సుమారు 140 కోట్ల భారతదేశ జనాభాలో దాదాపు 70 కోట్లమంది బీసీలు ఉన్నారు. ఇప్పటి వరకూ సుమారు ముప్పు కులాలు వరకూ చట్టసభల మెట్లు ఎక్కక పోవడం అన్యాయం కదా! ఇవన్నీ చూస్తుంటే ఆలోచనా పరులకు కళ్ళలో నీళ్లు వస్తున్నాయి. ‘అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వాతంత్య్రం అందమా!’ అన్న ఒక కవి మాటలు గుర్తొస్తున్నాయి. బీసీల లెక్కాపత్రం పక్కకు పెట్టటం ఇంకెన్నాళ్ళు? వారి లెక్కలను పక్కకు పెట్టేవాళ్ళు పిడికెడు మంది పాలకులు మాత్రమే.
అసలు లెక్క తేల్చక పోవటమే పాలకుల ఆంతర్యమా? లేక, లెక్క తేలిస్తే చిక్కుముడులు వస్తాయనే భయమా? ఒకవేళ లెక్క తేల్చక పోయినా లెక్కల పేరుతో గందరగోళం సృష్టించినా, కొంచెం వెనుకా ముందు అయినా చిక్కుముడులు విప్పే సంఖ్య, సత్తా బీసీలకు ఉంది. ‘అసలు, వడ్డీ తీసుకునే లేదా తెచ్చుకునే రోజులు భవిష్యత్తులో ఉంటాయి’ అని మహాకవి గుర్రం జాషువా అభిప్రాయం ఇక్కడ గమనార్హం.
‘రెండు రెళ్లు నాలుగు’ అనేది ఎంత నిజమో, ఈ దేశంలో బీసీలు 60 శాతం దాకా ఉన్నారన్నదీ అంతే నిజం. నోరు లేని మూగజీవులు వారు. సకల రంగాలలో వారికి జరుగుతున్న అన్యాయం ఎంతో, ఏమిటో సరిగ్గా చెప్పుకోలేని సాంఘిక వెనుకబాటుతనంలో ఉన్న రాజకీయ అనాధలు బీసీలు. వారి సామాజిక, ఆర్థిక వెనుకబాటుతనాన్ని ఆసరాగానే ఏడున్నర దశాబ్దాలుగా వంచనకు లోనవుతున్నారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ దోపిడీకి గురవుతున్నారు. ఈ అవమానాలకు, అసమానతలకు గురవుతున్న బీసీలు ఎందుకు ఐక్యం కాలేక పోతున్నారు?
ఎందుకు ఐక్యం కాలేక పోతున్నారు?
సంఖ్య ఎక్కువగా ఉండి, సంపద తక్కువగా ఉండటం ప్రధాన కారణం. పాలక కులాల సంఖ్య అతి తక్కువగా ఉండి, సంపద ఎక్కువగా వుండటంతో వారు ఐక్యంగా ఉంటున్నారు. పాలక కులాలకు సంపద ఎక్కడ నుంచి వచ్చింది? అంటే, నిజాం నవాబు వంటి అతి సంపన్నులుగా ఉన్నవారి దగ్గర తాబేదార్లుగా, జాగిర్దారులుగా, పెత్తందార్లుగా వారు ఉండినారు. నిజాం నవాబులాంటి రాజుల శకం అంతం కావటంతో భూమి అసలుదారుల కాలంలో జాగిర్దారులు, జమీందారులు తమ పేర్లు రాసుకుని కోట్లకు అధిపతులు అయ్యారు.
అప్పటికే దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. రూమీ టోపీ తీసి ఖద్దరు ధరించి కాంగ్రెస్‌లో చేరారు. ఎన్నికల్లో గెలుపు గుర్రాలుగా మారడంతో దశాబ్దాలుగా రాజకీయంగా శాసిస్తున్నారు. పాలక కులాలకు బీసీలకు రాజకీయ పోటీ, వికలాంగులకు సకలాంంగులకు పోటీ అన్నట్లుగా మారింది. దీనికి అతీతంగా మార్పు రావాలంటే కుల ఆధారిత లెక్కపత్రం తేలాల్సిందే.
ఎన్నికల్లో రూ. వందలాది కోట్లు పాలక కులాలు విచ్చలవిడిగా ఖర్చు పెడుతుంటే, బీసీలలో మాత్రం సామాజిక, రాజకీయ వెనుకబాటుతనం ‘నీటిమీద రాత’ లాంటి ఉద్యమాలవలె ఉంటున్నది. చిత్తశుద్ధి లేని పాలకులు కూడా ఒకింత కారణమే. ఇటీవలి కాలంలో చదువుకోవటం వల్ల కాలానుగుణ, గుణాత్మక, పరిణామాత్మక మార్పులు వస్తున్నాయి. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో బీసీ జనాభా లెక్కలు చెయ్యమన్న బీజేపీకీ బీసీలు చుక్కలు చూపించారు. అందుకని, ఈ పరిణామాత్మక, గుణాత్మక మార్పులు గుర్తించి తెలంగాణ, ఏపీసహా భారతదేశ వ్యాపితంగా పక్కాగా కుల ఆధారిత లెక్కలు తియ్యాలి.
సమాజంలో సగానికి పైగా ఉండి అవకాశాలు లేక అవమానాల్లో మగ్గిపోతున్న బీసీలకు ఈ కారణంగానే లెక్కలు కావాలి. సకల రంగాలలో అసమానత్వపు పంపిణీని సమానం చేసేందుకే బీసీలు ముక్తకంఠంతో లెక్కలు అడుగుతున్నారు. ఘణతంత్రం జనతంత్రం కావాలంటే, జనగణన ఇంకెన్నాళ్ళని బీసీలు, మేధావులు ప్రశ్నిస్తున్నారు. ‘ఈ దేశంలో చెట్లకు, పుట్టలకు లెక్కలున్నాయి. కానీ, సమాజంలో ప్రాణం వున్న మనుషులకు ఎందుకు లెక్కలు తియ్యరు?’ అంటూ బీసీలు ముక్తకంఠంతో ఆ మేరకు డిమాండ్ చేస్తున్నారు.
అందుకే అయోధ్యలో ఓటమి
ఆకాశం నివాసయోగ్యంగా మారుతున్న నేడు భూమిమీద మనుషుల లెక్కలకోసం మల్లగుల్లాలెందుకు పడుతున్నట్టు?! ఈ లెక్కలతోనే అభివృద్ధిని, శాస్త్రీయంగా సామాజిక గ్రూప్స్ వారీగా పాలకులు బడ్జెట్ కేటాయిపులు జరిపే వీలుంటుంది. తద్వారా దేశం, ప్రజలు అభివృద్ధి చెందుతారు. కులగణన ద్వారా బీసీలు ఏం అడుగుతున్నారు? గత ప్రభుత్వం రకరకాల కారణాలతో కేవలం పంచాయితీరాజ్ రిజర్వేషన్లు 17 శాతానికే పరిమితం చేసి బీసీలకు అన్యాయం చేసింది. రాహుల్ గాంధీ ‘కామారెడ్డి బీసీ డిక్లరేషన్’లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్స్ ఇస్తామని ప్రకటించారు.
దీంతో ఈ అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా అయ్యింది. ‘ఇండియా’ కూటమిలో కూడా ఎలక్షన్ ఎజెండాగానూ మారింది. లెక్కలు చేయమన్న బీజేపీనీ అరకొర మెజారిటీతో ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు. దీంతో బీజేపీ సతమతమవుతున్నది. బీజేపీ పదేళ్లు అధికారంలో ఉండి, కుల ఆధారిత లెక్కలు చెయ్యమని చెప్పటంతో ఉత్తరాదిలో జనరల్ సీట్ అయిన అయోధ్యలో కూడా బీజేపీ ఎంపీ ఓడిపోయారు. కుల జనగణన చెయ్యక పోవడం కూడా అక్కడి ఓటమికి ఒక కారణమే.
రేవంత్ సర్కారుకో సూచన!
సోనియాగాంధీకి ‘తెలంగాణ ఇచ్చిన దేవత’గా గొప్ప పేరుంది. ఆమె ఆధ్వర్యంలోనే ‘ఉదయపూర్ డిక్లరేషన్’ జరిగింది. దాని ప్రకారం ప్రతీ పార్లమెంట్ సీటు పరిధిలో ఇద్దరు బీసీలకు ఎమ్మెల్యే టిక్కెట్స్ ఇస్తామని విధాన నిర్ణయం చేసి తప్పుకున్నారు. ‘కామారెడ్డి బీసీ డిక్లరేషన్’లో రాహుల్‌గాంధీ స్వయంగా ‘బీసీ లెక్కలు చేస్తామని’ ఒప్పుకున్నారు. రేవంతరెడ్డి కూడా జనగణన చేస్తామని హామీ ఇచ్చి, సందిగ్ధంలో ఉన్నట్లు తెలుస్తుంది. సోనియాగాంధీకి ‘తెలంగాణ దేవత’ ద్వారా ఎంత మంచి పేరు వచ్చిందో ఈ హామీలు అమలు పర్చక పోవటం వల్లకూడా అంతే చెడ్డ పేరు వస్తుంది. ఏజ్ ఏంత ఉన్నా నాలెడ్జి గ్యాప్ లేకపోతే అన్ని సమూహాలతో కలిసి పని చేయవచ్చు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గమనించాల్సింది ఏమిటంటే, సోషల్ మీడియా తదితర సాంకేతిక మార్పులతో కాలానుగుణంగా బీసీలు ఇటీవల చైతన్యవంతులయ్యారు. చదువుల కారణంగా వారిలో గుణాత్మక మార్పులు వచ్చాయి. ఈ రెండు రకాల చేతనత్వంతో బీసీలు ఉన్నారు. దీన్ని గమనించైనా ముఖ్యమంత్రి బీసీ లెక్కలకు శ్రీకారం చుట్టాలి. ఈ మార్పులకు అనుగుణంగానైనా ప్రజలను పాలించాల్సిన అవసరం ఉంది.
తప్పులు లేకుండా జరగాలి
బీసీ కమిషన్ మధ్యంతర ఉత్తర్వులతో మమ అనిపించొద్దు. ఇంటింటి సర్వేతో అన్ని కులాల లెక్కలు తియ్యాలి. కులసంఘాలు అన్నీ బీసీ కుల మేధావులతో సమగ్రంగా చర్చించాలి. కొన్ని రకాల మీటింగులకు విద్యార్థులను వాడుకుంటున్నారు. అలా కాకుండా వారిని కులగణనకు ఉపయోగించుకోవచ్చు. చాలావరకు టిక్‌లు కొట్టే కాలమ్స్ ఉంటాయి, తేలికగా చెయ్యొచ్చు. 8వ తరగతి నుంచి డిగ్రీ వరకు విద్యార్థులకు ముగ్గురికి వారి ప్రాంతంలోనే యాభై ఇళ్ళు కేటాయించాలి. ఉద్యోగులతో మూడంచెలుగా చెక్ చేసి మూడు నుంచి ఐదు రోజుల్లో రాష్ట్రం మొత్తం లెక్కలు తీయొచ్చు. అలాంటి విధానాన్ని ప్రభుత్వం రూపొందించాలి.
లేదా, అన్ని రకాల ఉద్యోగులతో తప్పులకు తావులేకుండా కుల ఆధారిత లెక్కలు తీయొచ్చు. గత కేంద్ర కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన బీసీ లెక్కలను ఎన్నికలు సమీపించగానే ‘తప్పుల తడక’ అన్న ప్రచారంతో తప్పించుకుంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చెయ్యాలని అనుకుంటున్నా, ఆ లెక్కలు కూడా విమర్శలకు, తప్పులకు తావు లేకుండా చేయాలి. తప్పులకు అవకాశం ఏర్పడ్డా, అశాస్త్రీయంగా చేసినా సత్ఫలితం కంటే నష్టమే ఎక్కువ ఉంటుంది. స్వాతంత్య్రం, గణతంత్రం అయితేనే అది ప్రజాతంత్రం అవుతుంది. అందుకే, కులగణన చెయ్యాలి. తలలను లెక్కించి ఎవరి వాటా వారికి దక్కించాలి.
వెంకట్ సదమ్