాక్యాలు ఒక్కో అనుభూతిని కలిగిస్తాయి. కవి రమేష్ ఎంచుకున్న ప్రతి వస్తువు వర్ణన అత్యంత సహజంగా ఉండటమే కాదు, దానిని అంతే హృద్యంగానూ చిత్రీకరించాడు. ‘పల్లె బతుకును ముట్టిచ్చే నీటిదీపం చెరువు’ లాంటి ప్రయోగాలు ఆయన ప్రతి కవితలోంచీ ఏరుకోవచ్చు. కవి, విమర్శకులు గుంటూరు లక్ష్మీనర్సయ్య అన్నట్టు ‘దీన్ని చదివేప్పుడు ఈతరం వాళ్ళు చాలా పదాలకోసం నిఘంటువుని ఆశ్రయించాల్సి’ వస్తుంది.
దిలీప్.వి
8464030808