calender_icon.png 4 March, 2025 | 4:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెత్తబడిన జెలెన్‌స్కీ

03-03-2025 11:45:43 PM

అమెరికాకు రుణపడి ఉంటామని ప్రకటన..

వాషింగ్టన్: అమెరికాకు రుణపడి ఉంటామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఇటీవల ఆయన భేటీ కాగా, ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నది. దీంతో భేటీని అర్ధాంతరంగా ముగించి జెలెన్‌స్కీ బయటకు వచ్చేశారు. ఆ తర్వాత ఆయన అమెరికాతో సత్సంబంధాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాతో ఒప్పందాలకు ఉక్రెయిన్ సిద్ధంగా ఉందన్నారు. ‘అమెరికాతో నేను సత్సంబంధాలను కాపాడుకుంటాను. కొన్ని కీలక అంశాలు చర్చించేందుకు ఇటీవల నేను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ అయ్యాను. ట్రంప్ మళ్లీ పిలిచినా వెళ్తాను. సమస్యల పరిష్కారం కోసం నేను ఎన్నిసార్లునా భేటీ అవుతా.

మినరల్స్ ఒప్పందంపై ఇరువర్గాల మధ్య ఏకాభిప్రాయం కుదిరితే, ఆ ఒప్పందాలపై సంతకం చేసేందుకు నేను సిద్ధం’ అని ప్రకటించారు. యూరప్ నుంచి ఉక్రెయిన్‌కు పూర్తి మద్దతు ఉందని ఇటీవల తనకు అర్థమైందన్నారు. తమకు సుదీర్ఘమైన యుద్ధం వద్దని, శాంతి కావాలని స్పష్టం చేశారు. యూకే, యూరప్ యూనియన్, టర్కీ వంటి దేశాలు తమ దేశానికి అండగా ఉంటున్నాయన్నారు.