calender_icon.png 5 January, 2025 | 8:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గతం కంటే భిన్నంగా సోషల్ ప్రశ్నలు

03-01-2025 02:33:49 AM

* సైకాలజీలో కొంత తేలిక.. కొంత కఠినం

* ఇంగ్లిష్‌లో కఠినంగా ప్రశ్నలు

* తొలిరోజు టెట్‌కు 6,653 మంది గైర్హాజరు!

హైదరాబాద్, జనవరి 2 (విజయక్రాం తి): తొలిరోజు సాధారణంగానే టెట్ ప్రశ్న పత్రాలొచ్చినట్టు అభ్యర్థులు తెలిపారు. ఆన్‌లైన్ పరీక్షలు తొలిరోజు పేపర్ 2 సోషల్ విభాగం (తెలుగు మీడియం)లో ఉదయం ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, హైదరాబాద్, జనగామ, జగిత్యాల, గద్వాల జిల్లాలకు, మధ్యాహ్నం కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, ఆసిఫాబాద్, వికారాబాద్ జిల్లాల అభ్యర్థులకు జరిగాయి.

సోషల్ పేపర్‌లో తెలుగు విభాగంలో కవి పరిచయాలు, సందులు, ఛందస్సు, గద్య భాగం తదితర అంశాలపై ప్రశ్నలు అడిగారు. ఇక సైకాలజీలో ఎప్పటిలాగే కొంత తేలికగా కొంత కఠినంగా ప్రశ్నల సరళి ఇచ్చారని అభ్యర్థులు తెలిపారు. ఇంగ్లిష్ విభాగంలో గతంలో లాగే ప్రశ్నల సరళి కొంత హర్డ్‌గానే ఇచ్చారని పేర్కొన్నారు.

సోషల్ కంటెంట్ విభాగంలో గతం కంటే ప్రశ్నలు భిన్నంగా అడిగారని, అన్ని అంశాల్లో పరిశీలన చేసినట్టు ప్రశ్నల సరళి ఉందని అభ్యర్థులు వెల్లడించారు. సొంత ఉమ్మడి జిల్లాల్లో పరీక్ష కేంద్రాలు వచ్చిన అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకున్నా, ఇతర జిల్లాల్లోని పరీక్ష రాసిన అభ్యర్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు తెలిపారు. 

6 వేల మంది గైర్హాజరు

తొలి రోజు పరీక్షలకు 6,653 మంది అభ్యర్థులు గైర్హాజరైనట్టు అధికారులు తెలిపారు. తొలి సెషన్‌లో 49 కేంద్రాల్లో 12,815 మందికి 9,259 (72.25 శాతం) మంది హాజరుకాగా, 3,556 మంది గైర్హాజరయ్యారు. రెండో సెషన్‌లో 52 పరీక్షా కేంద్రాల్లో 12,734 మందికి 9,637 (75.68 శాతం) మంది హాజరుకాగా, 3,097 మంది గైర్హాజరయ్యారు.

ఈ నెల 5న టెట్ పేపర్ పరీక్ష జరగనుంది. ఈ నెల 20 వరకు పరీక్షలు జరగనున్నాయి. తొలి రోజు టెట్ పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్టు పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు ఈవీ నర్సింహారెడ్డి తెలిపారు.