29-04-2025 11:34:48 PM
ఉగ్రదాడి కీలక సమావేశానికి మోదీ గైర్హాజరును తప్పుబడుతూ ప్రధాని పోలికలతో తల లేని మొండెం ఫొటో పోస్ట్..
కౌంటరిచ్చిన బీజేపీ..
తర్వాత పోస్టు తొలగించిన కాంగ్రెస్...
న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీల మధ్య సోషల్ వార్ నడుస్తోంది. ఉగ్రదాడికి సంబంధించి నిర్వహించిన కీలక సమావేశానికి ప్రధాని మోదీ(Prime Minister Modi) గైర్హాజరయ్యారని ఆరోపిస్తూ కాంగ్రెస్ ఓ ఫొటోను ఎక్స్‌లో పోస్ట్ చేసింది. ఈ పోస్టును ఖండించిన బీజేపీ.. రాహుల్ గాంధీ పోలికలతో కూడిన ఓ ఫొటోతో బదులిచ్చింది. పహల్గాం దాడి గురించి జరిగిన అఖిలపక్ష సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ గైర్హాజరుకావడం సరైన పద్ధతి కాదని కాంగ్రెస్ ఆరోపించింది.
‘బాధ్యతగా వ్యవహరించాల్సిన సమయంలో గాయబ్’ అనే శీర్షికతో మోదీ ఆహార్యం, దుస్తులు ఉన్న ఓ తలలేని మొండెం ఫొటోను షేర్ చేసింది. ఆ తర్వాత బీజేపీ రాహుల్ గాంధీ మీద ఆరోపణలు గుప్పిస్తూ ఓ ఫొటోను పోస్ట్ చేసింది. ‘పాకిస్థాన్ స్నేహితుడు’ అనే శీర్షికతో రాహుల్ పేరును ప్రస్తావించకుండా తెలుపు రంగు టీషర్ట్, క్యాప్ ధరించిన ఓ వ్యక్తి చేతిలో కత్తి పట్టుకున్న ఫొటోను ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది.
ఫొటో తొలగించిన కాంగ్రెస్
కాంగ్రెస్ పార్టీ అనంతరం ఈ ఫొటోను తొలగించింది. కాంగ్రెస్ సోషల్ మీడియా ఇంచార్జి సుప్రియా శ్రీనాటేను అధినాయకత్వం మందలించినట్టు వార్తలు వస్తున్నాయి.