calender_icon.png 30 April, 2025 | 1:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉపాధి హామీలో... అవినీతి నిర్మూలనకే సామాజిక తనిఖీలు

29-04-2025 06:57:04 PM

డిఆర్డిఎ పిడి ఎస్ కిషన్...

మందమర్రి (విజయక్రాంతి): గ్రామాల్లో వలసలు నివారించి కూలీలకు స్థానికంగా పని కనిపించాలని లక్ష్యంతో అమలవుతున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అవకతవకలు, అవినీతి నిర్మూలనకే సామాజిక తనిఖీ బృందం తనిఖీలు నిర్వహిస్తుందని జిల్లా డిఆర్డిఏ పిడిఎస్ కిషన్(District DRDA PDS Kishan) స్పష్టం చేశారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీ ప్రజావేదికలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మండలంలోని 10 గ్రామ పంచాయతీల పరిధిలో 1 ఏప్రిల్ 2024 నుండి 31 మార్చి 2025 వరకు మండల వ్యాప్తంగా 215 పనులు చేపట్టగా కూలీలకు 3.34 కోట్ల రూపాయలు చెల్లించారు.

వీటిపై గత వారం రోజులుగా సామాజిక తనిఖీ బృందం సభ్యులు గ్రామాల్లో పర్యటించి పనులను పరిశీలించి పూర్తి నివేదికను ప్రజావేదికలో వెల్లడించారు. అయా గ్రామాల్లో చేపట్టిన పనులకు సంబంధించిన  కొలతలు తప్పులుగా నమోదయ్యాయని తనిఖీ బృందం సభ్యులు ప్రజావేదిక లో వెల్లడించారు. చేపట్టిన పనులకు సామాజిక తనిఖీ బృందం సభ్యులు నిర్ధారించిన పనులకు వ్యత్యాసం ఉండటం తో పలువురు సిబ్బందిపై పనులకు సంబంధించి అదికారులు జరిమానా విధించారు.

ఈ సందర్భంగా డిఆర్డిఏ పిడి మాట్లాడుతూ... గ్రామాల్లో చేపట్టిన ఉపాధి హామీ పథకం పనులో ఎలాంటి అవకతవకలు జరగకుండా చూడాలని, అంతేకాకుండా పనులకు సంబంధించిన వివరాలను రికార్డులలో నమోదు చేయాలని అధికారులను సిబ్బందిని ఆదేశించారు. ఉపాధి హామీ పథకం పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ పథకం అంబుడ్స్ మెన్ దామెర శివరాం, విజిలెన్స్ అధికారి కిరణ్, ఎంపీడీవో ఎన్ రాజేశ్వర్, చెన్నూరు క్లస్టర్ ఏపీ డి మాధవి, స్టేట్ రిసోర్స్ పర్సన్ కుమార్, ఏపీవో రజియా సుల్తానా సిబ్బంది పాల్గొన్నారు.