13-03-2025 12:40:12 AM
చర్ల మార్చి 12 (విజయక్రాంతి) : మారుమూల గ్రామాల్లో సైతం పేదలకు కార్పొరేట్ స్థాయిలో నాణ్యమైన వైద్యం అందిస్తున్నాం, ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలకు రుకోట్లు వెచ్చిస్తున్నాం అంటూ ప్రభు త్వం ఊకదంపుడు ఉపన్యాసాలు దంచుతున్నా.. క్షేత్రస్థాయిలో అవి ఉట్టి మాటలే తప్ప ఆచరణలో లేవని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మారుమూల గిరిజన మండలమైన చర్ల లోని 30 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రం (సిహెచ్‌సి) నీ పరిశీలిస్తే తేటతెల్లమవుతోంది.
తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దు మండలమైన చర్ల సిహెచ్సికి సమీపంలోని ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని గ్రామాల ప్రజలు వైద్యం పొందేందుకు ఈ ఆసుపత్రి నే ఆశ్రయిస్తుంటారు. రోజుకు సుమారు 150 నుంచి 200 మంది వరకు రోగులు ఆసుపత్రికి వస్తుంటారు. నూటికి నోరు శాతం గిరిజన ప్రాంతం అంతటి అత్యవసరమైన ఆసుపత్రిలో సమస్యలు తీష్ట వేశాయి. దీంతో రోగులకు తిప్పలు తప్పడం లేదు.
ఆసుపత్రిలో ముగ్గురు వైద్యులు పనిచేస్తున్న వారిలో ఇద్దరు దంత వైద్య నిపుణులు, ఒకరు కాంట్రాక్ట్ పద్ధతిన పనిచేస్తున్న ఎంబిబిఎస్ వైద్యులు. అతి ముఖ్యమైన గైనకాలజిస్ట్ (స్త్రీల వైద్య నిపుణులు), జనరల్ మెడిసిన్, పిల్లల వైద్య నిపుణులు లేకపోవడంతో అన్ని రోగాలకు పంటి వైద్యులే వైద్యం చేయాల్సిన దుస్థితి నెలకొంది.
గర్భిణీల నవజాతి శిశువు స్థితిగతులను తెలుసుకోవడానికి ఈ ఆస్పత్రిలో స్కానింగ్ సౌకర్యం లేకపోవడం శోచనీయం. దీనికి తోడు ఉన్న ప్రసూతి గది నవజాతి సంరక్షణ కేంద్రం వర్షాకాలంలో కురుస్తుంది. అతి ముఖ్యమైన రేడియేషన్ సిబ్బంది, స్త్రీల వైద్య నిపుణులు లేని కారణంగా ఆసుపత్రికి వచ్చిన గర్భిణీలను 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించాల్సిన పరిస్థితి నెలకొంది.
దంత వైద్యులు ఉన్న ఈ ఆసుపత్రిలో దంత వైద్యం అందటం లేదంటే ఉన్నతాధికారుల పర్యవేక్షణ, చిత్తశుద్ధి ఏమరకుండా తేటతెల్లమవుతుంది. శవపరీక్షకు పక్కా భవన నిర్మించిన అధికారులు అందుకు సంబంధించిన నైట్ వాచ్మెన్, ఎం ఎన్ ఓ పోస్టులు మంజూరు చేయకపోవడం తో పక్కా భవనం ఉన్న ఉపయోగం సున్న అన్న చందాన ఉంది.
కేవలం అధికారులకు కమిషన్లు,కాంట్రాక్టర్కు లాభం చేకూర్చందుకే పక్కా భవన నిర్మించారా అనే విమర్శలు వస్తున్నాయి. ఆసుపత్రికి జనరేటర్ సౌకర్యం లేకపోవడంతో విద్యుత్ సమస్య తలెత్తినప్పుడు రోగులు అంధకారంలో నిరీక్షించాల్సిన పరిస్థితి ఉంది. తాజాగా గత నెల 13వ తేదీన ఆసుపత్రిలో డయాలసిస్ సౌకర్యం కల్పించారు.
ప్రస్తుతం ఐదు బెడ్స్ ద్వారా రోగులకు రక్త శుద్ధి చేస్తున్నారు. 9 మంది కిడ్నీ వ్యాధిగ్రస్తులకు రక్త శుద్ధి జరుగుతోంది. గతంలో భద్రాచలం వరకు వెళ్లాల్సిన తిప్పలు తప్పాయని కిడ్నీ వ్యాధిగ్రస్తులు చెబుతున్నారు.
ఈ వైద్యశాలలో రోగులకు నాణ్యమైన వైద్యం అందాలంటే అతి ముఖ్యమైన స్త్రీల వైద్య నిపుణులు, జనరల్ మెడిసిన్ వైద్యులు, రేడియాలజీ సిబ్బంది నియమించడంతోపాటు జనరేటర్ సౌకర్యం, కురుస్తున్న ప్రసూతి గది మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉంది. శివపరీక్ష గది వినియోగంలోకి రావాలంటే తక్షణమే నైట్ వాచ్మెన్, ఎం ఎన్ ఓ పోస్టుల భర్తీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని మండల ప్రజలు ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.