calender_icon.png 2 February, 2025 | 6:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వాళ్లకు సమాజం అండగా నిలవాలి

02-02-2025 01:01:28 AM

కేరళలో ర్యాగింగ్ భూతం కారణంగా ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన అందరినీ కలచివేస్తోంది. తాజాగా ఈ ఘటనపై నటి సమంత సైతం స్పందించింది. ర్యాగింగ్ వంటివి ఎంత ప్రమాదకరమో ఈ ఘటన తెలియజేస్తోందని.. బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ పెట్టింది. “2025లో కూడా ద్వేషం, విషంతో నిండిన కొందరు వ్యక్తుల వైఖరి మారడం లేదు.

వారి కారణంగా ఓ బాలుడు తన జీవితాన్ని కోల్పోయాడు. హేళన, ర్యాగింగ్ వంటివి ఎంత ప్రమాదకరమనేది ఈ ఘటన తెలియజేస్తోంది. విద్యార్థులు కొందరు తాము ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి బయటకు చెబితే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందోనన్న భయం తో తమలో తామే కుమిలిపోతున్నారు. మన దగ్గర కఠినమైన చట్టాలున్నా కూడా మనం ఎక్కడ విఫలమవుతున్నాం? ఈ ఘటనపై సంతాపం తెలియజేసి ఊరుకోకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయాలి.

అధికారులు సైతం ఈ ఘటన గురించి క్షుణ్ణంగా పరిశీలించాలి. నిజానిజాలు బయటకొచ్చి విద్యార్థికి న్యాయం జరగాలి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి ర్యాగింగ్ ఎదురైతే బయటకు మాట్లాడండి. ఇలాంటి వారికి సమాజం కూడా అండగా నిలవాలి” అని సమంత తెలిపారు. జనవరి 15న జరిగిన ఈ ఘటన కేరళ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీనిపై విద్యార్థి తల్లి సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు.