calender_icon.png 2 November, 2024 | 6:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాధారణ స్థితికి సాఫ్ట్‌వేర్

21-07-2024 01:30:42 AM

విండోస్ క్రాష్‌తో విఫలమైన వ్యవస్థల పునరుద్ధరణ

ఒకే వ్యవస్థపై ఆధారపడితే సమస్యే

రుజువు చేసిన మైక్రోసాఫ్ట్ క్రాష్

న్యూఢిల్లీ, జూలై 20: మైక్రోసాఫ్ట్ విండోస్ సాఫ్ట్‌వేర్ వైఫల్యం వల్ల ప్రపంచవ్యాప్తంగా స్తంభించిన అనేక సేవలు సాధారణ స్థితికి చేరుకున్నట్లు మైక్రోసాఫ్ట్ సహా క్రౌడ్ స్ట్రయిక్ ప్రకటించాయి. విండోస్ క్రాష్ వల్ల శుక్రవారం ఎయిర్‌లైన్స్, బ్యాంకులతో పాటు అనేక వ్యాపారాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. అమెరికాలో దాదాపు అన్ని విమానాలను నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

యాంటీ వైరస్ ప్రోగ్రామ్‌కు అప్‌డేట్ చేయటం వల్ల ఈ పరిస్థితిని నెలకొందని మైక్రోసాఫ్ట్ తెలిపింది. అజుర్ క్లౌడ్ ఫ్లాట్‌ఫాం వినియోగదారులపై ప్రభావం చూపిందని పేర్కొంది. అయితే, సమస్య ప్రారంభమైన కొన్ని గంటల తర్వాత మేజర్ సమస్యలను పరిష్కరించి సేవలను పునరుద్ధరించింది. కానీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఒకే ప్రొవైడర్‌పై ఆధారపడటం వల్లనే ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

సమస్య పరిష్కారమైంది

భారత్‌లోనూ విమానయాన సేవల్లో అంతరాయం కలిగింది. బ్యాంకింగ్ సైట్లు మొరాయించారు. చెక్‌ఇన్ సమయంలో చేతి రాతతో బోర్డింగ్ పాసులు ఇచ్చారు. దేశంలో శనివారం ఉదయం 3 గంటల నుంచి అన్ని ఎయిర్‌లైన్ వ్యవస్థలు సాధారణంగా పనిచేయడం ప్రారంభించాయని పౌర విమాన యాన మంత్రిత్వ శాఖ తెలిపింది. శుక్రవారం కొన్ని అవాంతరాలు ఎదురయ్యాయని, ప్రస్తుతం పరిష్కారమైనట్లు పేర్కొంది. మ్యానువల్‌గా చెక్‌ఇన్ చేయాల్సి రావడంతో విమానాశ్రయాల్లో భారీ క్యూలు కనిపించాయి. ఒకే ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఆధారప డటం వల్లనే ప్రపంచవ్యాప్తంగా ఈ పరిస్థితి నెలకొన్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రత్యామ్నాయాలు రావాల్సి ఉందని చెబుతున్నారు. లైనెక్స్, మ్యాక్, విండోస్, యూబంటు వంటి ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నా అధికంగా విండోస్‌నే ఉపయోగిస్తున్నారు.